ఒక హృదయం నుండి పుట్టిన కళ (art) వేల హృదయాలను కదిలిస్తుంది. ఎన్నో మనసులను తట్టిలేపుతుంది.. ఈ ప్రత్యేకత కేవలం కళదే కాదు.. దాన్ని గీసిన చేతులది కూడా. అలా ఎదుటివారి హృదయాలను కట్టిపడేసేలా చక్కటి చిత్రాలు వేయడం తన సొంతం. తన చిత్రాలు ఎంతగా ఆకట్టుకుంటాయంటే అవి ఫొటోలా లేక చిత్రాల అన్న విషయం ఎవరూ గుర్తుపట్టేలేనంత. ఆమె చిత్రాలలో అంతటి సహజత్వం ఉట్టిపడుతుంది. అందుకే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఆమె ఆర్ట్‌కి ఫిదా అంటున్నారు. తను ఎవరో కాదు. వైజాగ్‌కి చెందిన “కీర్తి ప్రత్యూష” (Keerti Pratyusha). ప్రవృత్తినే వృత్తిగా మార్చుకొని నచ్చిన రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందీ అమ్మాయి. తన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
వైజాగ్‌కి చెందిన కీర్తి ప్రత్యూషకి చిన్నతనం నుంచి పెయింటింగ్, డ్రాయింగ్ వంటివాటిపై ఆసక్తి ఉండేది.. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన తర్వాత తన ఆసక్తికి మరింత పదును పెట్టి రకరకాల డ్రాయింగ్స్ వేయడం ప్రారంభించింది. ఆమె ఒక చిత్రం గీసిందంటే అందులో పూర్తిగా పర్ఫెక్షన్ కనిపించాల్సిందే. అలా అందంగా వచ్చేవరకూ సాధన చేసేదట. ఇలా రోజుకో రకం పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తూ తనకు తానే గురువుగా మారిపోయిందామె. తన కుటుంబంలో ఇటు తండ్రికి, అటు భర్తకి పెయింటింగ్స్ అంటే ఆసక్తి. వారి నుంచి కూడా తనెంతో స్ఫూర్తి పొందుతానని చెప్పే ప్రత్యూష వారి ప్రోత్సాహంతో తన కళనే వృత్తిగా మార్చుకుంది. ఇంజినీరింగ్ చేసినా.. కళలపై ఉన్న ఆసక్తితో మౌస్‌ని వదిలి తనకెంతో ఇష్టమైన పెన్సిల్ని పట్టుకుంది. నచ్చిన రంగంలో ముందుకెళ్లేందుకు ఏదీ అడ్డుకాదని చాటిచెప్పింది.
మొదట్లో సాధారణ పెయింటింగ్స్‌తో పాటు పెన్సిల్‌తో చక్కటి డ్రాయింగ్స్ వేసిన ప్రత్యూష.. రాన్రాను తన చిత్రాలకు మంచి స్పందన వస్తుండడంతో ఇంకా ఏదైనా చేయాలని భావించిందట. ఆ తరుణంలోనే సాధారణ పెన్సిళ్లకు భిన్నంగా ఉన్న చార్ కోల్ పెన్సిళ్లతో చిత్రాలను గీయడం ప్రారంభించింది. పెన్సిలే కదా అని తక్కువగా చూడడానికి లేదు. ఎందుకంటే కేవలం ఆ ఒక్క చార్కోల్ పెన్సిల్‌తోనే అచ్చం బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను తలపించే చిత్రాలను గీయగలగడం ప్రత్యూష ప్రత్యేకత. చార్కోల్ పెన్సిళ్లనే ఎంచుకోవడానికి ఓ కారణం ఉందంటుంది తను. సాధారణ పెన్సిళ్లలో 2డీ, 3డీ, 4డీ, 8డీ ఇలా రకాలున్నా.. వాటితో గీసినప్పుడు ఎంతో డార్క్‌గా చిత్రం వచ్చినా.. అది కచ్చితమైన నలుపు రంగులో మాత్రం రాదు. ఎందుకంటే ఈ పెన్సిళ్లన్నీ గ్రాఫైట్‌తో చేస్తారు.. కాబట్టి బూడిద రంగులో కనిపిస్తుంది. నాకు కావాల్సింది నలుపు రంగు. అదెలా వస్తుందని రీసెర్చ్ చేస్తే చార్కోల్ పెన్సిల్ గురించి తెలిసింది. ఆ తర్వాత దాంతో చిత్రాలు గీయడం ప్రారంభించానని అంటుందామె.
ఇంజినీరింగ్ తర్వాత రచనలపై ఉన్న ఆసక్తితో ఓ సంస్థలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరినా.. కమర్షియల్ విలువల వల్ల అక్కడ ఇమడలేక ఆ ఉద్యోగాన్ని వదిలేసిన ప్రత్యూష కళనే తన ఉపాధిగా మార్చుకున్నారు. కాలేజీలో ఉన్నప్పటినుంచే తమ చిత్రాలను గీయాలని చాలామంది కోరుకునేవారు.
“ఇది నాకు ఆనందాన్నిచ్చే పని కాబట్టి.. నేను వారి దగ్గర డబ్బులు తీసుకొని చిత్రాలు గీసి అందించేదాన్ని. ఆ తర్వాత దాన్నే ఉపాధిగా మార్చుకున్నా. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని ఇంట్లోవాళ్ల ఒత్తిడి లేదు కాబట్టి నాకు నచ్చిన దారిలో ముందుకెళ్లా. ముందు చిన్న చిన్న చిత్రాలు గీయడం ప్రారంభించా. అవి చక్కగా వస్తూ నాకు మంచి పేరు వస్తుందన్న సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు ప్రారంభించాను” అని తెలిపారు ప్రత్యూష.
“ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీల చిత్రాలను గీశాను. వాటిని వారికి అందించాను కూడా. అందరిలోనూ నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు నేనెప్పటికీ మర్చిపోలేను. నాకెంతో ఇష్టమైన రచయిత చేతన్ భగత్ చిత్రాన్ని గతేడాది జనవరిలో వేశాను. అది ఈ మధ్యే చూసిన ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఇవి కాక సమంత, నాగ చైతన్య, రణ్ వీర్ సింగ్ లాంటివాళ్లు కూడా నా చిత్రాలను మెచ్చుకున్నారు” అంటూ సంతోషంగా వెల్లడిస్తుందామె. ఈ చిత్రాలు వేయడానికి ఉపయోగపడే పెన్సిళ్లు, రంగులు, కాన్వాస్, పేపర్ వంటివి విదేశాల నుంచి తెప్పించడం వల్ల కాస్త ఖర్చు ఎక్కువవుతుందట. తను వాడే ఒక్కో పెన్సిల్ ధర రూ.150 అని చెప్పే ప్రత్యూష దాన్ని బట్టే తన చిత్రాల ధర కూడా ఉంటుందని.. అయినా తన కళను ఇష్టపడేవాళ్లు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతుంది ప్రత్యూష.
తన కళను ఇలాగే కొనసాగిస్తూ ముందుకెళ్లాలని.. దేశంలోని ప్రతి ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రకృతిని చూస్తూ చిత్రాలు వేయాలని ప్రత్యూష కల. అలాగే దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్లలో పాల్గొని.. తన కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవాలని.. ఆ తర్వాత ఓ ఆర్ట్ స్కూల్ ప్రారంభించాలనేది తన కోరిక అని చెబుతుంది ప్రత్యూష. అలాగే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకెళ్లాలని.. కళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని తన తోటివారికీ చెబుతుందామె.. తన చిత్రాలతో అందరినీ కట్టిపడేసే ప్రత్యూష భవిష్యత్తు కూడా తన చిత్రాలంత అందంగా ఉండాలని మనమూ కోరుకుందాం.
ఇవి కూడా చదవండి..
ముచ్చటైన “మైక్రో ఆర్ట్స్”తో.. మనసులను దోచేస్తున్న “తెలుగమ్మాయి”
ఈ వధువు స్టెప్పులేస్తే.. ప్రపంచమే ఫిదా అయిపోయింది..!