కూతురు.. భార్య.. అమ్మ.. పెద్దమ్మ.. పిన్నమ్మ.. ఒక స్త్రీ (woman) జీవితంలో ఉండే బంధాల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద జాబితానే అవుతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు తన పనులన్నీ తాను చేసుకుంటూనే ఇంటిల్లిపాదికీ అవసరమైన సకల సదుపాయాలు సమకూరుస్తూ కుటుంబ సభ్యులందరికీ ఏ లోటూ రాకుండా చూసుకోవడమే స్త్రీకి ఉండే మొదటి ప్రాధాన్యత.
తన శక్తి, సామర్థ్యాలను ఉపయోగించి రెక్కల కష్టంతో ఇంతగా ప్రేమానురాగాలు పంచుతున్నా వారిని చులకనగా చూసేవారు ఎందరో..! ఇంటి పనులు చేయడం, పిల్లలను పెంచడం.. ఇవన్నీ ఏదో తనకు పుట్టుకతోనే అందించిన బాధ్యతలుగా భావించే పురుషులు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. అలాంటి వారి మధ్య పుట్టి, పెరిగింది అమృత. మహిళా దినోత్సవం సందర్భంగా తన మనసులో ఉన్న మాటను అందరితోనూ పంచుకోవాలని మన ముందుకు వచ్చింది..
హాయ్.. అందరికీ నమస్కారం. నా పేరు అమృత. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత చదవాలని ఉన్నా పెద్దలు పెళ్లి చేయడంతో అయిష్టంగానే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాను. నా భర్త పేరు అజయ్. ఎంబీఏ చదివి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పట్నుంచీ ఆయన్ని చాలా పద్ధతిగా పెంచారట.
ఇంతకీ పద్ధతిగా అంటే ఎలాగో తెలుసా.. ఇవి ఆడవాళ్లు చేసే పనులు.. ఇవి మగవాళ్లు చేసే పనులు.. అంటూ ప్రతిదీ విడివిడిగా చూడడం, ఆడవాళ్లు చేసే పనులు, బాధ్యతల్లో అసలు కల్పించుకోకపోవడం అన్నమాట!
రోజులు మారుతున్నా.. ఆయన పద్ధతిలో మాత్రం మార్పు రాలేదు. సరికదా.. పురుషులు కాబట్టి మహిళలపై అధికారం చలాయించవచ్చు అన్న ధోరణి మరింత బలపడింది.
ఆయన ప్రవర్తనతో నాకు మొదట కాస్త విసుగు వచ్చినప్పటికీ మా అమ్మానాన్న నన్ను సర్దుకుపోమని చెప్పడంతో మిన్నకుండిపోయా. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన ధోరణి కారణంగా నాకు కోపం వచ్చేది. ఒక్కోసారి సహనం కూడా కోల్పోయేదాన్ని.
అందుకే ఈసారి కేవలం నా ఒక్కదాని విలువే కాకుండా అసలు మహిళకు ఉండే విలువ ఏంటో తెలిసేలా చేయాలని భావించా. మర్నాడు ఆయన నాతో గొడవపడినప్పుడు నేను ఇంట్లో ఏ పనీ చేయనని, ఇల్లు- పిల్లల బాధ్యతలు నెల రోజుల పాటు ఆయన్ని చూడమని చెప్పాను. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో ఆయన ఆఫీసుకు సెలవు పెట్టకూడదని షరతు పెట్టా. ముందు కాస్త తటపటాయించినా పురుషాహంకారాన్ని రెచ్చగొట్టడంతో ఇష్టం లేకపోయినా సవాల్ ని అంగీకరించారు.
మొదటి రోజు వంట చేసి, పిల్లలను స్కూలుకు రడీ చేసి, తాను తయారై ఆఫీసుకు చేరుకునే సరికి వెళ్లాల్సిన సమయం కంటే రెండు గంటలు ఆలస్యం అయింది. మామూలుగా అయితే వెనక్కి వచ్చేసేవారే! కానీ సెలవు పెట్టకూడదని నేను విధించిన షరతు గుర్తుకు రావడంతో అక్కడే ఉండిపోయారు.
మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో హోం వర్క్ చేయించి, వంట చేసి వారికి పెట్టి ఈయన తిని అన్నీ సర్దేసరికి.. అలసట ఆవహించేసింది పాపం..! ఒక్క రోజులో ఆయన పడిన పాట్లు చూస్తే నాకే చాలా జాలి వేసింది. కానీ వెనకడుగు వేయడం సరికాదు కదా..! అందుకే.. అన్నీ చూసి కూడా ఊరుకున్నాను.
రెండో రోజు కాస్త ఉదయాన్నే నిద్ర లేచారు ఆయన. కానీ ఏం లాభం.. అలవాటు లేని పనులు కదా.. వాటికి తోడు పిల్లల అల్లరి.. ఇంకేముంది.. నిన్నటి కంటే మరో అరగంట ఎక్కువే ఆలస్యం అయింది.. ఇలా దాదాపు వారం రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత సవాల్ అవీ మనకు వద్దు.. మన సంసారమే మనకు ముద్దు అంటూ నన్ను కూల్ చేసేందుకు ప్రయత్నించారు. అస్సలు ఒప్పుకోలేదు. దాంతో చేసేది లేక మర్నాడు నుంచి మళ్లీ ఆయన పాట్లు ఆయన పడ్డారు.
ఇలా రెండు వారాలు గడిచేసరికి ఇంటి పనులు చేయడం, అందులో ఉన్న శ్రమ, కష్టం.. పనులు, బాధ్యతలను మేనేజ్ చేసుకోవడం ఎంత కష్టమో ఆయనకు అర్థమైంది. దాంతో నా మీద ఉన్న కోపం క్రమంగా తగ్గడమే కాదు.. ఇప్పటి వరకు ఆయన బుర్రలో నాటుకుపోయిన చిన్నచూపు, నిర్లక్ష్యంతో పురుషాహంకారం కూడా సన్నగిల్లుతూ వచ్చింది.
మూడో వారంలో పనులన్నీ మేనేజ్ చేసి సమయానికి ఆఫీసుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ నాలుగో వారం వస్తే కానీ అది జరగలేదు. ఇలా నాలుగు వారాల సమయం గడిచిన తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు.. అమృత.. ఈ సవాల్ నాపై కోపంతో ఇచ్చావనే అనుకున్నాను తప్ప దీని వెనుక నీ పట్ల నా ధోరణిని మార్చాలనే పెద్ద ఆలోచన ఉందని నేనసలు అనుకోలేదు.
అందుకే మొదట కోపం వచ్చినా ఆ తర్వాత ఆ పనులన్నీ చేస్తూ నువ్వెంత ఒత్తిడికి గురయ్యావో, విరామం ఎరగకుండా మాకు ఎంత సేవ చేశావో తలుచుకుని చాలా గర్వపడ్డా. అలాగే నీ కష్టాన్ని, శ్రమను, శక్తి సామర్థ్యాలను గుర్తించలేకపోయినందుకు కాస్త సిగ్గుగా కూడా అనిపించింది అంటూ ఆయన చెప్తుంటే నాకు ఒకింత బాధగా ఉన్నా మహిళగా చాలా గర్వంగా అనిపించింది.
ఎందుకంటే ఈ లోకంలో ప్రతి చిన్న విషయానికీ సర్దుకుపోయే నాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరు బాగా చదువుకున్నారు కూడా! అయినా సరే.. పెళ్లి కారణంగానో లేక పెద్దల కట్టుబాట్ల కారణంగానో తమ చుట్టూ ఉన్న ఆంక్షల వలయంలో తమని తాము బంధీలుగా చేసేసుకుంటున్నారు. అది సరికాదని చెప్పాల్సింది పోయి.. ఎదుటివారు చెప్పినదానికి సరేనంటూ తలూపుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటో ప్రతి స్త్రీ తనతో తాను ఒక సంబంధం కలిగి ఉండాలి. ముఖ్యంగా తనని తాను ప్రేమించుకుంటూ గౌరవించుకోవాలి. అప్పుడే తాను నిర్వర్తించే బాధ్యతలు, పనులను మరింత సంతోషంగా, తృప్తికరంగా పూర్తి చేయగలదు. తనదైన ఆత్మవిశ్వాసంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఆర్థిక వ్యవహారాలు, ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనులు.. ఏవైనా సరే.. చాలా సునాయాసంగా నిర్వర్తించగలదు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, సంతోషంగా, స్వతంత్య్రంగా తన జీవితాన్ని తాను కొనసాగించగలదు. అన్నింటికంటే ముఖ్యంగా తదుపరి తరానికి బలమైన పునాదిని వేయగలదు. కాదంటారా??
ఇవి కూడా చదవండి
#StrengthOfAWoman చరిత్రపుటల్లో నిలిచిపోయిన.. మన మేటి మహిళా డాక్టర్లు ..!
#StrengthOfAWoman ఈ విమెన్ బయోపిక్స్ .. చాలా చాలా స్పెషల్ ..!
అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట
Images: Pixabay