Food & Nightlife

రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

Sandeep Thatla  |  May 20, 2019
రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

హైదరాబాద్ (Hyderabad)ని ఒక ‘మినీ ఇండియా’ గా చాలామంది అభివర్ణిస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ అనేక రాష్ట్రాలకి చెందిన వారు ఒకరితో ఒకరు కలిసి మెలిసి జీవిస్తుంటారు. అదే సందర్భంలో ఇక్కడ హిందూ-ముస్లింలు ఎక్కువ సంఖ్యలో కలిసి జీవిస్తుండడంతో.. వీరి కలయికని ‘గంగా-జెమున తెహజీబ్’ అని కూడా పిలుస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ హైదరాబాద్ నగరానికి మణిహారంగా మరోదాన్ని చెప్పుకోవచ్చు. అదే హైదరబాదీ బిర్యాని (Hyderabadi Biryani). ప్రపంచంలో చాలా చోట్ల బిర్యాని లభిస్తున్నప్పటికి, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగే ఉందని చెప్పాలి.

అయితే రంజాన్ (Ramzan) ఉపవాస దీక్షల నేపథ్యంలో ఈ బిర్యానీ ఘుమఘుమలు.. నెల రోజుల పాటు తారాస్థాయికి చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మిగతా సీజన్స్‌తో పోలిస్తే ఈ సమయంలో బిర్యానీ రుచి చూసేందుకు బిర్యానీ ప్రియులు మరింత ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు.

దీనికి తోడు వినియోగదారుల మనసు గెలుచుకునేందుకు.. సదరు హోటల్ నిర్వాహకులు సైతం రకరకాల బిర్యానీలతో పాటు; ఇంకొన్ని రుచికరమైన వంటకాలను సైతం అందిస్తుంటారు.

ఈ క్రమంలో రంజాన్ సీజన్‌లో హైదరాబాద్ నగరంలో రుచికరమైన, అచ్చమైన హైదరబాదీ బిర్యానీ రుచి చూడాలంటే మాత్రం ఈ  హోటల్స్‌ని సందర్శించాల్సిందే..

సార్వి హోటల్ (Sarvi Hotel)

సాధారణంగా ఈ సార్వి హోటల్‌లో లభించే ఇరానీ ఛాయ్‌కి చాలా మంచి పేరుంది. అలాంటిది ఈ రంజాన్ సీజన్‌లో లభించే బిర్యానీ కోసం కస్టమర్లు బారులు తీరి మరీ ఎంతసేపైనా వేచిచూస్తారంటే అది అతిశయోక్తి కాదు. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి ముందు ఉన్న ఈ రెస్టరెంట్‌లో బిర్యానీతో పాటు రుచికరమైన మాంసాహార పదార్థాలు కూడా లభిస్తాయి.

చిరునామా- సార్వి హోటల్, కేర్ ఆసుపత్రి ముందు, బంజారా హిల్స్, హైదరాబాద్.

Image: Zomato

షా గౌజ్ కేఫ్ & రెస్టరెంట్ (Shah Ghouse Cafe & Restaurent)

టోలిచౌకి & హైటెక్ సిటీ వద్ద ఉన్న ఈ రెస్టరెంట్ గురించి హైదరాబాద్‌లో తెలియని వారుండరు. ఈ బిర్యానీ సెంటర్ అంతగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంది. సంవత్సరం పొడవునా అత్యంత రుచికరమైన బిర్యానీ లభించే ఈ హోటల్‌లో రంజాన్ సీజన్‌లో స్పెషల్ బిర్యానీ పేరిట మరింత రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఇక దీనికి తోడుగా హలీమ్ ఎలాగూ ఉండనే ఉంటుంది. బిర్యానీ లవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని రెస్టరెంట్ ఇది.

చిరునామా- షా గౌజ్ కేఫ్ & రెస్టరెంట్, ఆర్.టీ.ఏ ఆఫీసు పక్కన, టోలిచౌకి & బయో-డైవర్సిటీ సిగ్నల్ దగ్గర, రాయదుర్గం.

Image: Zomato

 

ఆల్ఫా హోటల్ (Alpha Hotel)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపలికి రాగానే మనకు ఈ ఆల్ఫా హోటల్ దర్శనమిస్తుంది. ఈ హోటల్‌లో స్నాక్స్ మొదలుకొని బిర్యానీ వరకు అన్నీ లభిస్తాయి. పైగా ఇక్కడ ధరలు సామాన్యులకి సైతం అందుబాటులో ఉండడంతో చాలామంది ఈ హోటల్‌కి వస్తుంటారు. దాదాపు దశాబ్దాల క్రితం నెలకొల్పబడిన ఈ హోటల్‌లో లభించే బిర్యానీ అద్భుతమనే చెప్పాలి. ఈ హోటల్‌లో బిర్యానీని ఆస్వాదించడానికి ఎంతో మంది రైలు ప్రయాణం చేసే వారు సైతం ఆసక్తి చూపుతుంటారు.

చిరునామా- ఆల్ఫా హోటల్, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్.

Image: Zomato

 

కేఫ్ బహార్ (Cafe Bahar)

కేవలం రంజాన్ సీజన్‌లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఈ కేఫ్ & రెస్టరెంట్‌లో లభించే బిర్యాని రుచి అమోఘం అని చెప్పి తీరాల్సిందే. ఈ రెస్టరెంట్‌లో రంజాన్ సీజన్‌లో ప్రత్యేకంగా బిర్యానీ‌తో పాటుగా హలీమ్‌ని కూడా రుచి చూసేందుకు భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తుంటారు.

చిరునామా- ఓల్డ్ ఎమ్యెల్యే క్వార్టర్స్ రోడ్డు, అవంతి నగర్, హిమాయత్ నగర్, హైదరాబాద్.

Image: Zomato

 

బావార్చి (Bawarchi Hotel)

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సినిమా థియేటర్స్ ఎంత ఫేమస్సో.. అదే స్థాయిలో అక్కడ ఉన్న బావార్చి రెస్టరెంట్ కూడా ఫేమస్ అని చెప్పచ్చు. ఈ హోటల్‌లో “మాకు ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు” అనే ఒక బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఈ హోటల్‌కి ఎంతటి పేరు- ప్రఖ్యాతులు ఉన్నాయో; నగరంలో మిగతా హోటల్స్ వీరి ఆహారపదార్థాల తయారీ శైలిని అనుకురించేందుకు ఏ స్థాయిలో పోటీ పడతాయో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఇలాంటి బావార్చి హోటల్‌లో బిర్యానీ అంటే అసలు వంక పెట్టే వీలు కూడా ఉండదు.

చిరునామా- బావార్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.

Image: Zomato

 

ప్యారడైజ్ (Paradise Hotel)

ఈ హోటల్ కొద్ది రోజుల క్రితమే ఒక సంవత్సర కాలంలో అత్యధిక బిర్యానీలను విక్రయించినందుకుగానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించి రికార్డు స్రుష్టించింది. ఒకప్పుడు కేవలం సికింద్రాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్న ఈ హోటల్ తర్వాతి కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైటెక్ సిటీ, మసాబ్ ట్యాంక్ & ప్రసాద్స్ ఐమ్యాక్స్ వద్ద కొత్త శాఖలను నెలకొల్పింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందంటే ఈ హోటల్ లో లభించే బిర్యానీ రుచి కోసం ప్రత్యేకంగా చెప్పాలా??

చిరునామాలు- ప్యారడైజ్ సెంటర్,  మసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ (హైటెక్ సిటీ)

Image: Zomato

హోటల్ షాదాబ్ (Hotel Shadab)

హైదరాబాద్‌లోని పాత నగరంలో (ఓల్డ్ సిటీ) ఉన్న ఈ హోటల్‌కి దేశ, విదేశాల్లో కూడా కస్టమర్లున్నారు. ముఖ్యంగా రంజాన్ సీజన్‌లో అయితే.. ఈ రెస్టరెంట్‌లో కూర్చుని తినడానికి మనకి ప్లేస్ కూడా దొరకడం కష్టమంటే.. దీనికి ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ నోరూరించే బిర్యానీ రుచి చూశాక కాసేపు చార్మినార్ అందాలను కూడా ఆస్వాదించి వెళ్తుంటారు పర్యటకులు, నగరవాసులు.

చిరునామా- మదీనా సర్కిల్‌కి ఎదురుగా, చార్మినార్, హైదరాబాద్.

Image: Zomato

ప్రిన్స్ రెస్టరెంట్ (Prince Restaurent)

ఈ హోటల్‌లో లభించే బిర్యానీ కోసం నగరం నలుమూలల నుంచి బిర్యానీ ప్రియులు మెహదీపట్నంకి వస్తుంటారు. ఇక్కడ బిర్యానీ అత్యంత రుచిగా ఉండడమే ఇంతటి ఫాలోయింగ్‌కి కారణం. పైగా ఈ హోటల్ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళడం కూడా చాలా సులువు కావడంతో.. అక్కడికి షాపింగ్‌కి వెళ్లేవారంతా ఇక్కడ ఆగి, బిర్యాని రుచి చూసి మరీ వెళుతుంటారు.

చిరునామా- బస్ డిపో రోడ్డు, మెహదీపట్నం, హైదరాబాద్.

Image: Zomato

డైన్ హిల్ రెస్టరెంట్ (Dine Hill Restaurent)

ప్రఖ్యాత అరబిక్ పద్దతిలో ఒక పెద్ద ప్లేట్‌లో బిర్యానీ అందించడం ఈ డైన్ హిల్ రెస్టరెంట్ స్పెషాలిటీ. ఈ రెస్టరెంట్‌లో సింగల్ మొదలుకుని ఫ్యామిలీ, జంబో ప్యాక్ వరకు రకరకాల పెద్ద ప్లేట్స్‌లో కస్టమర్స్‌కి బిర్యానీ వడ్డిస్తుంటారు. బిర్యానీని అరబిక్ స్టైల్‌లో రుచి చూడాలనుకునేవారు ఇక్కడకి తప్పక విచ్చేయాల్సిందే..

చిరునామా- బంజారాహిల్స్ రోడ్డు నెం- 1, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్.

Image: Zomato

తెలుసుకున్నారుగా.. హైదరాబాద్‌లో రుచికరమైన బిర్యానీ దొరికే 9 హోటల్స్‌కు సంబంధించిన వివరాలు. మరింకెందుకు ఆలస్యం.. ఈ రంజాన్ సీజన్‌లో నోరూరించే బిర్యానీ రుచి చూసేందుకు మీరూ రడీ అయిపోండి.

Featured Image: twitter.com/samantha akkineni

 

ఇవి కూడా చదవండి

హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!

రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

Read More From Food & Nightlife