Entertainment

ఎవరీ కాంట్రాక్టర్ నెసమణి? అతనికి మన బ్రహ్మీకి సంబంధమేమిటి..?

Lakshmi Sudha  |  May 31, 2019
ఎవరీ కాంట్రాక్టర్  నెసమణి? అతనికి మన బ్రహ్మీకి సంబంధమేమిటి..?

నిన్న ట్విట్టర్లో బాగా ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ప్రే ఫర్ నెసమణి. Pray_for_Neasamani, #Neasamani హ్యాష్ ట్యాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు అతని క్షేమం కోరుతూ ట్వీట్స్ చేశారు. ట్విట్టర్లో మాత్రమే కాదు.. ఫేస్బుక్ లోనూ ఈ హ్యాష్ ట్యాగ్(hashtag) తో పోస్ట్ లు పెట్టారు. అసలు నెసమణి ఎవరు? అందరూ ఎందుకు అతని కోసం ఇంతగా ఆరాటపడుతున్నారనే విషయం తెలియక చాలామంది జుట్టు పీక్కున్నారు. ఇప్పటికీ చాలామందికి నెసమణి అంటే ఎవరో సరిగ్గా తెలియదు. అయినా సరే అతని కోసం ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సమాచారం తెలియాలంటే #Pray_for_Neasamani హ్యాష్ టాగ్ కథ మొత్తం తెలుసుకోవాల్సిందే.

ఈ నెసమణి ఎవరు?

తమిళ సినిమాలోని కామెడీ పాత్ర నెసమణి. దీన్ని ప్రముఖ నటుడు వడివేలు పోషించారు. తమిళ స్టార్స్ సూర్య, విజయ్ కలిసి నటించిన ఫ్రెండ్స్ సినిమాలోనిది ఈ పాత్ర. ఈ చిత్రం 2001లో విడుదలైంది. నెసమణి ఓ తమిళ కాంట్రాక్టర్. అతను చెప్పింది చెప్పినట్టుగా చేసే అసిస్టెంట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. వాళ్లలో ఒకడి చేతిలోంచి సుత్తి జారి వచ్చి నెసమణి నెత్తి మీద పడుతుంది. అంతే అలా పడిపోతాడు.

సినిమాలోని ఈ సీన్ ఆధారంగానే #Pray_for_Neasamani హ్యాష్ ట్యాగ్ పుట్టుకొచ్చింది. ఎప్పుడో వచ్చిన సినిమా సీన్ గురించి ఇప్పుడు ట్రెండింగ్ అవడమేంటి? మాకూ అదే సందేహం వచ్చింది. అందుకే కాస్త లోతుగా వెళ్లి చూస్తే అసలు విషయం తెలిసింది.

అసలు నెసమణి కథ ఎక్కడ మొదలైందంటే..

రెండు రోజుల క్రితం పాకిస్థాన్లో మొదలైంది ఈ కథ. సివిల్ ఇంజనీరింగ్ లెర్నర్స్ అనే ఫేస్ బుక్ పేజీలో సుత్తి ఫొటోను పోస్ట్ చేసి దీన్ని మీ దేశంలో ఏమంటారని ప్రశ్నించారు. ఇదుగో ఇక్కడే మన తమిళ నెటిజన్లు తమ క్రియేటివిటీని, హాస్య చతురతను ప్రదర్శించారు. ఓ యూజర్ ‘దీన్ని మా భాషలో సుతియల్ అంటారు. దీంతో కొడితే టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది. కాంట్రాక్టర్ నెసమణి తల బద్దలైంది దీని వల్లే’ అని కామెంట్ పెట్టారు. ఆ వెంటనే మరో తమిళ తంబి ‘అతని ఆరోగ్యం బాగానే ఉందా?’ అని కామెంట్ చేశారు. వీళ్లిద్దరూ చేసిన సరదా కామెంట్స్ తో ఇతర తమిళులు కూడా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ సినిమా స్క్రీన్ షాట్లను మీమ్స్ గా తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

హీరో సిద్ధార్థ్, క్రికెటర్ హర్భజన్ సింగ్ లాంటి సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేయడంతో ఇది మరింతగా ట్రెండింగ్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా నెసమణి కోసం ప్రార్థిస్తున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేయడంతో ప్రపంచం మొత్తం ఇది వైరల్ అయింది. తమిళనాడులో మొదలైన ఈ హ్యాష్ ట్యాగ్ నెమ్మదిగా ఇండియాలో.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాగా ట్రెండ్ అయింది. ఎంత బాగా అంటే ఇండియాలో నెంబర్ వన్ హ్యాష్ ట్యాగ్ గా, ప్రపంచవ్యాప్తంగా నెంబర్ టూ హ్యాష్ ట్యాగ్ గా నిలిచింది. అసలు చాలామందికి నెసమణి ఎవరో తెలియకపోయినా సరే.. అతని క్షేమం కోరి మరీ ట్వీట్ చేశారు.

మరీ విచిత్రమేమింటంటే.. అపోలో హాస్పిటల్ నెసమణి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిందని, నెసమణిని చంపడానికి ప్రయత్నించిన కిల్లర్ ను పట్టుకొన్నారని.. ఇలా అందరూ తమకు తోచిన కథలేవో అల్లుకొన్నారు. ఇవన్నీ కలసి నెసమణిని బాగా ట్రెండ్ చేశాయి. మీకో విషయం తెలుసా.. ఈ నెసమణి పాత్రను తెలుగులో బ్రహ్మానందం పోషించారు. నాగార్జున, సుమంత్ కాంబినేషనులో వచ్చిన స్నేహమంటే ఇదేరా (తమిళ చిత్రానికి రీమేక్) సినిమాలో వడివేలు పోషించిన పాత్రలో బ్రహ్మానందం కనిపించడం విశేషం. 

 

Featured Image: Twitter

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Entertainment