Lifestyle

అమ్మాయిలూ.. ఈ విషయాలు మీ బాయ్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకోవద్దు..!

Lakshmi Sudha  |  Jun 6, 2019
అమ్మాయిలూ.. ఈ విషయాలు మీ బాయ్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకోవద్దు..!

పీకల్లోతు ప్రేమలో ఉన్న వ్యక్తితో.. ప్రతి విషయం పంచుకోవాలని (Share) చాలామందికి ఉంటుంది. ఇలా అనుకోవడం మాత్రమే కాదు.. చాలామంది అమ్మాయిలు ఈ పద్ధతిని పాటిస్తారు కూడా. తమకెదురైన ప్రతి చిన్న సంఘటనను తాము ప్రేమిస్తున్నవారితో పంచుకొంటూ ఉంటారు. రిలేషన్ షిప్‌లో పారదర్శకత, నిజాయతీ ఉండాలనే మీ నమ్మకమే ఇందుకు కారణమై ఉండొచ్చు.

లేదా ఏ విషయమైనా సరే పంచుకొనే స్వేచ్ఛ మీ భాగస్వామి దగ్గర మీకు ఉండి ఉండచ్చు. అలాగని అన్నీ వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మీరు వారితో చెప్పే లేదా అడిగే కొన్ని విషయాలు వారికి కాస్త అసహనాన్ని కలిగిస్తాయట. మరో రకంగా చెప్పాలంటే.. ‘మళ్లీ మొదలుపెట్టిందిరా బాబోయ్’ అని వారికి అనిపిస్తుందట.  అలాంటి విషయాలేమిటో మనమూ తెలుసుకొందామా..

1. బంగారం.. నేను తిన్నాను. నువ్వు తిన్నావా?

రోజుకి మూడు పూటలా ట్యాబ్లెట్ వేసుకొనేంత కచ్చితంగా.. బాయ్‌ఫ్రెండ్‌కు (boy friend) మెసేజ్‌లు పెడుతుంటారు అమ్మాయిలు. కానీ మీరు మెసేజ్ పెట్టినా.. పెట్టకపోయినా వారు ఏ సమయానికి చేయాల్సిన పని ఆ సమయానికి చేస్తారు. అలాగే మీరు భోజనం చేసిన విషయమూ వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు కూడా రోజూ టైంకే భోజనం చేస్తారనే విషయం వారికీ తెలుసు కాబట్టి.

2. నీకో విషయం తెలుసా.. ఈ రోజు మా ఫ్రెండ్ ఏం చేసిందంటే?

అంటూ మొదలుపెట్టి.. కొందరు అమ్మాయిల తమ స్నేహితుల పర్సనల్ విషయాలు కూడా  బాయ్ ఫ్రెండ్‌కు చెప్పేస్తుంటారు. కానీ అది మీకు, మీ స్నేహితురాలికి మధ్యే ఉండాల్సిన విషయం కదా. దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా బాయ్ ఫ్రెండ్‌తో చెప్పేయడమేంటి? ఇది మనలో చాలామంది చేసే పనే. అయితే ఇలా చేయడం సమంజసమేనా? కచ్చితంగా కాదు. ఎందుకంటే మీ స్నేహితురాలు తన విషయాలు.. ఎవరి దగ్గరా మీరు ప్రస్తావించరనే గట్టి నమ్మకంతోనే ఉంటుంది.

మరి మీరు ఇలా చేస్తే.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్టే కదా. ఆమె సమస్యకు నిజంగా పరిష్కారం అందిస్తాడనే ఉద్దేశంతో మీరు మీ బాయ్ ఫ్రెండ్‌తో చర్చిస్తే ఫర్వాలేదు. కానీ ఊసుపోలు కబుర్ల కోసం మీ స్నేహితురాలి గురించి తనతో చర్చించడం మాత్రం తప్పు. కాబట్టి ఇక నుంచి మీ ఫ్రెండ్స్, వారి వ్యక్తిగత జీవితాల గురించి మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ప్రస్తావించకండి.

3. ‘నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి ఏం జరిగిందో తెలుసా?’

మీరిలా మీ మాజీ ప్రియుడి గురించి మీ భాగస్వామి లేదా మీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కి చెబుతున్నారా? అయితే వెంటనే అలా చెప్పడం మానేయండి. ఎందుకంటే.. దీని వల్ల మీ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. మీ మాజీ ప్రియుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అతనికి పెళ్లయిందా? అంటూ మీరు ఆరాలు తీస్తున్నారంటే.. మీరు ఇంకా అతని గురించే ఆలోచిస్తున్నారనే అపోహ మీ ప్రస్తుత భాగస్వామికి వచ్చే అవకాశం ఉంది.

దీంతో అతడు మీకు దూరంగా జరిగే అవకాశమూ లేకపోలేదు. నిజం చెప్పాలంటే.. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడనే విషయం మీ ప్రస్తుత భాగస్వామికి అనవసరమైన విషయమే.  కాబట్టి ఇకపై మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చర్చించడం మానేయండి.

4. నీకంటే తనే చాలా బెటర్

నిజాయతీగా ఉండటం మంచిదే. కానీ ఆ నిజాయతీ కూడా అవసరమైన వాటిలో.. మీ బంధాన్ని నిలబెట్టుకొనే విషయంలో ఉంటే సరిపోతుంది. కానీ ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోల్చి ‘నీకంటే తను చాలా బెటర్’ అని చెప్పడం మాత్రం మీ బంధానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇతరులు ఎలా ఉంటున్నారనేది మీ బాయ్ ఫ్రెండ్‌కు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.

పైగా అతడికి ఇతరులను అనుకరించాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ అతడే ఇతరులతో మిమ్మల్ని పోల్చి చూసి తక్కువ చేసి మాట్లాడుతుంటే మీకెంత బాధగా ఉంటుంది. అతనికి కూడా అలాగే ఉంటుంది. అందుకే వీలైతే అతని వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయండి. అంతేకానీ.. వాటి గురించి పదే పదే అతన్ని అవమానించే ప్రయత్నం చేయడం మానుకోండి.

5. దీని రేటెంతో తెలుసా?

మీ డబ్బుతో మీరు ఏం కొనుక్కొంటారనేది మీ వ్యక్తిగత విషయం. మీరు కొన్న ప్రతి వస్తువు గురించి, దాని రేటు గురించి మీ బాయ్ ఫ్రెండ్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల మీకు దుబారా ఖర్చులు ఎక్కువనే అభిప్రాయం కూడా తనకు కలగవచ్చు. కాబట్టి దేని గురించి చెప్పాలి? ఏది చెప్పకూడదు? అనే విషయాల్లో మీకు మీరుగా ఓ హద్దుని నిర్ణయించుకోండి.

6. అందుకే నువ్వు మా వాళ్లకి నచ్చవు.

ఏదో ఒక కారణం వల్ల మీ భాగస్వామి మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు నచ్చకపోవచ్చు. ఆ విషయాన్ని మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే అతనికి ఇతరులు తన గురించి ఏమనుకొంటున్నారనే దాని కంటే.. మీరు అతన్ని ప్రేమిస్తున్నారా? లేదా? అనేదే ముఖ్యం.

ఇదే విషయం మీకూ వర్తిస్తుంది. ఇతరులు ఏమనుకొంటున్నారనే దాని కంటే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? లేదా అనేదే మీకూ ముఖ్యం కదా. అందుకే ఇలాంటి విషయాలను చర్చించి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని సమస్యాత్మకంగా మార్చుకోవడం కంటే.. ఇద్దరూ కలసి ఆ సమస్యను పరిష్కరించుకోగలరేమో ఆలోచించండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Lifestyle