Lifestyle

‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!

Sandeep Thatla  |  Jan 21, 2020
‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!

Uber Eats sells India food business to rival Zomato

ఈరోజుల్లో జొమాటో, స్విగ్గీ (swiggy) & ఉబర్ ఈట్స్ వంటి ఫుడ్ యాప్స్ (food app) గురించి తెలియని వారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫుడ్ యాప్స్ మన దేశంలో మొదలై దాదాపు అయిదేళ్ళు కావస్తోంది. మొదట్లో కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ యాప్స్… తరువాతి కాలంలో టైర్ 2 & టైర్ 3 నగరాలకు సైతం విస్తరించడం విశేషం. ఇప్పుడు వీటి పరిధి ఎంతవరకు వెళ్లిందంటే.. జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యాప్స్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

ఇక తాజాగా రెండు ప్రముఖ ఫుడ్ యాప్స్ మధ్య జరిగిన ఒప్పందం గురించి వింటే.. మీకు వీరు చేస్తున్న వ్యాపారం విలువ తెలిసిపోతుంది. కొద్ది గంటల క్రితమే, ఉబర్ ఈట్స్ సంస్థని జొమాటో సంస్థలో విలీనం చేసినట్టుగా ప్రకటన వెలువడింది. అయితే ఈ ఒప్పందం వెనుక వివరాలు తెలిస్తే.. మీరు అవ్వాకవ్వాల్సిందే! ఆ ఒప్పందం విలువ అక్షరాల రూ 2485 కోట్లు (350 మిలియన్ డాలర్లు).

ఈ ఒప్పందం కారణంగా ఇప్పుడు మీరు ఉబర్ ఈట్స్ యాప్ ఓపెన్ చేస్తే.. అది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని జొమాటో యాప్‌కి రీడైరెక్ట్ చేసేస్తోంది. అలాగే ఉబర్ ఈట్స్ మన దేశంలో 41 నగరాల్లో తన కార్యకలాపాలని నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ మొత్తం వ్యాపారం జొమాటో పరిధిలోకి వచ్చేసింది.

ఉబర్ ఈట్స్ ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకుంటే.. 2014లో అమెరికాలోని లాస్ యాంజెలిస్‌లో ఒక డెలివరీ పైలెట్‌గా ఇది ప్రారంభమైంది. ఆ తరువాత 2015లో ఫుడ్ యాప్‌గా మారడం.. ఆ తర్వాత 2017 మేలో ముంబై నగరంలో అడుగుపెట్టడం ద్వారా ఈ సంస్థ భారతదేశంలో కాలు మోపింది. మొత్తానికి తన కార్యకలాపాలని ప్రపంచంలో 221 నగరాలకు విస్తరించగలిగింది.

అయితే 2017లో భారతదేశ మార్కెట్‌లోకి ఈ ఉబర్ ఈట్స్ సంస్థ అడుగుపెట్టేసరికి.. అప్పటికే స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇక్కడ పోటీదారులుగా ఉన్నాయి. ఈ రెండు సంస్థలను తట్టుకునేందుకు.. తొలి నుండి డిస్కౌంట్స్ ఇస్తూ ముందుకి నడిచింది. అయితే జొమాటో, స్విగ్గీలకి ధీటుగా మాత్రం తన పంథాను కొనసాగించలేకపోయింది.

శ్రీకాకుళం స్పెషల్ స్వీట్ “ఉటంకి” .. తింటే ‘అదరహో’ అనాల్సిందే.. !

ఇవన్నీ పక్కకిపెడితే.. గత ఏడాది చివరిలో చాలా ఎక్కువ మొత్తంలో నష్టాలు రావడంతో.. జొమాటో‌లో ఉబర్ ఈట్స్‌ని విలీనం చేసేందుకు ఉబర్ సంస్థ వారు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఉబర్ ఈట్స్ ఈ ఒప్పందం ప్రకారం, కేవలం భారతదేశంలో మాత్రమే ఉబర్ ఈట్స్‌ని జొమాటో పరం చేయడం జరిగింది. మిగతా దేశాలలో ఉన్న ఉబర్ ఈట్స్ సంస్థ దాని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగిస్తూనే వస్తుందట. 

జొమాటో వారు ఉబర్ ఈట్స్‌ని తమ సంస్థలో విలీనం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం వెనుక ఉన్న కారణమేంటి అంటే – కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని నగరాల్లో ఉబర్ ఈట్స్‌కి మంచి డిమాండ్ ఉండడమే. అక్కడ ఈ యాప్ వినియోగదారుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండడం.. ఇప్పుడు ఈ విలీనంతో మార్కెట్‌లో తమ పరిధి 50 నుండి 60 శాతం అవుతుంది అని అంచనా వేయడం అనేవి ప్రధాన కారణాలు. ఈ విలీనంతో భారత మార్కెట్‌లో జొమాటో & స్విగ్గీ సంస్థలు ఫుడ్ యాప్ రంగాల్లో ఒకటి & రెండు స్థానాల్లో నిలిచాయి.

కొసమెరుపు ఏంటంటే .. ఉబర్ ఈట్స్‌ని స్విగ్గీలో విలీనం చేయడానికి.. కొద్దిరోజుల ముందు సన్నాహాలు జరిగాయట. దాదాపు ఒప్పందం కూడా కుదిరిపోయింది అంటూ.. వ్యాపార వర్గాల్లో విస్తృతమైన చర్చలు కూడా మొదలయ్యాయట. అయితే ఒప్పందం విలువ వద్ద ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా.. ఆ ఒప్పందం రద్దవడంతో ఇప్పుడు అదే ఒప్పందం జొమాటోకి దక్కింది.

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!

Read More From Lifestyle