Lifestyle

మన బన్నీ.. ‘స్టైలిష్ స్టార్’ ఎలా అయ్యాడు? (అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్)

Babu Koilada  |  Apr 7, 2019
మన బన్నీ.. ‘స్టైలిష్ స్టార్’ ఎలా అయ్యాడు? (అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్)

అల్లు అర్జున్ (Allu Arjun).. టాలీవుడ్‌ సూపర్ డ్యాన్సర్స్‌లో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే పేరు. యాక్టింగ్, డ్యాన్స్‌లో తనదైన శైలిలో దూసుకుపోతూ.. తెలుగు చిత్ర  పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న యువ హీరో. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడైనా.. తన స్వయంశక్తితో ఎదిగి సత్తా చాటిన నటుడు.

గంగోత్రి చిత్రంతో తన కెరీర్ మొదలు పెట్టినా.. ఆర్య, దేశముదురు, పరుగు, రేసుగుర్రం, సరైనోడు లాంటి చిత్రాలతో తనదైన మార్కు నటనను కనబరిచిన యంగ్ టాలెంటెడ్ కథానాయకుడు.

సినీ కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే స్టైలిష్ స్టార్‌గా (Stylish Star) ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ఏప్రిల్ 8, 1983లో చెన్నైలో పుట్టి పెరిగిన అల్లు అర్జున్‌.. చిన్నప్పుడు ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. జిమ్నాస్టిక్స్, పియానో వాయించడం మొదలైన విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. అదే ఆసక్తి తర్వాత డ్యాన్స్ వైపు కూడా తన దృష్టి పడేలా చేసింది. ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌లో బన్నీ చేసే డ్యాన్స్ చూసి.. కుటుంబీకులు ఎంతగానో ప్రోత్సహించారు. ముఖ్యంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్, బన్నీకి డ్యాన్స్ విషయంలో ప్రధాన కాంపిటీటర్‌గా ఉండేవాడు.

బాలనటుడిగా అల్లు అర్జున్ విజేత, స్వాతి ముత్యం మొదలైన చిత్రాలలో నటించాడు. పెద్దయ్యాక కూడా చిరంజీవి హీరోగా నటించిన “డాడీ” చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ చిన్న పాత్ర కూడా ఒక డ్యాన్సర్‌ది కావడం విశేషం.

కె.రాఘవేంద్రరావు తన 101వ చిత్రానికి దర్శకత్వం వహించాలని సంకల్పించినప్పుడు.. కొత్త హీరో, హీరోయిన్లను పెట్టి ఓ సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ కథ రాసుకున్నారు. అదే ‘గంగోత్రి’. ఆ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా తన కెరీర్ ప్రారంభించగా.. ఆర్తి అగర్వాల్ సోదరి ఆదితి అగర్వాల్ హీరోయిన్‌గా తన తొలి సినిమాకి సైన్ చేసింది.

తొలి సినిమా ‘గంగోత్రి’తోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ చిత్రంలో నటించారు. బన్నీకి ఒక పూర్తి స్థాయి లవర్ బోయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన సినిమా అది. ప్రేమకథల్లో ఒక భిన్నమైన పంథాను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం.. బన్నీ కెరీర్‌లో ఒక మరపురాని చిత్రంగా
నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి తను ఉత్తమ నటుడిగా నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కూడా పొందడం గమనార్హం.

ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన బన్నీ, హ్యాపీ చిత్రాలు ఒక మోస్తరుగా ఆడినా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “పరుగు” చిత్రం బన్నీలోని ఒక పరిపూర్ణమైన నటుడిని టాలీవుడ్‌కి పరిచయం చేసింది.

ఆ సినిమాకి తను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అంతకు ముందే తను నటించిన పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘దేశముదురు’  చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

‘దేశముదురు’ చిత్రం తర్వాత.. అల్లు అర్జున్‌కి కేరళలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బన్నీ నటించిన చిత్రాలన్నీ మలయాళంలో డబ్ చేయబడి.. అక్కడి ప్రేక్షకులకు కూడా కనువిందు చేశాయి. ఆ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేశాయి.

2010లో బన్నీ నటించిన ‘వేదం’ చిత్రం తనకు నటుడిగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం. అందులో తను చేసిన కేబుల్ రాజు పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఆ తర్వాత వచ్చిన జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు.. బన్నీ కెరీర్‌ను కచ్చితంగా మలుపు తిప్పాయనడంలో సందేహం లేదు.

 

2011లో అల్లు అర్జున్ వివాహం, స్నేహా రెడ్డితో జరిగింది. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. 2016లో బన్నీ ‘800 జూబ్లీ’ పేరుతో ఒక నైట్ క్లబ్ కూడా ప్రారంభించారు. 2016లో గూగుల్‌లో ఎక్కువ సెర్చింగ్‌ను నమోదు చేసిన టాలీవుడ్ స్టార్‌గా అల్లు అర్జున్ రికార్డు సాధించారు.

2014లో సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సామాజిక బాధ్యత) అనే అంశంపై అల్లు అర్జున్ నిర్మించి, నటించిన “ఐ యామ్ దట్ ఛేంజ్” అనే షార్ట్ ఫిల్మ్‌కి మంచి ఆదరణ లభించింది. తన  ప్రధానమైన హాబీల్లో పుస్తకాలు చదవడం కూడా ఒకటి అని చెప్పే బన్నీ.. స్పెన్సర్ జాన్సన్ రాసిన “హూ మూవ్డ్ మై చీస్” అనే పుస్తకాన్ని తన ఫేవరెట్ బుక్‌గా చెబుతుంటారు.

మరి మనం కూడా స్టైలిష్ స్టార్‌కి POPxo తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్పేద్దామా..!

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!

ఒరు అదార్ ల‌వ్ తెలుగు ఆడియో విడుద‌ల‌కు.. ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్..!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!

Read More From Lifestyle