ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆంధ్రప్రదేశ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన.. పుణ్యక్షేత్రాలు ఇవే ..!

ఆంధ్రప్రదేశ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన.. పుణ్యక్షేత్రాలు ఇవే ..!

సాధారణంగా మనకు ఏ కష్టం వచ్చినా “దేవుడా.. నువ్వే దిక్కు” అనుకుంటాం. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. దేవుడి గుళ్లకు (temples) వెళ్లి మన కష్టాలన్నింటినీ ఆయనకు విన్నవించుకుంటాం. మొక్కులు మొక్కుతాం. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికంలోని అద్భుతమైన గుణం అది. మనకు కావాల్సిన ఆనందం, ధైర్యం, ప్రశాంతత.. ఇవన్నీ దేవుడే అందిస్తాడని చాలామంది దేవాలయాలు సందర్శిస్తుంటారు.

సాధారణంగా దేవాలయాలకు వెళ్లాలంటే.. అవి ప్రతీ ఊరిలోనూ, పల్లెలోనూ ఉంటాయి. కానీ కొన్ని ప్రముఖ దేవాలయాలు మాత్రం ప్రత్యేకం. ఇందులో కొన్ని స్వయంభు దేవాలయాలు అయితే.. మరికొన్ని ఎన్నో శతాబ్దాల పూర్వం కట్టించినవి. అలాంటి పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh)  కూడా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

1. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

చిత్తూరు జిల్లాలో నెలకొని ఉన్న ఈ దేవాలయం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించింది. చిత్తూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. తిరుమల ఏడు కొండలపై నెలకొని ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవాలంటే కింద నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొండమాన్ అనే తమిళ చక్రవర్తి కట్టించిన ఈ దేవాలయంలో పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు పూజలు నిర్వహించేవారట.

ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు వరాహ స్వామి దేవాలయం, పద్మావతి అమ్మ దేవాలయం, గోవింద రాజ దేవాలయం, ఇస్కాన్ క్రిష్ణ దేవాలయం వంటివి కూడా ఉన్నాయి. సాధారణ సమయాల్లోనే లక్షలాది మంది భక్తులు రోజూ తిరుమల దేవస్థానాన్ని సందర్శిస్తారు. ఇక పండగలు, పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో అయితే కోటి వరకూ భక్తులు వస్తుంటారట. తిరుపతి రైల్వేస్టేషన్‌కి దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుంచి రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పక్కనున్న రాష్ట్రాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

2. విజయవాడ కనకదుర్గ దేవాలయం

wikipedia

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న దేవాలయం ఇది. కృష్ణా నది ఒడ్డున నెలకొని ఉన్న ఈ దేవాలయంలో కనకదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు. విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటి కాబట్టి.. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి సులువుగా చేరుకునే వీలుంటుంది. అంతేకాదు.. హైదరాబాద్ నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బస్సులు కూడా వస్తుంటాయి. ఈ దేవాలయం వెనుక ఓ పెద్ద చరిత్రే ఉందట.

పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మ వారి గురించి ప్రార్థన చేసి తన హృదయంలో నిలిచి ఉండమని వరం కోరుకున్నాడు. అమ్మవారు కీలుడిని పర్వతంగా మార్చి.. రాక్షస సంహారం తర్వాత అక్కడ ఉంటానని మాటిచ్చిందట. ఆ తర్వాత మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన అమ్మ కనక వర్ణంలో వెలిగిపోతూ ఇక్కడ వెలిసింది. అందుకే కనక దుర్గగా మారింది. ఇంద్రాది దేవతలు ఆమెను దర్శించుకోవడానికి సిద్ధమయ్యారు కాబట్టి.. ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడికి సాధారణంగా వేల మంది భక్తులు వస్తుంటే.. దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది మంది విచ్చేస్తుంటారు.

3. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

హైదరాబాద్ నుంచి 229 కిలోమీటర్ల దూరంలో.. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్య పుణ్య క్షేత్రంలో శివుడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రూపంలో కొలువున్నాడు. ఇది శక్తి పీఠాల్లో ఒకటి మాత్రమే కాదు.. జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటిగా ఉంది. ఈ దేవాలయాన్ని విజయ నగర రాజులు నిర్మించారట. స్థల పురాణం గురించి పూర్తిగా వివరాలు తెలియకపోయినా.. రెండో శతాబ్ధంలో ఈ గుడి ప్రారంభమైందని చెప్పేందుకు ఆధారాలున్నాయి.

కేవలం విజయ నగర రాజులే కాదు.. కాకతీయులు కూడా ఇక్కడ పూజలు నిర్వహించేవారట. ఇక్కడ ఈ దేవాలయంతో పాటు పాతాళ గంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార. పంచధార లాంటి ఎన్నో దర్శనీయ ప్రదేశాలున్నాయి. దట్టమైన నల్లమల అడవి మధ్యలో కొండపైన ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శిస్తే.. కోరిన కోరికలన్నీ తీరుతాయని చాలామంది నమ్మకం.

4. అహోబిలం నరసింహ స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

ఇది కూడా కర్నూలు జిల్లాలోనే ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నంద్యాల నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో విష్ణు మూర్తి అవతారమైన నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయాన్ని ముందు ఎనిమిదో శతాబ్ధంలో చాళక్యులు నిర్మించారట. ఆ తర్వాత పాడైన ఆలయాన్ని తిరిగి పదిహేనో శతాబ్దంలో విజయనగర రాజులు పునర్నిర్మించారు. నల్లమల అడవి మధ్యలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నవ నరసింహ క్షేత్రంగానూ పేరుగాంచింది.

ఇందులో నరసింహ స్వామిని తొమ్మిది రూపాల్లో చూడచ్చట. ఈ తొమ్మిది దేవాలయాలు ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయట. ఇందులో కొన్ని దేవాలయాలను సందర్శించడం సులభమే.. కానీ మరికొన్నింటిని చూసేందుకు కఠినమైన కొండదారుల్లో నడుస్తూ.. కొండలు తాళ్ల సాయంతో ఎక్కుతూ వెళ్లాలట. అహోబిలం వెళ్లేందుకు.. నంద్యాల రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి వెళ్లాలట. దాంతో పాటు ఆళ్లగడ్డ, అహోబిలం కొండ కింద నుంచి ఉన్న బస్సుల ద్వారా దేవాలయానికి చేరుకోవచ్చు.

5. సింహాచలం నరసింహ స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

విశాఖపట్పం రైల్వే స్టేషన్ నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న.. ఈ పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. సింహాచలం కొండల్లో కొలువై ఉన్న ఈ స్వామి దేవాలయాన్ని 1098 లో కులోత్తుంగ చోళ అనే రాజు నిర్మించాడట. కళింగ రాజు ఈ విగ్రహానికి బంగారు కవచాన్ని చేయించాడట. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఇక్కడ నరసింహ స్వామి విగ్రహం ఎప్పుడూ చందనంతో నిండి ఉంటుంది.

స్వామి వారి నిజ రూప దర్శనం కేవలం ఏప్రిల్ లేదా మే మాసాల్లో నిర్వహించే చందనోత్సవం సందర్భంగా మాత్రమే కనిపిస్తుంది. హిరణ్యకశిపుడిని చంపి.. ఉగ్ర నరసింహుడి రూపంలో ఉన్న స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ ఉగ్రతను చల్లబరిచేందుకు.. ఎప్పుడూ చందనంతో కప్పి ఉంచుతారు. సాధారణంగా భక్తులతో నిండి ఉండే ఈ దేవాలయం చందనోత్సవం సమయంలో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. వైజాగ్ నుంచి ఇక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఉంటాయి.

6. కాణిపాకం వినాయక స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన చాలామంది.. దగ్గర్లోనే ఉన్న కాణిపాకం వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని వస్తుంటారు. తిరుపతి నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ దేవాలయం. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ దేవాలయం జిల్లా కేంద్రం నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బహుదా నది తీరాన కొలువైన ఈ దేవాలయాన్ని పదకొండో శతాబ్దంలో చోళ రాజు కులొత్తుంగ చోళుడు కట్టించాడు. 1336లో విజయనగర రాజులు దీన్ని మరింత మెరుగుపరిచారట. ఇక్కడ వినాయకుడు స్వయంభుగా చెబుతారు. ఈ విగ్రహం సైజ్‌లో పెరుగుతుందట కూడా.

మూగ, చెవిడి, గుడ్డి అన్నదమ్ములు.. ముగ్గురు వ్యవసాయం కోసం బావి నుంచి నీళ్లు తీసుకునేవాళ్లట. ఒకరోజు బావి పూర్తిగా ఎండిపోతే దాన్ని తవ్వేందుకు ఒక వ్యక్తి అందులోకి దిగగా.. రక్తం కనిపించిందట. ఆ రక్తంతో నీళ్లన్నీ ఎర్రగా మారి.. ఆ నీటిలో తడిసిన ముగ్గురు అన్నదమ్ముల అవయవ లోపాలు తగ్గిపోయాయట. దాంతో గ్రామస్తులు మరింత తవ్వగా వినాయకుడి విగ్రహం కనిపించిందట. దీంతో దాన్ని అక్కడే ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. ఏటా వినాయక చవితికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారట. ఇక్కడికి తిరుపతి, చిత్తూరు రైల్వేస్టేషన్ల నుంచి చేరుకోవచ్చు. బస్సులో అయితే కాణిపాకానికి తిరుపతి, చిత్తూరు నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి.

7. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. శ్రీకాళ హస్తి పుణ్యక్షేత్రం దేశంలోనే పేరు గాంచిన శైవ క్షేత్రం. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం పదో శతాబ్దంలో నిర్మితమైంది. ఓ పెద్ద బండ రాయిని తొలచి ఈ గుడిని కట్టారు. ఈ దేవాలయానికి ఆ పేరు రావడానికి వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు ఈ మూడు ఈ ప్రదేశంలో శివుడిని పూజించి కైవల్యం పొందాయట. పెన్నాకి ఉపనది అయిన స్వర్ణముఖి నది ఒడ్డున నిర్మితమైన ఈ దేవాలయం గురించి స్కంధ పురాణం, లింగ పురాణంలోనూ కనిపిస్తుంది.

ఈ ఆలయంలోని 120 అడుగుల ఎత్తున్న గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్ని ముందు ఐదో శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మిస్తే.. ఆ తర్వాత చోళ రాజులు తిరిగి ఆలయాన్ని పెద్దగా ఉండేలా పునర్నిర్మించారు. చుట్టూ ఉన్న నాలుగు గోపురాలను విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడున్న వంద స్థంభాల మండపాన్ని కూడా వారే నిర్మించారట. ఇక్కడికి చేరుకోవడానికి కూడా రైల్వే స్టేషన్, బస్టాండ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

8. యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం నంద్యాల నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవాలయాల్లో ఇది కూడా ముఖ్యమైనది. ఈ దేవాలయం 5వ శతాబ్దంలో నిర్మితమైందట. పల్లవులు ముందు దీన్ని నిర్మించగా.. చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి మరమ్మత్తులు చేస్తూ కొత్తగా నిర్మించారు. ఇక్కడ శివపార్వతులు అర్థనారీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహంగా కనిపిస్తారు.

శివుడిని లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది ఇక్కడేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసి శివపార్వతులు.. అర్థనారీశ్వరులుగా ఇక్కడ కొలువుండాలని కోరుకున్నారట. అదొక్కటే కాదు.. ఇక్కడున్న నంది విగ్రహం సైజు పెరుగుతూ ఉంటుందట. ఇక్కడికి చేరుకోవడానికి నంద్యాల రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు. లేదా కర్నూలు, బనగానపల్లి, నంద్యాల వంటి ప్రదేశాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

9. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం

wikipedia

ADVERTISEMENT

రాజమండ్రి నుంచి 84 కిలో మీటర్ల దూరంలో, వైజాగ్ నుంచి 123 కిలోమీటర్ల దూరంలో.. రెండింటికి మధ్యన ఉన్న పుణ్యక్షేత్రం అన్నవరం. పంపా నది ఒడ్డున ఉన్న ఈ దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకోవడం, కొత్తగా పెళ్లయిన జంటలు సత్యనారాయణ వ్రతం జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అనిన వరం అనే పదం నుంచి అన్నవరం అనే పదం వచ్చింది. నోటి నుంచి వచ్చిన ప్రతి కోరికను.. వరంగా అందిస్తాడట ఇక్కడ కొలువై ఉన్న సత్యదేవుడు. కళింగ రాజులపై యుద్ధం చేయడానికి విజయ నగర రాజులు ఇక్కడ సొరంగాలు తవ్వారట. అవి ఇప్పటికీ ఉన్నాయట. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా అన్నవరం రైల్వేస్టేషన్, బస్టాండ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

10. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం

wikipedia

అరసవెల్లి సూర్య దేవాలయం మన దేశంలోని అతి పురాతన సూర్య దేవాలయాల్లో ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ దేవాలయాన్ని ఏడో శతాబ్దంలో కళింగ రాజులు నిర్మించారట. చూసేందుకు ఒకటే ఆలయం అయినా.. ఇందులో ఐదుగురు దేవతలు కొలువుంటారు. వినాయకుడు, పార్వతీ దేవి, శివుడు, విష్ణు మూర్తితో పాటు సూర్య నారాయణ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడట.

ADVERTISEMENT

కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయం తర్వాత అంత ప్రముఖమైనది ఇదేనని చెప్పుకోవాలి. రథ సప్తమి రోజు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ సూర్యుడి తొలి కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయట. ఈ సూర్య కిరణాలు తాకే విధానాన్ని చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఏటా మార్చిలో 9, 10, 11, 12 తేదీల్లో.. అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో సూర్య కిరణాలు మూల విరాట్టును తాకుతాయట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీమరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

25 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT