టాలీవుడ్ (Tollywood) హీరోయిన్స్ బాలీవుడ్ (Bollywood) లో తెరంగేట్రం చేయాలని, వరుస అవకాశాలు చేజిక్కించుకొని అక్కడ కూడా తమదైన ముద్ర వేయాలని తహతహలాడడం మామూలే! మరి, బాలీవుడ్ కథానాయికలు టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తే..? ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ , శ్రద్ధాకపూర్.. వంటి నటీమణులు తెలుగు వెండితెరపై మెరిసేందుకు సన్నద్ధమవుతుండగా.. ఈ జాబితాలో మరో బ్యూటీ కూడా వచ్చి చేరనందంటున్నాయి సినీవర్గాలు. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరనేగా మీ సందేహం.. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత – దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) కుమార్తె అలియా భట్(Alia Bhatt).
2012లో కరణ్ జోహార్ రూపొందించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (Student of the year) సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన అలియా తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు.. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ.. తన నటనకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ వస్తోంది. ఈ అమ్మడు నటించిన “రాజీ” చిత్రానికి గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా గల్లీబాయ్, కళంక్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోందీ సుందరి. తాజాగా అలియా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టనుందనే వార్తలు నెట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలేంటంటే..
ఈ ఏడాది తెలుగులో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌గా రూపొందుతోన్న చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ (RRR) కూడా ఒకటి. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న విషయం విదితమే. కాగా ఈ కథలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉందని, వాటిలో రామ్ చరణ్ పక్కన కథానాయిక పాత్ర కోసం అలియాను సంప్రదించారని ఈ వార్తల సారాంశం.
ఆమె కెరీర్ ప్రారంభానికి గట్టి పునాది వేసిన కరణ్ జోహార్‌ను ఇప్పటికి ఒక మంచి గైడ్ గా భావిస్తూ సినిమాల విషయమై సలహాలు తీసుకుంటూ ఉంటుంది అలియా. అందుకే తన సినిమాలో ఆమెని ఎంపిక చేసుకునే నిమిత్తం రాజమౌళి కరణ్‌తో మాట్లాడారని వార్తలు వినిపిస్తున్నాయి. RRR సినిమా కోసం ఇప్పటికే ఒక కథానాయికగా కియారా అద్వాణీని ఎంపిక చేసుకోగా; మరో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే ఇప్పుడు వినిపిస్తోన్న ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉంది? అలియా నిజంగానే తెలుగులో తెరంగేట్రం చేయనుందా?? అనే వాటిపై రాజమౌళి ఒక స్పష్టత ఇస్తే కానీ ఈ వార్తలకు బ్రేక్ పడేలా లేదు.
మరోవైపు RRR చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ఇటీవలే రెండో షెడ్యూల్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ (NTR) – రామ్ చరణ్ (Ram charan) ల మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలు, పాత్రల లుక్స్.. ఇవేవీ బయటకు పొక్కకుండా కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకున్నారు జక్కన్న. రాజమౌళి కోర్ టీం అయిన కీరవాణి, సెంథిల్ కుమార్, రమా రాజమౌళి, శ్రీవల్లి.. తదితరులు ఈ చిత్రం కోసం కూడా పని చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు.
అయితే అలియా కంటే ముందు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దిశగా అడుగులు వేసిన కథానాయికల జాబితాలో విద్యాబాలన్ (Vidya Balan), శ్రద్ధా కపూర్ కాస్త సీనియర్స్ అని చెప్పుకోవాలి. విద్యా బాలన్ (Vidya Balan) నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సంపాదించుకోగా; ఆమె నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సైతం విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani)సైతం భరత్ అనే నేను & వినయ విధేయ రామ చిత్రాలతో మంచి మార్కులే సంపాదించుకొంది. ఇక శ్రద్ధాకపూర్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన సాహోలో (Saaho) నటిస్తోంది. వీరే కాదు.. సోనాలీ బింద్రే, బిపాసా బసు, శిల్పాశెట్టి, కత్రినా కైఫ్.. తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నవారే!
ఇవి కూడా చదవండి
సరోగసీ ద్వారా జన్మించిన పండంటి బిడ్డకు.. తండ్రి పేరు పెట్టిన సీరియల్ క్వీన్
“పల్లె కోయిల” పసల బేబీ నోట.. హృద్యమైన మట్టి మనిషి పాట..!
టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!