Food & Nightlife

మండు వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే.. కూల్ కూల్ ఐస్డ్ టీ రెసిపీస్ మీకోసం..!

Lakshmi Sudha  |  Apr 24, 2019
మండు వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే.. కూల్ కూల్ ఐస్డ్ టీ రెసిపీస్ మీకోసం..!

మన దేశంలో టీ తాగడానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారైనా టీ తాగకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధపడేవారూ ఉంటారు. కానీ ప్రస్తుతం మనం మండువేసవిలో ఉన్నాం. ఇంత ఉష్ణోగ్రతల్లో వేడి వేడి టీ తాగితే మనకు పెట్టే ఉడుకుని భరించడం చాలా కష్టం. అలాగని టీ తాగకుండా ఉండలేం. అయితే మరెలా? దానికీ ఓ ఉపాయం ఉంది. చల్లచల్లగా ఐస్ టీ తయారుచేసుకొని తాగడమే.

ఐస్డ్ టీ తయారు చేసుకోవడం చాలా సులభం. పైగా ఇది వేసవిలో దాహార్తిని తీరుస్తుంది. పనిలో పనిగా టీ తాగడం వల్ల వచ్చే కిక్‌ను కూడా అందిస్తుంది. మరింకెందుకాలస్యం.. చల్లచల్లటి ఐస్డ్ టీ రెసిపీలు (Iced tea recipe) తెలుసుకొని వాటిని ఓసారి ట్రై చేద్దాం. వీటిని మీరు మాత్రమే కాకుండా.. కిట్టీ పార్టీల్లాంటివి ఏర్పాటు చేసుకొన్నప్పుడు మీ స్నేహితులకు సైతం రుచి చూపించవచ్చు.

1. యాపిల్ – సినామన్ ఐస్డ్ టీ (Apple Cinnamon iced tea)

కావాల్సినవి:

నీరు – నాలుగు కప్పులు,  యాపిల్ జ్యూస్ – రెండు కప్పులు (చల్లగా ఉన్నవి), దాల్చిన చెక్క – 2 (అంగుళం పొడవున్నవి), గ్రీన్ టీ బ్యాగ్స్ – 4, తేనె – టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్, గ్రీన్ యాపిల్ ముక్కలు(గార్నిషింగ్ కోసం)

తయారీ విధానం:

గిన్నెలో నీరు పోసి, తేనె, టీ బ్యాగులు కూడా వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత టీ బ్యాగులను తీసేసి మరో గిన్నెలోకి వడపోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. బాగా చల్లబడిన తర్వాత యాపిల్ జ్యూస్, ఐస్ క్యూబ్స్ కూడా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి గ్రీన్ యాపిల్ ముక్కలతో గార్నిషింగ్ చేసి సర్వ్ చేయాలి. ఈ ఐస్డ్ టీ నలుగురికి సర్వ్ చేయడానికి సరిపోతుంది.

2. వాటర్ మిలన్ మింట్ ఐస్డ్ టీ (Water Melon – Mint Iced tea)

కావాల్సినవి: పుచ్చకాయ ముక్కలు ఎనిమిది కప్పులు,  బ్లాక్ టీ బ్యాగ్స్ – 7, తేనె – రెండు చెంచాలు, పుదీనా ఆకులు – అరకప్పు, నీరు – ఆరుకప్పులు

తయారీ విధానం:

పుచ్చకాయ ముక్కలను బ్లెండర్లో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని వడపోసి ఫ్రిజ్లో పెట్టాలి. గిన్నెలో నీరు పోసి మరగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి మరిగిన నీటిలో టీ బ్యాగ్స్ వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. టీ బ్యాగులను తీసేసి తేనె కలపాలి. ఆపై పుదీనా ఆకులను కూడా వేసి ఫ్రిజ్లో ఉంచాలి. ఈ మిశ్రమం బాగా చల్లబడిన తర్వాత ఫ్రిజ్లోంచి బయటకు తీసి వడపోయాలి. దీనిలో పుచ్చకాయ జ్యూస్ కలిపి గ్లాసుల్లో పోసి.. పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇది నలుగురికి సరిపోతుంది.

3. లెమన్ ఐస్డ్ టీ(Lemon Iced tea)

కావాల్సినవి: టీ బ్యాగులు – 8, నీరు – రెండున్నర లీటర్లు, పంచదార – అరకప్పు లేదా సరిపడినంత, నిమ్మరసం – అరకప్పు

తయారీ విధానం: గిన్నెలో నీరు, టీ బ్యాగులు, పంచదార, నిమ్మరసం వేసి వేడిచేయాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మూడు నిమిషాల తర్వాత గిన్నె నుంచి టీ బ్యాగులను తీసేయాలి. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మరో గిన్నెలోకి వడపోసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి.

ఆ తర్వాత గ్లాసుల్లో పోసి నిమ్మకాయ స్లైస్, పుదీనా ఆకుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇది నలుగురికి సర్వ్ చేయడానికి సరిపోతుంది. లెమన్ మింట్ టీని ఉదయం తయారు చేసి ఫ్రిజ్లో పెట్టుకొంటే మధ్యాహ్నానికి సర్వ్ చేయడానికి సిద్ధమవుతుంది.

4. మ్యాంగో ఐస్డ్ టీ (Mango Iced tea)

కావాల్సినవి: బాగా పండిన మామిడి పండ్ల గుజ్జు – ఒకటిన్నర కప్పు, రెండు టీస్పూన్ల టీపొడి లేదా మూడు బ్లాక్ టీ బ్యాగులు, నీరు – నాలుగు కప్పులు, నిమ్మరసం – అరచెంచా, పంచదార – సరిపడినంత

తయారీ విధానం: ముందుగా మామిడి పండ్ల గుజ్జును ఫ్రిజ్లో పెట్టాలి. గిన్నెలో నీరు పోసి మరిగించాలి. ఆ తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి దించి అందులో బ్లాక్ టీ బ్యాగులు వేసి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత మిశ్రమాన్ని వడపోసి ఫ్రిజ్లో పెట్టాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత ఫ్రిజ్లోంచి తీసి మిక్సీలో వేయాలి.

దీనికి మామిడిపండ్ల గుజ్జు, నిమ్మరసం, పంచదార వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి ఐస్ క్యూబ్స్ వేయాలి. పుదీనా లేదా మామిడి ముక్క లేదా నిమ్మ స్లైస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మనం తయారు చేసిన ఈ మిశ్రమం ముగ్గురికి సర్వ్ చేయడానికి సరిపోతుంది.

5. లెమన్ లావెండర్ ఐస్డ్ టీ (Lemon – Lavender Iced tea)

కావాల్సినవి: ఎండబెట్టిన లావెండర్ పూలు – రెండు చెంచాలు, నిమ్మకాయ – ఒకటి, పంచదార – అరకప్పు, ఐస్ క్యూబ్స్, నీరు – మూడు కప్పులు, టీ బ్యాగులు – రెండు

తయారీ విధానం: గిన్నెలో నీటిని వేసి మరగనివ్వాలి. టీ బ్యాగులతో పాటు పలుచని వస్త్రంలో లావెండర్ పూలు వేసి మూటగా కట్టి.. మరిగిన నీటిలో ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా మారిన తర్వాత నిమ్మరసం పిండి గ్లాసుల్లో పోసి సర్వ్ చేయాలి. గార్నిష్ కోసం లావెండర్ పూలు, నిమ్మ స్లైస్ ఉపయోగించవచ్చు.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్

Read More From Food & Nightlife