Lifestyle

సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!

Lakshmi Sudha  |  Mar 17, 2019
సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!

మదర్ ఆఫ్ ట్రీస్, వృక్షమాతగా పేరు పొందిన శతాధిక వృద్ధురాలు సాలుమరద తిమ్మక్క(Saalumarada Thimmakka). కడుపుతీపికి నోచుకోని ఆ అమ్మ మొక్కల్లోనే తన పిల్లలను చూసుకొంది. దాదాపు 4 కి.మి. మేర వేల సంఖ్యలో చెట్లను నాటి వాటిని పెంచింది. అందుకేనేమో ఆమెకు వృక్షమాత అని పేరు వచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్నిఅందించింది.

శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పౌర పురస్కారాన్ని(Padma award) స్వీకరించారు. పురస్కార ప్రదానోత్సవంలో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇంతకూ ఆమె ఏం చేశారనే కదా మీ ఆలోచన. పురస్కారం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శిరస్సుపై చేయి ఉంచి ఆప్యాయంగా దీవించారు తిమ్మక్క. అంతే సభలో ఉన్నవారి చప్పట్లతో రాష్ట్రపతి భవన్ దర్బారు హాలు మారుమోగిపోయింది.

అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని తిమ్మక్క అందుకొన్నారు. అదే సమయంలో రాష్ట్రపతి కాస్త కిందకు వంగి ఆమెను కెమెరా వైపు చూడమన్నారు. ఎప్పుడూ చెట్ల సంరక్షణలోనే గడిపే తిమ్మక్కకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి దగ్గర ఎలా వ్యవహరించాలో తెలీదు.

అందుకేనేమో ప్రేమగా ఆయన తలపై చేయి వేసి దీవించారు. ఈ చర్యను రాష్ట్రపతి సైతం మన:పూర్వకంగా స్వీకరించారు. చిరునవ్వుతో ఆమె ఆశీర్వాదాన్ని అందుకొన్నారు. ఈ సంఘటనతో ఆ దర్బారు హాలులో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజనాథ్ సింగ్ ముఖంలో సైతం చిరునవ్వు విరిసింది. ఆ తర్వాత ఆమె కెమెరా వైపు తిరిగి ఫొటో దిగారు.

పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ఫేస్బుక్ లో ఈ సంఘటనపై పోస్ట్ చేశారు. ‘పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను సన్మానించడం రాష్ట్రపతికి దక్కే గౌరవం. కానీ ఈ రోజు కర్ణాటకకు చెందిన 107 ఏళ్ల పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క అందించిన ఆశీర్వాదం నన్ను మరింత అదృష్ట‌వంతున్ని చేసింది. సాలుమరద తిమ్మక్క సగటు భారతీయ మహిళలోని కృషి, పట్టుదల, అంకితభావానికి, వారిలోని శక్తికి ప్రతీక.’ అని ఫేస్ బుక్ పోస్ట్ లో వివరించారు.

మీకు మరో విషయం తెలుసా? రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వృక్షమాత సాలుమరద తిమ్మక్క కంటే ముప్పై ఏళ్లు చిన్నవారు. పద్మ పురస్కారం స్వీకరించిన అనంతరం తిమ్మక్క రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మొక్క నాటడం విశేషం. మరొక విశేషమేంటంటే ఆమె కాలికి చెప్పులు తొడుక్కోకుండా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Image: twitter

ఈ వృక్షమాత కథ ఏంటి?

సాలుమరద తిమ్మక్క కర్ణాటకకు చెందిన పర్యావరణ వేత్త. తుమ్కూర్ జిల్లాలోని గుబ్బి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు తిమ్మక్క. పేదరికం కారణంగా చదువుకొనే అవకాశం తిమ్మక్కకు దక్కలేదు. పేదరికం తెచ్చిన ఇబ్బందుల వల్ల చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని కూడా ఆమె మోయాల్సి వచ్చింది. పదేళ్ల వయసులోనే కూలిపనులకు వెళ్లడం ప్రారంభించారామె. పెళ్లీడు వచ్చిన తర్వాత రామనగర్ జిల్లాలోని హులికల్ గ్రామానికి చెందిన బిక్కల చిక్కయ్యతో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సైతం ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే అత్తింట్లోనూ పేదరికమే ఉంది.

పెళ్లయి ఎన్నేళ్లయినా.. తిమ్మక్క దంపతులకు సంతానం కలగలేదు. గొడ్రాలుగా ఆమెపై ముద్రవేసిన సమాజం ఆమెను ఎన్నో రకాలుగా చిత్రవధ చేసింది. ఇవి తట్టుకోలేక ఒకానొక సందర్భంలో పిల్లలు లేరనే బాధతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ మొక్కలనే తమ పిల్లలుగా భావించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తన భర్త ప్రోత్సాహంతో వీలైనన్ని చెట్లను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయం తీసుకొన్నారు. తుమ్కూర్ జిల్లాలో దాదాపు నాలుగు కి.మీ. మేర సుమారుగా 8వేలకు పైగా వృక్షాలను పెంచారు. హులికల్, కూడూరు గ్రామాల మధ్య ఈ చెట్లను పెంచారు తిమ్మక్క.

Image: thimmakkafoundation.org

రోజూ పని చేస్తేనే కానీ గుప్పెడు మెతుకులు దొరకని పరిస్థితి తిమ్కక్కది. అందుకే రోజూ మధ్యాహ్నం వరకు కూలి పనికి వెళ్లి.. మధ్యాహ్నం నుంచి మొక్కలను పెంచే బాధ్యతను తీసుకొంది తిమ్మక్క. అలా 75 ఏళ్లుగా మొక్కలను నాటుతూనే ఉంది.

అందుకే చదువుతో సంబంధం లేకుండా పర్యావరణ వేత్తగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొంది తిమ్మక్క. ఖ్యాతినైతే ఆర్జించింది కానీ తిమ్మక్క ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఫించనే ఆమెకు జీవనాధారం. ప్రస్తుతం ఆమె మరో పర్యావరణవేత్త ఉమేష్ బీఎన్ సంరక్షణలో జీవితం గడుపుతున్నారు. ఆయన ‘పృథ్వీ బచావో’ పేరుతో పర్యావరణ ఉద్యమం నిర్వహిస్తున్నారు. కొడుకులా తిమ్మక్క బాధ్యతలను చూస్తున్నారాయన..!

పర్యావరణ వేత్తగా తిమ్మక్క ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏటా ‘సాలుమరద తిమ్మక్క షేడ్ ప్లాన్’ కింద ప్రత్యేకంగా మొక్కలు పెంచడానికి నిధులు కేటాయిస్తోంది.  ఆమెపై రాసిన కవిత్వాన్ని సీబీఎస్ఈ సిలబస్ లో చేర్చింది. పద్మశ్రీ పౌర పురస్కారం, కర్ణాటక రాజ్యోత్సవ, కర్ణాటక రాజ్య పరిసార పురస్కారం సహా ఆమెను 50కి పైగా అవార్డులు వరించాయి.

శతాధిక వయస్కురాలిగా పర్యావరణంపై  ఆమె చూపిస్తున్న శ్రద్ధలో మనం వందోవంతు ప్రేమైనా ప్ర‌కృతిపై చూపించగలిగితే ఈ పుడమి పచ్చదనంతో నిండిపోతుంది.

Must Read: ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ పురస్కారం అందుకొన్న హారిక ద్రోణవల్లి గురించి ఇక్కడ చదవండి.

Also Read: కూతురిపై ప్రేమ‌తో.. అమ్మ ఎక్కువ‌గా అడిగే ప్ర‌శ్న‌లు, ఇచ్చే సూచ‌న‌లు ఇవే..!

అమ్మచీరతో అందంగా తయారవ్వాలనుకొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

 

Read More From Lifestyle