మేజర్ శశిధరన్ విజయ్ నాయర్(Major Shashidharan Nair) .. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ముష్కరుల బాంబుదాడికి గురై మరణించిన అమర జవాన్. దేశం మీద ఉన్న ప్రేమతో ప్రాణత్యాగానికి కూడా వెనకాడని సైనికుడే కాదు.. అతనిలో అందరూ వద్దన్నా.. వైకల్యంతో బాధపడుతున్న ప్రేమికురాలిని పెళ్లాడి.. కంటికి రెప్పగా కాపాడిన భర్త కూడా ఉన్నాడు.. గత వారం పాకిస్థాన్ బోర్డర్‌లో ఐఈడీ పేలుడులో మరణించిన శశిధరన్ అంత్యక్రియలు ఇటీవలే పూర్తయ్యాయి.
పూర్తి మిలిటరీ గౌరవమర్యాదలతో పూర్తయిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అయితే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కదలించివేసిన విషయం మాత్రం నడుము వరకూ శరీరం చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమైన నాయర్ భార్య తృప్తి బాధే.. వీరిద్దరి ప్రేమ కథ (True love story)విన్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించకమానదు.
పుణెలోని డిఫెన్స్ కాలనీకి దగ్గర్లో నివసించే మేజర్ శశిధరన్ నాయర్.. చిన్నతనం నుంచి ఆర్మీలో చేరాలనే భావించేవాడట. ఎన్‌సీసీలో చేరి.. మిలిటరీ పట్ల తనకున్న ఇష్టాన్ని మరింతగా పెంచుకున్నాడు. మిలిటరీలో స్థానం సంపాదించిన తర్వాత ఇరవై ఏడేళ్ల వయసులో తన స్నేహితుల ద్వారా కంప్యూటర్ విద్యార్ధిని అయిన తృప్తిని మొదటిసారి కలిశాడు నాయర్. తనని చూడగానే ప్రేమలో పడిపోయి.. తనతో పరిచయం పెంచుకొని.. తన ప్రేమ విషయం చెప్పాడు. దానికి తృప్తి కూడా ఒప్పుకోవడంతో కొన్నినెలల్లోనే వారిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక తామిద్దరం ఎప్పుడూ ఒకటిగానే ఉంటామన్న ఆలోచనతో ఆనందంలో మునిగిపోయిందా జంట.
అయితే ఎప్పుడూ మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? నిశ్చితార్థం జరిగిన ఎనిమిది నెలలకు తృప్తి అనుకోని సమస్యతో మంచాన పడింది. ఎంతోమంది వైద్యులకు చూపించినా అది ఏమాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతూనే వచ్చింది. కొన్నాళ్లకు వైద్యులు ఆమె ఆర్టిరియోస్క్లిరోసిస్ అనే అరుదైన వ్యాధికి గురైందని.. ఇక ఆమె తిరిగి మామూలు మనిషి కావడం కష్టమని తేల్చి చెప్పారు.
ఈ వ్యాధికి గురైనవారిలో రక్తనాళాలు ఉబ్బుతూ రక్తప్రసరణకు అడ్డుపడతాయి. అలా ఒక్కోభాగం రక్తప్రసరణ లేక చచ్చుబడుతూ పోతుంది. ఇది తెలుసుకొని బంధుమిత్రులంతా నిశ్చితార్థం రద్దుచేసుకొని తనకు తగిన అమ్మాయిని వెతుక్కొని పెళ్లిచేసుకోమని నాయర్‌కి ఎన్నో సలహాలిచ్చారు. కానీ నాయర్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు.. తృప్తి అందమైన మనసునే ప్రేమించిన ఆయన తనని పెళ్లిచేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు.
కుటుంబ సభ్యులను ఒప్పించి ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెను వివాహమాడాడు. అయితే దురదృష్టవశాత్తూ పెళ్లయిన కొన్నిరోజులకే తృప్తి పక్షవాతానికి గురైంది. దీనివల్ల ఆమె నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. అయినా తన భార్యపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదని నిరూపించాడు నాయర్. పక్షవాతానికి గురైన భార్యను పసిపాపలా సాకడంతో పాటు.. ఎక్కడికి వెళ్లినా తనని కూడా తీసుకెళ్లేవాడు నాయర్. నవ్వుతూ, నవ్విస్తూ ఆమెకు వైకల్యం ఉన్న సంగతి తనకు గుర్తుకురాకుండా ఉండేందుకు ప్రయత్నించేవాడు.
అంతేకాదు.. కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులెవరూ తృప్తిపై జాలిపడకుండా ఉండేలా జాగ్రత్తపడేవాడు. ఆర్మీ కుటుంబం కావడంతో పెళ్లి తర్వాత పార్టీలు, ఇతర ఫంక్షన్లకు ఎక్కువగా వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి కూడా భార్యతో కలిసి వెళ్లేవాడు నాయర్. భార్యను వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆమెను చేతులపై మోసుకొని తీసుకెళ్లేవాడే తప్ప వదిలి వెళ్లడం తనకిష్టం లేదని చెప్పేవాడట. నాయర్ ప్రేమను చూసి నిజమైన ప్రేమంటే కేవలం సినిమాలు, పుస్తకాల్లోనే ఉంటుందేమో అనుకునే వారి స్నేహితులకు నిజంగా ఉంటుందని నిరూపించాడు.
కశ్మీర్‌లో పోస్టింగ్ కి ముందు నెలరోజుల పాటు ఇంట్లోనే సెలవుపై ఉన్న నాయర్ తృప్తితో కలిసి ప్రశాంతంగా కాలం గడిపాడట. కశ్మీర్‌లో పోస్టింగ్ అనగానే భయపడిన తన భార్యకు తనకేమీ కాదని.. కొన్నిరోజుల్లోనే తిరిగొస్తానని చెప్పి వెళ్లాడట. మళ్లీ వస్తానని ఒట్టేసి వెళ్లిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్తను తృప్తి నాయర్ (Trupti Nair) భరించలేకపోతోంది. అయితే ఆమె బాధపడితే అది తన ప్రాణాలకే ప్రమాదమని.. రక్తనాళాలు మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రాణానికి ప్రాణమైన భర్త మరణానికి మనసారా బాధపడలేని పరిస్థితి తృప్తిది. భగవంతుడు ఆమెకు ఈ కష్టాలను తట్టుకునే శక్తినివ్వాలని మనమూ ప్రార్థిద్దాం.
Photo: Facebook
ఇవి కూడా చదవండి
మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?
కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా?
ఒంటరి అమ్మాయిలకు ఇవి తప్పవు.. కానీ ఆత్మ విశ్వాసంతో దూసుకుపోవాల్సిందే..!