Entertainment

టాలీవుడ్ మహిళా దర్శకుల గురించి ఆసక్తికర విషయాలివే..!

Sandeep Thatla  |  Dec 12, 2018
టాలీవుడ్ మహిళా దర్శకుల గురించి ఆసక్తికర విషయాలివే..!

తెలుగు ప్రజలు అమితంగా ఇష్టపడే వాటిలో సినిమా ఒకటి . సంవత్సరంలో దాదాపు ప్రతి వారం తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక సినిమా విడుదలవుతుంది అంటే కచ్చితంగా నమ్మాల్సిందే . అటువంటి టాలీవుడ్ (Tollywood) చిత్రపరిశ్రమలో అనేక హిట్ సినిమాలు అందించిన దర్శకుల్లో.. తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న పలువురు మహిళా దర్శకులు కూడా ఉన్నారు. వారి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం

తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి మన తొలితరం మహిళా దర్శకుల్లో భానుమతి రామకృష్ణ కూడా ఒకరు. నటిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా , నేపధ్యగాయనిగా, నిర్మాతగా కూడా ఆమె తెలుగు సినిమాల పైన తనదైన ముద్రని వేయగలిగారు. తన మొత్తం నటనా ప్రస్థానంలో సుమారు 14 సినిమాలకి దర్శకత్వం వహించిన ఆమె తెలుగు సినిమా మహిళా దర్శకుల్లో ముందు వరుసలో నిలబడ్డారు అని చెప్పుకోవచ్చు.

ఆ తరువాత కాలంలో మరో ఇద్దరు ప్రముఖ నటీమణులు కూడా మెగా ఫోన్ ని చేతబట్టి సినిమాలకి దర్శకత్వం వహించారు . అందులో ఒకరు మహానటి సావిత్రి కాగా మరొకరు స్టార్ హీరోయిన్ విజయనిర్మల . సావిత్రి తన దర్శకత్వంలో మూడు చిత్రాలని చేశారు . అందులో ఒకటి తమిళం.. కాగా మరొక రెండు చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించారు. చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం, మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం, ప్రాప్తం మొదలైన చిత్రాలకు సావిత్రి దర్శకత్వం వహించారు.

ఇక విజయ నిర్మల విషయానికి వస్తే , ఆమె తన మొత్తం కెరీర్ లో 42 చిత్రాలకి దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆమె కూడా ఎంతోమంది మహిళా దర్శకులకి ఆదర్శం అని చెప్పొచ్చు .

ఆ తరువాత కాలంలో మరో నటి జీవిత రాజశేఖర్ కూడా మెగా ఫోన్ పట్టి శేషు, ఎవడైతే నాకేంటి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఇక మహిళా డైరెక్టర్లలో బి. జయ మాత్రం జర్నలిస్ట్ నుండి దర్శకురాలిగా మారిన వారిలో తొలివారు . తన కెరీర్ లో మొత్తం ఆరు చిత్రాలకి ఆమె దర్శకత్వం వహించారు . చంటిగాడు, లవ్లీ లాంటి చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.

ఇక నేటి తరం యువ మహిళా దర్శకుల్లో నందిని రెడ్డి ఇప్పటికే మూడు చిత్రాలకి దర్శకత్వం వహించి త్వరలోనే సమంతతో మరో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. “అలా మొదలైంది” చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆమె తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర చంద్రబోస్ కూడా ఒక చిత్రానికి దర్శకత్వం వహించగా సూపర్ స్టార్ కృష్ణ తనయ నటి మంజుల.. అలాగే నవతరం అమ్మాయిలు అయిన చునియా, శశి కిరణ్, షాలిని రెడ్డిలు చెరొక చిత్రానికి దర్శకత్వం వహించారు .

దాదాపు మన చిత్రసీమలో 10 మంది వరకు మహిళా దర్శకులు ఇప్పటివరకు తమ దర్శకత్వ ప్రతిభని ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేశారు. వీరి స్పూర్తితో భవిష్యత్తులో మరెందరో మహిళా దర్శకులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తారు అని ఆశిద్దాం …

Read More From Entertainment