Celebrity Life

అలనాటి మేటి నటి గీతాంజలి కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ..

Soujanya Gangam  |  Oct 31, 2019
అలనాటి మేటి నటి గీతాంజలి కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ..

ఆమె అప్పటి తరం వారికి అందాల నటి.. ఇప్పటి కాలం వారికి బామ్మ పాత్రలో జీవం పోసి నటించే అద్భుత నటి.. అలా తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటిగా నిలిచిపోయిన గీతాంజలి(geethanjali) ఇక లేరు. గుండెపోటుతో హైదరాబాద్ ఫిలింనగర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు (31.10.19) ఉదయం నాలుగు గంటలకు ఆమె మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని నంది నగర్ లోని ఆమె నివాసానికి తరలించారు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 1947 లో జన్మించారు గీతాంజలి. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీ, మలయాళం వంటి భాషల చిత్రాల్లో కూడా నటించిన ఆమె బహుభాషా నటిగా గుర్తింపు సాధించారు. ఆమె లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకు తీర్చలేనిది అని చెప్పుకోవచ్చు.

కేవలం పద్నాలుగేళ్ల వయసులో 1961 లో సీతారామ కల్యాణం చిత్రం ద్వారా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు గీతాంజలి. ఐదు దశాబ్దాలు పూర్తవుతున్నా ఆమె ఇప్పటికీ సినిమాలంటే ఇష్టపడడం.. సినిమాల్లో నటించడం తన ప్రత్యేకత. ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా రూపొందుతోన్న క్వీన్ రీమేక్ సినిమా దటీజ్ మహాలక్ష్మి చిత్రం లో నటిస్తున్నారు గీతాంజలి. ఆ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ఆమె మరణించడం శోచనీయం. బొబ్బిలి యుద్ధం, దేవత, లేత మనసులు, తోడు నీడ, గూఢచారి 116 వంటి చిత్రాల్లో నటించిన గీతాంజలి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, మరికొన్నింటిలో కమెడియన్ గా.. రెండు మూడు సినిమాల్లో అయితే వ్యాంప్ పాత్రల్లో కూడా నటించారట. దీనికి తన ఆర్థిక పరిస్థితులే కారణం అని చెప్పేవారామె..

మా నాన్న కాకినాడలో వడ్డీ వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టపోయిన ఆయన మమ్మల్ని తీసుకొని మద్రాసుకి మారిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాల్లో ఆఫర్ల కోసం చాలా ప్రయత్నించాం. అప్పుడు చాలా కష్టపడ్డాం. చివరకి నాన్న గారి ప్రోత్సాహం మేరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించా. రామా రావు గారు చూసి నాకు సీత పాత్రను అందించారు. అలా నా కెరీర్ ప్రారంభమైంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గీతాంజలి. వాళ్ల నాన్న గారు తన సినిమా బుకింగ్స్, ఇతర ఆర్థిక వివరాలన్నింటినీ చూసేవారు కాబట్టి సినిమాల ఎంపిక కూడా ఆయనదే అని చెప్పిన గీతాంజలి ఇల్లు గడవడానికి వచ్చిన పాత్రలన్నీ చేశానని చెప్పేవారు. ముఖ్యంగా పద్మనాభం గారి పక్కన పదకొండు సినిమాల్లో ఇష్టం లేకపోయినా నటించానని చెప్పారు.

గీతాంజలి అసలు పేరు మణి.. మొదట్లో రెండు మూడు సినిమాల్లో ఆ పేరుతోనే కనిపించారామె. కానీ ఆ తర్వాత హిందీలో పారస్ మణి అనే చిత్రంలో నటించారట. అందులో హీరోయిన్ పేరు మణి. సినిమాలో పేరు, హీరోయిన్ పేరు ఒకటే కాకూడదని ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత ఆమె పేరును గీతాంజలి గా మార్చారట. రామకృష్ణతో మంచి రోజు, పెళ్లి రోజు, తోటలో పిల్ల కోటలో రాణి, రాజయోగం, రణభేరి వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఆమె ఆ తర్వాత ఆయన్నే పెళ్లాడారు. అయితే వీరిద్దరిదీ ప్రేమ వివాహం మాత్రం కాదట. సినిమా షూటింగ్ సమయంలో రామకృష్ణ, గీతాంజలి వాళ్ల నాన్నగారు ఇద్దరూ కలిసి బాగా మాట్లాడుకునేవారట. ఆయనకు గుణగణాలు నచ్చడంతో అబ్బాయి అందగాడు. మంచి వ్యక్తిత్వం పెళ్లి చేసుకొ అని చెప్పి పెళ్లికి ఒప్పించారట గీతాంజలి వాళ్ల నాన్న గారు. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యుల కోరిక మీద ఆమె సినిమాల నుంచి దూరమయ్యారు. ఒక కొడుకు, ఒక కూతురు పుట్టి వాళ్లు పెద్దవాళ్లయ్యాక తిరిగి బామ్మ పాత్రలతో తెరపై అందరినీ అలరించారు. మొగుడు, పెళ్లైన కొత్తలో, గ్రీకు వీరుడు, భాయ్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీటితో పాటు భానుమతి దర్శకత్వంలో అత్తమ్మ కథలు టీవీ సిరీస్ లోనూ కోడలిగా కనిపించారు.

భర్త రామకృష్ణ మరణం తర్వాత హైదరాబాద్ లోనే నివసిస్తున్న ఆమె తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరితో ఎంతో సన్నిహితంగా వ్యవహరించేవారట. పెళ్లికి ముందే సినిమాలు మానేసినా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఘనత తన సొంతం. కథానాయికగా, హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా ఈ తరం మెచ్చే ముద్దుల బామ్మ అందరి మనసుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న గీతాంజలి మరణం తెలుగు చిత్ర సీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనమూ కోరుకుందాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Celebrity Life