ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పెళ్లి తర్వాత.. మొదటి ఏడాది ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా?

పెళ్లి తర్వాత.. మొదటి ఏడాది ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా?

సాధార‌ణంగా పెళ్లి (marriage) అయిన మొద‌టి సంవ‌త్స‌రం (first year) ప్ర‌తి జంట‌కి ఎంతో ప్ర‌త్యేకం. నా మొద‌టి ఏడాది కూడా ఎంతో ఆనందంగానే గ‌డిచింది. అయితే చాలామంది క‌ల‌లు కంటున్న‌ట్లుగా నిజ‌జీవితం ఏమాత్రం ఉండ‌దు. ఇదే నేను నేర్చుకున్న విష‌యం, అంద‌రిలాగే నేను, మా ఆయ‌న మా పెళ్లి కి ముందు మాట్లాడుకుంటున్న‌ప్పుడు వివాహం త‌ర్వాత మా జీవితం ఇలా ఉంటుంది.. అంత అద్భుతంగా ఉంటుంది అని మేమిద్ద‌రం వూహించాం. ఇద్ద‌రం క‌లిసి ఒకే ఇంట్లో ఉండ‌బోతున్నామ‌ని.. క‌లిసి ఎక్క‌డికంటే అక్క‌డికి వెళ్తామ‌ని.. ఇంట్లోనూ ఇద్ద‌రం క‌లిసి చాలా స‌మ‌యం గ‌డుపుతామ‌ని.. ఇలా ఎన్నో వూహించుకున్నాం.

అయితే మా పెళ్లి అయిన మొద‌టి సంవత్స‌రంలో పెళ్లంటే కేవ‌లం ఇవే కాద‌ని.. ఇంకా చాలా ఉంటాయ‌ని అర్థ‌మైంది. కొత్త‌గా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు అస‌లు పెళ్లి త‌ర్వాత ఎలా ఉంటుందో తెలుసుకుంటే దానికి త‌గిన‌ట్లుగా త‌మ‌ని తాము సిద్ధం చేసుకోవ‌చ్చ‌ని నాకు అనిపించింది అందుకే నేనే ఈ  మొద‌టి ఏడాదిలో నేర్చుకున్న ఏడు విష‌యాల‌ను మీతో పంచుకుంటున్నా.

ఇద్ద‌రి భావ‌వ్య‌క్తీక‌ర‌ణ వేర్వేరుగా ఉండొచ్చు.

సాధార‌ణంగా అమ్మాయిలు ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. త‌మ భాగ‌స్వామి కూడా త‌మ‌లా ప్ర‌తి ఫీలింగ్‌నీ పంచుకోవాల‌ని ఆశిస్తారు. కానీ ఆడ‌వారికి, మ‌గ‌వారికి భావ‌వ్య‌క్తీక‌ర‌ణ విష‌యంలో తేడాలు ఉండ‌వ‌చ్చు. త‌మ భావాల‌ను ఇత‌రుల‌కు పంచేందుకు చాలా మార్గాలుంటాయి. అందులో మీరు ఎంచుకున్న ప‌ద్ధ‌తే మీ భాగ‌స్వామి కూడా ఎంచుకోవాల‌ని రూలేం లేదు. అయితే ఒక్క విష‌యం మనం ఏం చెప్పాల‌నుకుంటున్నామో.. ఇత‌రుల‌కు అది అర్థ‌మ‌య్యేలా చేస్తే చాలావ‌ర‌కూ గొడ‌వ‌లు త‌గ్గిపోతాయి. అందుకే ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ ఎదుటివారు చెప్పిన‌దానిని ప్ర‌శాంతంగా వినడం అల‌వాటు చేసుకోండి.

ADVERTISEMENT

మీరు మీలాగే ఉండండి..

నేను చాలా అల్ల‌రి పిల్ల‌ని.. నేను సంతోషంగా ఉన్న‌ప్ప‌డు ఒక్కోసారి చిన్న‌పిల్ల‌లా, మ‌రోసారి కార్టూన్ చిత్రాల్లో విల‌న్ల‌లా మాట్లాడుతూ ఉంటాను. దీన్ని నా భ‌ర్త కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. అలాగే నా భ‌ర్త‌కు చిటికెలు వేస్తూ మాట్లాడ‌డం, ఏదైనా సంతోష‌క‌ర‌మైన వార్త వింటే గాల్లోనే డ్ర‌మ్స్ వాయించ‌డం వంటివి చేస్తూ ఉంటాడు. వాటిని నేను కూడా ఇష్ట‌ప‌డ‌తాను. ఇలా ఎప్పుడూ మామూలుగా ఉండ‌డం కాకుండా కాస్త ప్ర‌త్యేకంగా.. ఇంకా చెప్పాలంటే అస‌హ‌జంగా.. మీరు సాధార‌ణంగా ఎలా ఉంటారో అలాగే మీ భాగ‌స్వామి వ‌ద్ద ఉండేందుకు ప్ర‌య‌త్నించండి. ఇదే మీ బంధం బోరింగ్‌గా మార‌కుండా కాపాడుతుంది.

గొడ‌వ‌లు స‌హ‌జ‌మే..

ఆనంద‌క‌ర‌మైన జీవితం గ‌డిపే జంట‌లు అస్స‌లు గొడ‌వ పెట్టుకోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌వు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద త‌ప్పు. ప్ర‌తి బంధంలోనూ బేధాభిప్రాయాలు, గొడ‌వ‌లు చాలా స‌హ‌జం. కొన్నిసార్లు ఇవి చాలా చిన్న చిన్న కార‌ణాల‌తో ప్రారంభ‌మ‌వుతాయి. అయితే నేను, నా భ‌ర్త మా మొద‌టి గొడ‌వ జ‌రిగిన‌ప్పుడే నిర్ణ‌యించుకున్నాం. త‌ప్పు ఎవ‌రిదైనా ఇద్ద‌రం మాట్లాడుకొని గొడ‌వ‌కు అక్క‌డితో ఫుల్‌స్టాప్ పెట్టేస్తామ‌ని.. అలాగే వీలైనంత‌గా మేం ఎప్ప‌టి గొడ‌వ‌లు అప్పుడే మ‌ర్చిపోతామ‌ని.. అలాగే అభిప్రాయ‌బేధాలు వ‌చ్చిన‌ప్పుడు వాటిని వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్చించుకొని ఇద్ద‌రం క‌లిసిపోతామ‌ని మేం నిర్ణ‌యం తీసుకున్నాం. ఇది మా మ‌ధ్య గొడ‌వ‌లు పెద్ద‌వి కాకుండా కాపాడుతోంది.

ర‌హ‌స్యాలా? అంటే ఏంటి?

చాలామంది పెళ్ల‌యిన త‌ర్వాత భ‌ర్త‌తో ఇలా ఉండాలి. అలా ఉండాలి.. కొన్ని విష‌యాల‌ను ర‌హ‌స్యంగానే ఉంచాలి అని చెబుతూ ఉంటారు. కానీ మ‌నం ఒక వ్య‌క్తితో క‌లిసి ఉంటున్న‌ప్పుడు వారితో కొన్ని విష‌యాలు దాచి మాట్లాడ‌డం ఎలాగో నాకు అస్స‌లు అర్థం కాదు. మేం మాత్రం ఎలాంటి ర‌హ‌స్యాలు దాచుకోం. నా పాత బాయ్‌ఫ్రెండ్స్ గురించి నా భ‌ర్త‌కు పూర్తిగా తెలుసు. అలాగే త‌న పాత ప్రేమ‌ల గురించి నాకూ పూర్తిగా తెలుసు. ఇది మా ఇద్ద‌రి బంధాన్ని మ‌రింత‌గా బ‌ల‌ప‌రిచిందే త‌ప్ప ఏమాత్రం ఇబ్బందులు క‌లిగించ‌లేదు. అందుకే వీలైనంత‌వ‌ర‌కూ భాగ‌స్వామి వ‌ద్ద ఏ విష‌యాన్ని దాచిపెట్ట‌డం స‌రికాద‌ని నా భావ‌న‌.

ADVERTISEMENT

అప్పుడే పిల్ల‌లా?

నాకూ, మా ఆయ‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్టం. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాతే ఇద్ద‌రి బంధంలో మ‌రింత ప‌రిప‌క్వ‌త వ‌స్తుంద‌ని మా ఇద్ద‌రికీ తెలుసు. అయితే దానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని మా ఇద్ద‌రి భావ‌న‌. ప్ర‌స్తుతం మేమిద్దరం ఇంకా ఒక‌రి గురించి మ‌రొక‌రం తెలుసుకునే ద‌శ‌లోనే ఉన్నాం. ఇంకా ఒక‌రిని మ‌రొక‌రు పూర్తిగా అర్థం చేసుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందుకే మరో రెండేళ్ల వ‌ర‌కూ పిల్ల‌ల‌ను క‌నే ఆలోచ‌న పెట్టుకోవాల‌ని మేం అనుకోవ‌ట్లేదు. ఈ విష‌యంలో ఇత‌రుల భావ‌న వేరుగా ఉండొచ్చు. కానీ భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒక‌రినొకరు బాగా అర్థం చేసుకొని మాన‌సికంగా, ఆర్థికంగా పిల్ల‌ల కోసం సిద్ధంగా ఉన్న‌ప్పుడే ఆ ఆలోచ‌న చేస్తే మంచిది.

రొటీన్ ఫాలో అయ్యే అవ‌కాశం త‌క్కువే..

పెళ్లికి ముందు మేం చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇద్ద‌రం సాయంత్రం ఏడు గంట‌ల‌క‌ల్లా ఇంటికి చేరుకొని ఇద్ద‌రం క‌లిసి వంట చేసుకొని, క‌లిసి భోజ‌నం చేసి.. కాసేపు సినిమాలు చూసి నిద్ర‌పోవాల‌ని ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం. మా జీవ‌న శైలిని పూర్తిగా మార్చుకోవాల‌ని భావించాం. కానీ ఇది జ‌రిగేది చాలా కొన్నిసార్లేన‌ని ఆ త‌ర్వాతే మాకు అర్థ‌మైంది. ఆఫీస్‌లో ముఖ్య‌మైన మీటింగులు, దారిలో ఎవ‌రైనా స్నేహితులో, బంధువులో కనిపించ‌డం.. ఇవేవీ కాక‌పోతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లైనా మేం అనుకున్న రొటీన్ పూర్తిగా దెబ్బ‌తినేది. మొద‌ట్లో ఇది నాకు చాలా బాధ‌ను క‌లిగించేది. అయితే ఆ త‌ర్వాత అల‌వాటయిపోయింది. వీట‌న్నింటికీ బ‌దులుగా వారానికి ఒక రోజు మాత్రం పూర్తిగా ఇద్ద‌ర‌మే క‌లిసి ఉండాల‌నే నిర్ణ‌యం తీసుకున్నాం. ఇది మాకు వారం మొత్తం దూరంగా ఉన్నభావ‌న‌ను తొల‌గించేస్తుంది.

నాలాగే ఉంటూ..త‌న‌ని అర్థం చేసుకుంటా.

పెళ్ల‌యిన త‌ర్వాత భ‌ర్త కోసం భార్య‌, భార్య‌ కోసం భ‌ర్త మారాల‌నే ఆలోచ‌న చాలా పాత‌ది. నేను దీనికి అస్స‌లు ఒప్పుకోను. మేమిద్ద‌రం వ్య‌క్తిగ‌తంగా మాలాగే ఉంటూ.. మా ఇద్ద‌రి కోసం ఒక‌రినొక‌రు పూర్తిగా అర్థం చేసుకోవాల‌ని ముందే నిర్ణ‌యించుకున్నాం. ఇలా మా ఇద్ద‌రి ఇష్టాలు, అభిప్రాయాలు, ఆలోచ‌నా విధానాలు వేర్వేరుగా ఉండ‌డం వ‌ల్ల మేం చాలా నేర్చుకోగ‌లిగాం. జీవితాన్ని కేవ‌లం ఒక కోణం నుంచే కాదు.. రెండు భిన్న‌మైన కోణాల నుంచి చూడ‌డం ప్రారంభించాం. ఇది మాకు ఎంతో ఆనందాన్ని అందిస్తోంది. ఒక‌రి కోసం మా వ్య‌క్తిత్వాన్ని మార్చుకోలేద‌న్న భావ‌న కూడా మా ఆనందానికి ఓ కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

ADVERTISEMENT

నా సూచ‌న‌లు మీకు పెళ్ల‌నే అద్బుత‌మైన బంధాన్ని మ‌రో కోణంలోంచి చూసే అవ‌కాశాన్ని అందించింద‌ని.. వైవాహిక జీవితం గురించి నిజాలు మీ ముందుంచి దానికి సిద్ధంగా ఉండేలా ప్రోత్స‌హించింద‌ని భావిస్తున్నా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

17 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT