భారతదేశంలోని చలనచిత్ర రికార్డులను తిరగరాయడమే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా ఇండియన్ సినిమా సత్తాను చాటిన చిత్రం “బాహుబలి”. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం.. ఆ తర్వాత హిందీ, మలయాళం భాషలలో కూడా డబ్ చేయబడి కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ అపూర్వ కళారూపంపై హాలీవుడ్‌లో అనేక చర్చలు జరిగిన విషయం తెలిసిందే. హాలీవుడ్ రిపోర్టర్, స్క్రీన్ డైలీ, ది గార్డియన్, హఫింగ్టన్ పోస్ట్ లాంటి విదేశీ పత్రికలు సైతం “బాహుబలి” చిత్రం గురించి ప్రత్యేకంగా వ్యాసాలు రాయడం విశేషం. అలాగే అమెరికాకి చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ సంస్థ ఇచ్చే సాటర్న్ అవార్డ్స్ పోటీలో నిలిచి.. రెండు విభాగాల్లో నామినేషన్ కూడా దక్కించుకుంది “బాహుబలి” (Baahubali).
అదేవిధంగా బీబీసీ సంస్థ రూపొందించిన “100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా” డాక్యుమెంటరీలో “బాహుబలి” గురించి ప్రత్యేకంగా తెలపడం గమనార్హం. బ్లాక్ పాంథర్, ఎవెంజెర్స్: ఇన్ఫినిటీ వార్ లాంటి చిత్రాల్లో నటించిన హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్.. గతంలో “బాహుబలి” పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ చిత్రానికి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.
ప్రస్తుతం ఎవెంజెర్స్: ఇన్ఫినిటీ వార్‌లో నటించిన మరో నటుడు కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. ఆ చిత్రంలో నిక్ ఫ్యూరీ పాత్రలో కదం తొక్కిన అమెరికన్ నటుడు శామ్యూల్ జాక్సన్ మాట్లాడుతూ, తనకు ‘బాహుబలి 3’ చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ అవి సరదాగా చెప్పిన మాటలని.. సీరియస్‌గా తీసుకోవద్దని మళ్లీ ఆయనే చెప్పడం గమనార్హం.
ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్టు “మీరు ఇండియా వెళ్లే అవకాశం ఉందా?” అని జాక్సన్‌ని ప్రశ్నించగా.. ఆయన కాస్త ఫన్నీగా జవాబిచ్చారు. “ఇండియాకి ఎందుకెళ్లను? ఎవరైనా నటించే జాబ్ ఇస్తే.. కచ్చితంగా వెళ్తాను” అన్నారు. వెంటనే జర్నలిస్టు “అయితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా?” అని అడగ్గా.. ఆయన ‘బాహుబలి 3’లో నటించాలని ఉందని చెప్పడంతో స్టూడియోలో నవ్వులు విరిశాయి. వెంటనే ఆయన మాట మార్చి “సరదాగా అన్నానండి. నాకు అవకాశం వస్తే బాలీవుడ్‌లో నటిస్తాను” అనడంతో ఆ టాపిక్‌కి ఇక తెరపడింది.
70 సంవత్సరాల శామ్యూల్ జాక్సన్ హాలీవుడ్‌లో బాగా పేరొందిన నటుడు. జురాసిక్ పార్క్, జాకీ బ్రౌన్, డీప్ బ్లూ సీ, అన్ బ్రేకెబుల్, ట్రిపుల్ ఎక్స్, ఐరన్ మ్యాన్ లాంటి చిత్రాలలో ఆయన తనదైన పంథాలో నటించారు. ఎవెంజర్స్‌లో ఆయన పోషించిన నిక్ ఫ్యూరీ పాత్రకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే.. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా అమెరికాలో ఫ్యాన్ క్లబ్బులు కూడా ఉన్నాయట. అంత ఫేమస్ ఆ పాత్ర.
ఇవి కూడా చదవండి
బాహుబలికి షాక్ ఇచ్చిన.. సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0
2019లో కంగనా రనౌత్‌కు.. ‘మణికర్ణిక’ చిత్రం ఎందుకు స్పెషల్ అంటే..?
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..