Lifestyle
మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..? (Types Of Relationships You Need To Know)
మన జీవితంలో పరిచయమయ్యే ప్రతి వ్యక్తితోనూ మనకు ఒక బంధం అంటూ ఏర్పడుతుంది. అది స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఇలా ఏర్పడే బంధాల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి కి ఉండే ప్రాధాన్యాలను బట్టి వారితో ఉండే బంధం కూడా మారుతూ ఉంటుంది.
లవ్ రిలేషన్స్ రకాలు (Types Of Love Relationships)
అసలు ఈ బంధాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుంటే వాటిలో మీది ఏ రకమైన బంధమో సులభంగా గుర్తించవచ్చు. మరి, అవేంటో తెలుసుకుందామా..
తొలి ప్రేమ (First love) అపురూపం.. (First Love Is Always Precious)
ప్రతిఒక్కరికీ వారి తొలిప్రేమ చాలా ప్రత్యేకం. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మీరిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరనే అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకరికొకరు లోకంగా మారిపోతారు.ఇలాంటి బంధంలో రాత్రి సమయాల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరి కంటా పడకుండా రహస్యంగా కలుసుకోవడం, ప్రేమ ఒక్కటి ఉంటే చాలు.. ఈ లోకాన్నే జయించవచ్చు అన్న భావన కలగడం.. వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ తరహా బంధాలు ఎంత కాలం కొనసాగుతాయన్నది చెప్పడం కాస్త కష్టమే! కానీ ఇది మనకు జీవితంలో ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది.
పూర్తి విరుద్ధమే కానీ..(Opposite Attract Relationship)
కొన్ని జంటలను పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ అలా పరస్పరం విరుద్ధమైన స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో ఇమడగలుగుతున్నారంటే నిజంగా కాస్త ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నవారంతా భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు అధిక కాలం కలిసి జీవించలేరని భావిస్తుంటే.. మీరిద్దరూ మాత్రం ఎవరి ప్రాధాన్యాలు వారు చూసుకుంటూనే కలిసి సంతోషంగా జీవనం ముందుకు సాగిస్తున్నారు.
ఒకరి కోసం మరొకరు..(Soulmates Relationship)
ఈ బంధంలో ఉన్న జంటను చూసిన ఎవరికైనా వీరు ఒకరి కోసం మరొకరు పుట్టారేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే భాగస్వామికి నచ్చే విధంగా ఉండేందుకు మిమ్మల్ని మీరు మార్చుకోవడంతోపాటు, వారిలో ఉన్న లోపాలు, బలహీనతలను సైతం అంగీకరించి ఎల్లవేళలా వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు. అలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ; అమితంగా ప్రేమించుకుంటూ కేవలం మీ సంతోషానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే చుట్టూ ఉన్నవారు కూడా ఆలుమగలు అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి తెలుసుకోవాలని భావిస్తారు. అందరితోనూ ఉత్తమ జంట అనిపించుకుంటారు.
ఏదో ఆశించేవారు..(Friends With Benefits)
ఈ తరహా బంధాల్లో చెప్పుకోవడానికి ఇద్దరూ స్నేహితులనే చెప్తారు. కానీ ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. తమ బంధం గురించి ఇద్దరికీ ఎవరి హద్దులు వారికి తెలిసినప్పటికీ అవతలి వ్యక్తి నుంచి తమకు నచ్చినది పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఇలాంటి బంధాలు కేవలం తాత్కాలికంగానే మిగిలిపోతాయి.
హానికరమైన బంధం ..(Toxic Relationship)
ఇలాంటి బంధాల నుంచి బయటపడడం చాలా కష్టం. అదీకాకుండా ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి. ఎందుకంటే ఈ బంధంలో ఉండే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మరొకరిని శారీరకంగా లేదా మానసికంగా లేదా రెండు విధాలుగానూ హింసిస్తూ ఉంటారు. కానీ తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు వీరికి చాలా సమయం పడుతుంది. ఈలోగా వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఆత్మన్యూనతా భావన ఏర్పడడం.. వంటివి జరుగుతుంటాయి. ఫలితంగా ఆ బంధం నుంచి బయటపడలేక మానసికంగా కుంగిపోయి డిప్రెషన్ బారిన పడచ్చు. కానీ ఒక్కసారి ఈ బంధం నుంచి బయటపడి తమ జీవితాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునే వ్యక్తి ఎవరైనా అటు పై వచ్చే ఏ సమస్యనైనా చాలా ధైర్యంగా ఎదుర్కోగలరు.
స్నేహితులే ప్రేమికులైతే..(Friends Who Should Date Relationship)
ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహితులే! కానీ వారిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారన్న విషయం వారికి తప్ప చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులను మనం కూడా మన జీవితాల్లో చాలామందిని చూస్తూనే ఉంటాం. చూడడానికి చాలా క్యూట్‌గా అనిపించే ఈ తరహా బంధంలో ఒకరి దృష్టిని మరొకరు ఆకర్షించేందుకు ప్రయత్నించడం, సరదాగా ఆటపట్టించడం, రహస్యంగా మాట్లాడుకోవడం.. వంటివి చేస్తుంటారు. అయితే తమ బంధాన్ని సీరియస్‌గా తీసుకునే వారు ప్రేమను పెళ్లి పట్టాలు ఎక్కిస్తే టైంపాస్‌గా భావించేవారు మాత్రం అక్కడితోనే ఫుల్‌స్టాప్ పెట్టేస్తారు.
ఎక్కడున్నా మాదే లోకం.. (The PDA Relationship)
కొన్ని జంటలు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. సందర్భం వచ్చిన ప్రతిసారీ పరస్పరం తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూనే ఉంటారు. అయితే అది కేవలం ఇంటికే పరిమితం అని అనుకోకండి. ఎందుకంటే జీవిత భాగస్వామి పట్ల తమకు ఉన్న ప్రేమను బాహాటంగా వ్యక్తం చేసేందుకు కూడా ఈ తరహా వ్యక్తులు ఏమాత్రం వెనకాడరు. అలాగే తమ బంధానికి, వారి సంతోషానికి అద్దం పట్టేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో సైతం పంచుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని కొన్ని సందర్బాల్లో ఇలాంటి వ్యక్తుల ప్రేమను తట్టుకోవడం కాస్త కష్టమే అనిపిస్తుంటుంది!
ఒకసారి దెబ్బతిన్నప్పటికీ..(Rebound)
గతంలో వైవాహిక జీవితంలో ఒకసారి దెబ్బతిని ఆశావాహ దృక్పథంతో మరోసారి ఆ బంధంలో అడుగుపెడుతున్న వ్యక్తులు ఈ రోజుల్లో చాలామందే ఉంటున్నారు. అయితే ఒక్కో జంటలో ఇద్దరూ ఈ తరహా బాధితులే ఉంటే; ఇంకొన్ని జంటల్లో కేవలం ఒకరే ఉంటూ ఉంటారు. కానీ ఈ బంధం కూడా ఎంతకాలం కొనసాగుతుందన్నది చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ తరహా బంధాల్లో ఒకరినొకరు మనస్ఫూర్తిగా తమ జీవితాల్లోకి ఆహ్వానించడం ఎంత ముఖ్యమో; గతం తాలుకు ప్రభావం తమ వర్తమాన జీవితాలపై లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో సఫలత సాధిస్తేనే ఆ జంట సంతోషంగా కలిసి జీవించే వీలు ఉంటుంది.
స్వార్థంతో నిండిన బంధం..(One That Boosts Your Ego)
కొందరు ఎదుటివ్యక్తి నుంచి కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటూ తమ బంధాన్ని కొనసాగిస్తే; ఇంకొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. డబ్బు, పేరు- ప్రఖ్యాతులు, గౌరవం, రాజకీయ లబ్ది.. ఇలా వారి స్వప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే ఆయా బంధాల్లో కొనసాగుతూ ఉంటారు. ఒక్కసారి ఆ ప్రయోజనం వారికి అందడం ఆగిందా.. ఆ బంధానికి అక్కడితో ఫుల్‌స్టాప్ పడిపోయినట్లే!
సాహసాలే వూపిరిగా..(Adventurous Relationship)
కొందరికి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసం వాళ్లు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగానే ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ఒక జంటగా మారితే ఇక వారి బంధం నిత్యసంతోషంతో కళకళలాడిపోవాల్సిందే. ఎందుకంటే వారిద్దరి మధ్య అసలు బోర్ అనే పదానికి స్థానమే ఉండదు. ఎప్పుడు, ఏ ప్రదేశానికి వెళ్లి ఎలాంటి సాహసాలు చేయాలి?? అనే విషయంపైనే ఇద్దరూ మనసులు లగ్నం చేస్తారు.
పరిణతి చెందిన మనసులు..(Mature One)
వైవాహిక బంధం కలకాలం సంతోషంగా కొనసాగాలంటే అందుకు పరిణతి చెందిన మనస్తత్వం కలిగి ఉండాలి. ఇలాంటి మనసులు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటైతే వారి బంధం నిత్యనూతనంగానే కొనసాగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ; తమ బంధానికి విలువనిస్తూ దానిని సంరక్షించుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఎప్పుడూ తమ భాగస్వామితో సంతోషంగా కలిసి సమయం గడిపేందుకే ఇష్టపడతారు. ఇలాంటి బంధాలే చివరి వరకు కొనసాగుతాయని చాలామంది నమ్మకం.
ఇవి కూడా చదవండి
కొన్ని ప్రేమబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసా..?
ఆమె కౌగిలిలో కరిగిపోయా.. ఈ లోకాన్నే మరిచిపోయా: మోడరన్ రోమియోల మాటలివే..!