Lifestyle

సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన ఆరోగ్యానికి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

POPxo Team  |  Apr 11, 2019
సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన ఆరోగ్యానికి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

సెక్స్ (Sex).. కొందరి అభిప్రాయంలో ఇది అస్సలు బయటకు మాట్లాడకూడని విషయం. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో ఈ విషయం గురించి అస్సలు మాట్లాడరు. పిల్లలతో కలిసి టీవీ చూస్తున్నప్పుడు కూడా.. సెక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు వస్తే.. కాస్త అసౌకర్యానికి గురవుతాం. ఫలితంగా నేటి తరం యువతీ, యువకులు స్నేహితుల ద్వారానో.. లేక ఇంటర్నెట్‌ సహాయంతోనో.. ఎవరికీ తెలియకుండా సెక్స్ నాలెడ్జికి సంబంధించిన విషయాలు చదువుకొని దాని గురించి తెలుసుకోవాల్సి వస్తోంది.

కానీ అసలు మాటకొస్తే సెక్స్ అనేది మన జీవితంలో ఒక భాగం. మన శరీరం, మనసు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండేందుకు తోడ్పడే ఓ ఔషధం. ఒక వ్యక్తిని చూసి మీకు ఫీలింగ్స్ కలిగినప్పుడు మీ శరీరంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మన శరీరం సరైన రీతిలో అన్ని క్రియలను జరిపేందుకు తోడ్పడుతుంది.

సెక్స్ అంటే కేవలం శారీరకంగా, యాంత్రికంగా చేసే ప్రక్రియ మాత్రమే కాదు. మనస్ఫూర్తిగా సెక్స్‌లో పాల్గొంటే దాని ద్వారా.. మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయట.అందుకే మీరు మీ రోజువారీ రొటీన్‌లో సెక్స్‌ని భాగం చేసుకుంటే.. మీ సమస్యల్లో చాలా వరకూ తగ్గిపోతాయి. ఈ క్రమంలో మనం కూడా సెక్స్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో (Health benefits) తెలుసుకుందామా?

1. నొప్పులను తగ్గిస్తుంది.

చాలామంది తమ భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తి లేనప్పుడు తలనొప్పనో.. నడుము నొప్పనో సమాధానం ఇవ్వడం మనం సినిమాల్లో చూస్తుంటాం. మనం కూడా కొన్నిసార్లు అలా చేసి ఉంటాం. అయితే కావాలని కాకుండా మీకు నిజంగానే అలాంటి నొప్పులుంటే.. సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలన్నింటికీ అదే పెద్ద మందు. సెక్స్ వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.

ఇవి మన శరీరాన్ని సక్రమంగా నడిపే ఫీల్ గుడ్ హార్మోన్లు అన్నమాట. వీటి విడుదల వల్ల మన జీవక్రియలు సజావుగా సాగడం మాత్రమే కాదు.. నొప్పులు కూడా తగ్గిపోతాయట. అంటే సెక్స్ మంచి పెయిన్ కిల్లర్‌లా కూడా పనిచేస్తుందన్నమాట. మరి, ఇంతకంటే పెద్ద కారణం కావాలా? రోజువారీ రొటీన్‌లో దీన్ని భాగం చేసుకునేందుకు..

2. ఒత్తిడి హుష్ కాకి

ప్రస్తుతం లైఫ్ స్టైల్ చాలా బిజీగా మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్‌లో ఒత్తిడి మన దరిచేరకుండా జాగ్రత్త పడడం చాలా కష్టం. రోజువారీ డెడ్ లైన్లు, ప్రాజెక్టులు, రిపోర్టులు ఇలా ఆఫీసు పనులకు సంబంధించిన ఒత్తిళ్లతో పాటు కొందరికి వ్యక్తిగతమైన సమస్యలు కూడా బోలెడన్ని ఉంటాయి. ఈ సమస్యలన్నీ కలిసి మనల్ని ఒత్తిడి బారిన పడేస్తాయి. ఇది ఇలాగే ఎక్కువ కాలం కొనసాగితే గుండెజబ్బు, స్ట్రోక్ వంటి పెద్ద పెద్ద సమస్యలతో పాటు ఎన్నో మానసిక, శారీరక సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.

మరి, ఈ ఒత్తిడి సమస్యను దూరం చేసుకోవడానికి ఏం చేయాలో మీకు తెలుసా? మీ భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనాలి. అవును… సమస్యలున్నప్పుడు లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల.. కాసేపు వాటన్నింటినీ పక్కన పెట్టి రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మనసు, శరీరం రెండూ ఒత్తిడిని తగ్గించుకొని ఆనందాన్ని సొంతం చేసుకుంటాయి. సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఇది  ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

3. ఫిట్ బాడీ

ప్రతిఒక్కరూ ఫిట్‌గా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తున్న రోజులివి. అయితే రోజూ సెక్స్ చేయడం కూడా ఒక వ్యాయామం లాంటిదేనట. సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు మన తొడలు, పొట్ట కండరాలు, కాళ్లు, చేతులు వంటివన్నీ కదిలిస్తూ పొజిషన్స్ మారుస్తుంటాం కాబట్టి.. అది ఒక మంచి వ్యాయామంగానే మనకు తోడ్పడుతుంది. 

4. చర్మం మెరిసిపోతుంది.

సెక్స్‌కి, చర్మానికి ఏం సంబంధం ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఉంటుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో హార్మోన్లది కూడా ముఖ్యపాత్ర. సెక్స్ చేస్తున్నప్పుడు టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. వీటి వల్ల మన చర్మంలోని మలినాలు కూడా తొలగిపోయి.. ముఖంతో పాటు చర్మం మొత్తం మెరుస్తూ కనిపిస్తుంది.

5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగా తలెత్తుతాయట. ఎందుకంటే సెక్స్‌లో పాల్గొనడం వల్ల రోగాలు కలిగించే సూక్ష్మజీవులతో పోరాడే ఇమ్యూనో గ్లోబ్యులిన్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి.

6. మంచి నిద్ర

నిద్ర పట్టకపోవడం ఈ జనరేషన్‌కి ఉన్న పెద్ద సమస్య. ఇలా నిద్రలేమితో బాధపడేవారందరూ తమ భాగస్వామితో రోజూ లైంగిక చర్య జరపడం వల్ల.. చక్కటి నిద్రను సొంతంచేసుకోవచ్చట. రోజూ నిద్రపోవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మన నొప్పులు, మానసిక సమస్యలను తగ్గించి సుఖమైన నిద్రను అందిస్తాయి.

7. ఈ సమస్యలూ ఉండవు..

సెక్స్‌లో పాల్గొనడం వల్ల నొప్పులు తగ్గుతాయని మనం తెలుసుకున్నాం కదా. సాధారణ నొప్పులే కాదు.. అమ్మాయిలకు పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గుముఖం పట్టించే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల గర్భాశయం లోపలున్న లైనింగ్ పెరిగిపోయి బయటకు వస్తుందట. దీనివల్ల రక్తస్రావం ఎక్కువగా జరగడం, భరించలేని నొప్పి రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమస్యలు తగ్గించడంతో పాటు.. మీ నెలసరిని కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది.

ఇవి కూడా చదవండి.

సెక్స్ త‌ర్వాత.. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసా..?

ముద్దులోనూ ఎన్నో ర‌కాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా? (Types Of Kisses And Importance Of Kissing)

మొద‌టిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలివే..!

Read More From Lifestyle