Entertainment

ఎన్టీఆర్ సరసన విదేశీ హీరోయిన్ … ‘RRR’ చిత్రంలో హాలీవుడ్ నటుల సందడి

Sandeep ThatlaSandeep Thatla  |  Nov 20, 2019
ఎన్టీఆర్ సరసన విదేశీ హీరోయిన్ … ‘RRR’ చిత్రంలో హాలీవుడ్ నటుల సందడి

(Hollywood stars Olivia Morris, Ray Stevenson, Alison Doody to star in SS Rajamouli’s film and Jr NTR & Ramcharan starrer RRR)

బాహుబలి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఇక ఆయన అంతటి భారీ సినిమాను  తెరకెక్కించిన తరువాత.. కొంతకాలం గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం RRR. ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుండి కూడా అది అనేక సంచలనాలకు తెరతీస్తునే ఉంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో..   ఇద్దరు అగ్ర నటులైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి.

“RRR”లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, ఆలియా భట్ మొదలైన వారు కూడా నటిస్తుండడంతో.. సినిమాకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగానే.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్  సరసన నటించేందుకు.. హాలీవుడ్ నటీమణి ఎడ్గార్ జోన్స్‌ని ఎంపిక చేయగా.. కొన్ని అనివార్య కారణాలతో ఆమె తప్పుకోవడం జరిగింది. దానితో.. అప్పటినుండి ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారన్న ప్రశ్న అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అయితే రామ్ చరణ్ పక్కన సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తుందని చెప్పడం.. అలాగే ఆమెకు సంబంధించిన సీన్ల షూటింగ్ కూడా మొదలుపెట్టడంతో.. ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో పక్కన ఎవరు నటిస్తారనే టెన్షన్‌లో ఉండిపోయారు.

దాదాపు ఒక ఆరేడు నెలల తరువాత.. ఆ టెన్షన్‌కి సమాధానం లభించింది. అదేంటంటే – ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ వివరాలను.. ఈ రోజున కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఆ నటీమణి పేరే – ఒలీవియా మోరిస్. జెన్నిఫర్ అనే పాత్రలో.. విదేశీ నటి ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో మనకి కనిపించబోతుంది. ఈమె స్క్రీమ్ అనే సిరీస్‌లో నటించడం ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక ఈమెకి RRR చిత్రమే తొలి భారతీయ చిత్రం కానుంది.

 

అయితే ఈరోజు ఒలీవియా మోరిస్‌తో పాటుగా… RRR చిత్రంలో నటిస్తున్న మరో ఇద్దరు ఐరిష్ నటులని కూడా ప్రేక్షకులకి పరిచయం చేశారు నిర్మాతలు. ఆ ఇద్దరే – అలిసన్ డూడి & రే స్టీవెన్ సన్. ఈ ఇద్దరు కూడా.. దాదాపు పదుల సంఖ్యలో హాలీవుడ్ చిత్రాల్లో నటించి.. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నవారే.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి ‘RRR’ టైటిల్‌కి.. ఫుల్ ఫామ్ ఫిక్స్ అయిందట!

ఇక RRR చిత్రంలో.. లేడీ స్కాట్ అనే పాత్రలో అలిసన్ డూడి నటిస్తుండగా.. ఈమెతో చిత్రబృందం ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని చిత్రీకరించడం జరిగింది. ఇక ఒలీవియా మోరీసన్.. అలాగే స్కాట్ పాత్రలో నటిస్తున్న రే స్టీవెన్ సన్‌తో RRR చిత్ర బృందం షూటింగ్ జరపాల్సి ఉంది. త్వరలోనే వీరితో షూటింగ్ మొదలుపెట్టనున్నారని సమాచారం.

 

ఈ ప్రకటనలతో ఒక రకంగా RRR చిత్రానికి సంబంధించిన ముఖ్యపాత్రల పరిచయం పూర్తయిందనే చెప్పాలి. ఇక మిగిలిన 30 శాతం షూటింగ్ అనుకున్న సమయంలోగా పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడమే మిగిలింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి  బాణీలని సిద్ధం చేసేశానని తెలిపారు. అలాగే ఇద్దరు హీరోలకు సంబంధించిన  కీలక సన్నివేశాలు కూడా షూటింగ్ చేసేశారని సమాచారం. 

సాధారణంగా రాజమౌళి నుండి వస్తున్న చిత్రమంటేనే సహజంగా ఒక ఆసక్తి ఉంటుంది. అటువంటిది ఏకంగా ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ పలువురు..  ఈ చిత్రంలో నటిస్తుండడంతో.. కచ్చితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని మాత్రం చెప్పచ్చు.

ఏదేమైనా.. జక్కన్న మరోసారి తన ప్రతిభతో.. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులని థ్రిల్‌కి గురి చేయాలని కోరుకుందాం.

రామ్‌చరణ్ –  ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?