ప్రియమైన అమ్మకి (My Dear Mom),
మనిద్దరం తల్లీకూతుళ్లలా కాక స్నేహితుల్లా ఉండేవాళ్లం. మన ప్రేమ (Love) అలా ఉండేది. కానీ ఈ మధ్య మనం ప్రతి చిన్న విషయానికి పెద్దగా గొడవపడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. ఒకరి అభిప్రాయాన్ని ఒప్పుకోవడానికి మరొకరం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే నీకు నేను చెప్పాలనుకునేది ఒకటే.. ఈ గొడవలు నీపై నాకున్న ప్రేమను, ప్రతి విషయంలోనూ నాకు ఎదురయ్యే నీ అవసరాన్ని ఏ మాత్రం తగ్గించవు. అయితే నేను చిన్న పిల్లను కాదు కాబట్టి నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.
1. నా జీవితం గురించి నేను తీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉంచు..
నా జీవితం ఆనందంగా సాగిపోవాలని నువ్వు భావిస్తావని నాకు తెలుసు. అయితే నా భవిష్యత్తు కోసం నేనూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. వాటిలో నేను విజయం సాధిస్తానని.. అవి నా జీవితాన్ని ఆనందంగా మారుస్తాయని నువ్వు కూడా నమ్ము. ఎందుకంటే నీ నమ్మకం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.. తల్లిగా నువ్వు చూపించే నమ్మకం నేను సరైన దారిలోనే వెళ్తున్నానన్న విశ్వాసాన్ని నాలో పెంచుతుంది. నా జీవితంలో మొదటి అడుగులు వేస్తున్న ఈ సమయంలో అది నాకెంతో అవసరం కూడా.
2. నేను రెబెల్‌ని కాదు..
నువ్వు చేయొద్దని హెచ్చరించిన విషయాలనే చేస్తున్నానని.. నీ కోరికలను కాదంటున్నానని.. నువ్వు నాపై కోపం పెంచుకుంటున్నావేమో.. కానీ నేను అలా ఏం చేయట్లేదు. చాలాసార్లు కొత్త విషయాలను ఓసారి ప్రయత్నించి చూద్దామని అనుకుంటున్నా. నా స్నేహితులంతా కొత్త విషయాలను ప్రయత్నిస్తున్నప్పుడు నేనూ ప్రయత్నించాలనుకుంటున్నా అంతే.. నన్ను నమ్ము అమ్మా.. నువ్వు తలదించుకునే పనులు నేనెప్పుడూ చేయను. నువ్వు నన్ను చాలా బాధ్యతతో పెంచావని అందరూ అనేలా చేస్తాను.
3. నువ్వు తేడా అనుకున్న విషయాలు.. ఇప్పుడు సహజమని గుర్తించు..
చాలా విషయాలు నీ దృష్టిలో తప్పుగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ సహజం. ఉదాహరణకు మీ జనరేషన్‌లో పొట్టి బట్టలు తప్పు కావచ్చు. కానీ ఇప్పుడది సహజం అయిపోయింది. నువ్వు దాన్ని తప్పనడం, నేను అది సరైనదే అనడం రెండు కరక్టే. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. మనిద్దరి మధ్య కాస్త జనరేషన్ గ్యాప్ కూడా ఉంది కాబట్టి.. మీ జనరేషన్‌లో తప్పు అని భావించినవన్నీ ఇప్పుడు మా దృష్టిలో సహజంగా మారిపోయాయని గుర్తించమ్మా.. ప్లీజ్..
4. ప్రైవసీ కావాలంటే మీ నుంచి దూరమవుతున్నానని కాదు..
నేను రోజూ కొత్త విషయం నేర్చుకుంటున్నా. కొత్త దారిలో వెళ్తూ ఎదురుదెబ్బలు తింటూ నేర్చుకుంటున్నా.ఇలాంటప్పుడు నాకు వివిధ రకాల భావోద్వేగాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నా సమస్యలను నేనే పరిష్కరించుకోవాలని మనసులో అనుకుంటాను. ఒంటరిగా ఉండి.. ఆలోచించాలనుకుంటాను. దాని అర్థం నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా చెప్పనని కాదు. కానీ నా సమస్యలను పంచుకోవడానికి.. నా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకుముందు కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటానని అర్థం అంతే..
5. స్నేహితుల ప్రభావం తప్పక ఉంటుంది..
నా గురించి నా స్నేహితులు, క్లాస్‌మేట్స్ ఏమనుకుంటారనే ఆలోచన నాకెప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు నా స్నేహితులు నీకు నచ్చకపోవచ్చు. కానీ కొన్నిసార్లు నేను చేసిన తప్పుల నుంచే నేను గుణపాఠాలు నేర్చుకోవాలనుకుంటాను. కొన్నిసార్లు నా స్నేహితులు నీకు నచ్చకపోయినా వాళ్లు మనసుకి మంచివాళ్లే కావచ్చు. అది కాస్త అర్థం చేసుకో అమ్మా..
6. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా నీ తోడు నాకు అవసరం.
నా జీవితం రోజూ మారుతోంది. నాలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులొస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నాకే అర్థం కావు. అప్పుడప్పుడూ సంతోషంగా అనిపిస్తే.. ఇంకొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకో నాకే అర్థం కాదు. అందుకే నువ్వు నా పక్కన ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటా. నేను నీకు చెప్పగలిగింది ఒక్కటే “నన్ను ప్రేమించు.. నా తప్పులను పెద్ద మనసుతో క్షమించు..” నా చిన్నతనంలో నేను తప్పు చేస్తే నవ్వి క్షమించిన నువ్వు ఇప్పుడూ అలాగే చేయమని నిన్ను కోరుకుంటున్నా.
7. నేనిప్పుడు చిన్నపిల్లని కాదు.
చాలాసార్లు నా జీవితం గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి మీ నిర్ణయమే ఫైనల్ అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ నా గురించి మీకు తెలిసిన దానికంటే ఎక్కువగా నా గురించి నాకు తెలుసు. నేను నాలా ఉండి.. కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ అవి తప్పైతే నేను వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా. కాబట్టి నా జీవితం గురించి కనీసం కొన్ని నిర్ణయాలైనా తీసుకునే హక్కు నాకు ఇవ్వండి. కొన్నిసార్లు నాకేదైనా ఇబ్బంది ఎదురైతే మీ సలహాలను తప్పక తీసుకుంటాను.
8. చిన్నపిల్లనా? పెద్దదాన్నా?
ఏ విషయంలోనైనా “నువ్వింకా చిన్నపిల్లవి కావు. పెద్దదానివి అయిపోయావు” అని చెప్పే నువ్వు.. నా జీవితం గురించిన నిర్ణయాన్ని తీసుకొనే విషయంలో “నేను చిన్నపిల్లని అని ఎందుకు అనుకుంటావు అమ్మా”.. మిగిలిన విషయాల్లో చిన్నపిల్లని కానప్పుడు.. పెద్దదానిలా నా నిర్ణయాలు నేనే తీసుకోగలనని గుర్తించండి.
9. నాకు స్వాతంత్రం కావాలి..
నాకు ఒక్కసారిగా నేను అనుకున్నవన్నీ చేయగలనన్న నమ్మకం వచ్చేసింది. ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండా అన్ని కొత్త విషయాలను ప్రయత్నించాలని ఎప్పుడూ నేను కోరుకుంటున్నా. తల్లిగా నువ్వు చేసేది నీకు సరిగ్గానే అనిపిస్తుండవచ్చు. కానీ నువ్వు నన్ను ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు స్వేచ్ఛగా ఎగిరే పక్షికి ఎవరో రెక్కలు కట్టేసి ఎగరకుండా ఆపేసినట్లుగా నాకు అనిపిస్తోంది. అందుకే మరీ ఎక్కువగా భయపడకుండా నాకు కొంచెం స్వేచ్ఛను అందించండి.
10. నీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నా.
కొన్ని విషయాలు నా స్నేహితురాలిగా భావించి నేను నీతో మాత్రమే పంచుకుంటాను. వాటిని నువ్వు ఎవరితోనూ చెప్పవని నా నమ్మకం. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్‌తోనో లేక నాన్నతోనో వాటిని పంచుకుంటే నేను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లుగా అనిపిస్తుంది. నాకు సంబంధించిన విషయాలను నీకు చెబుతున్నా అంటే అందరికంటే ఎక్కువగా నేను నిన్ను నమ్ముతున్నా కాబట్టే.. అందుకే ఆ విషయాలను ఎవరికీ చెప్పకమ్మా..
11. క్రమశిక్షణ పేరుతో మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకు..
నేను నీకు కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు అందులో తప్పులు, ఒప్పులు నువ్వు నాకు వివరిస్తూ ఉంటావు. కానీ అప్పుడు నేను చెబుతున్న విషయం నువ్వు వినాలనేదే నా ఆలోచన. నీ యాంగిల్‌లో చూస్తే నువ్వు నీ కూతురికి ఏది తప్పో, ఏది సరైనదో చెబుతున్నావు. కానీ ఇలా నేను మాట్లాడేటప్పుడు చెబితే.. మరోసారి అలాంటి విషయాలు నీకు చెప్పాలనిపించదు. దీనికి బదులు నీ జీవితంలో జరిగిన సంఘటనలు.. దాని ద్వారా నువ్వు నేర్చుకున్న విషయాలను నాకు చెప్పు. దీనివల్ల నేను భవిష్యత్తులో అలాంటి పరిస్థితి నాకెదురైనప్పుడు జాగ్రత్తగా ఉంటాను.
ఇవి కూడా చదవండి.
అమ్మానాన్నలను వదులుకోవడం నచ్చక.. సంప్రదాయాన్నే కాదన్న వధువు ..!
విజేతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మకు మాత్రం పసిబిడ్డే..!
ఆడపిల్లలంటే ఎప్పుడూ ప్రత్యేకమే..! ఎందుకో మీకు తెలుసా??
Images : Giphy, Gifskey