ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆడ‌పిల్ల‌లు స్వేచ్ఛ‌గా ఎద‌గాలంటే.. మూస‌ధోర‌ణులను వ‌దిలేయాల్సిందే..!

ఆడ‌పిల్ల‌లు స్వేచ్ఛ‌గా ఎద‌గాలంటే.. మూస‌ధోర‌ణులను వ‌దిలేయాల్సిందే..!

భారతదేశంలో బాలికలు బాలురతో సమానంగా ఎదుగుతున్నారా? మీ సమాధానం నాకు తెలియదు కానీ.. నేనైతే కాదనే అంటాను. చదువుల్లో బాలికలు ముందంజలో ఉండొచ్చు.. ఉద్యోగాలు చేస్తుండొచ్చు. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడుతుండొచ్చు. మేడిపండు చూడ మేలిమై యుండు అన్న చందాన ఇవన్నీ మనకు పైపైన కనిపించే మెరుగులే. కానీ లోలోపల వారి స్వాతంత్య్రాన్ని హరించే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని మీరు కాదనగలరా?

అవును.. ఇండియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగాలు చేస్తున్నా.. పుట్టే బిడ్డ మగవాడే కావాలని కోరుకొనేంతగా అభివృద్ధి చెందుతోంది. ఆడపిల్ల పుడితే నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలో వదిలేసేంతగా అభివృద్ధి చెందింది. కాదంటారా? లేదంటే.. లింగ నిష్పత్తిలో మనదేశం 191వ స్థానంలో ఎందుకుంటుంది? ప్రతి వంద మంది అబ్బాయిలకు 92 మంది మాత్రమే అమ్మాయిలున్నారు.

ఈ విషయంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు కూడా మనకంటే ముందున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 0-6 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయిల కంటే అమ్మాయిలు 7.1 మిలియన్లు తక్కువగా ఉన్నారని UNFPA ప్రచురించిన గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్లని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా! గర్భంలో ఉన్న పిండం ఆడా మగా అని తెలుసుకోవడం మన దేశంలో చట్టరీత్యా నేరం. అయినా ఇన్ని భ్రూణ హత్యలు జరుగుతున్నాయంటే.. ఎంత అమానవీయం.

రొమ్ము పాలు తాగే దగ్గర నుంచి ఆడ‌పిల్ల‌లు వివక్ష ఎదుర్కొంటున్నారు. అందుకే అమ్మాయిల్లో ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైతే సరైన వైద్య చికిత్సకు నోచుకోనివారు ఇప్పటికీ ఉన్నారంటే ఎంత దుర‌దృష్టమైన విషయం. బాలురతో పోలిస్తే బాలికలకు నాణ్యమైన విద్య అందడం లేదు. ముక్కుపచ్చలారని పసిపిల్లలపై కామాంధులు పైశాచికంగా జరుపుతున్న అత్యాచారాలు కంట తడిపెట్టిస్తున్నాయి.

ADVERTISEMENT

కంచే చేను మేసిందనే చందాన ఆడపిల్లకు రక్షణగా ఉండాల్సిన కుటుంబసభ్యులే వారిని వేధిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే అంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఉంటుందా? ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. తల్లిదండ్రులే ఆడపిల్ల గొంతు కోస్తున్నారు. చిరుప్రాయంలోనే వారికి పెళ్లి చేసి తమ గుండెలపై భారాన్ని దించుకొంటున్నామనుకొంటున్నారు. కానీ తమ చేతులతోనే తమ కూతుర్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నారు. అంతరిక్షాన్ని అరచేత్తో అందుకొంటున్న ఈ కాలంలోనూ ఆడపిల్లను కాపాడుకోలేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం.

1-national-girl-child-day

ఈ నేపథ్యంలోనే ఆడపిల్లల విలువను తెలియజేసేందుకు.. వారి భవిష్యత్తును భద్రం చేసేందుకు.. వారి హక్కులను కాపాడేందుకు.. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి 24ను జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా బాలికల సాధికారత సాధించే దిశగా కృషి చేస్తోంది.

అమ్మాయిలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికోసమే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ‘ధనలక్ష్మి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా బాలికల కనీస అవసరాలను తీర్చేందుకు అవసరమైన ధన సహాయాన్ని తల్లిదండ్రులకు అందిస్తోంది. ఇమ్యునైజేషన్, జనన ధృవీక‌ర‌ణ‌, పాఠశాలలో చేర్పించడం దగ్గర నుంచి వారు ఎనిమిదో తరగతి విద్య‌ పూర్తి చేసేంత‌ వరకు వారి కనీస అవసరాలు తీర్చడానికి అవసరమైన మొత్తాన్ని కేంద్రం అందిస్తోంది.

ADVERTISEMENT

2-national-girl-child-day

బాలురతో సమానంగా బాలికలకు అవకాశాలు కల్పించడంతో పాటు.. తల్లిదండ్రులు, సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా చేసే ఓ ప్రయత్నంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని పరిగణించాలి. ముఖ్యంగా మానవ హక్కులతో పాటు రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను కాపాడే దిశగా సమాజంలో అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ రోజు చేపడతారు. బాలికల హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించేలా ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.

ఈ రోజు ఎన్ని పనులు చేసినా అవి బాలికల పరిస్థితిని మెరుగుపరచడానికి చేసేవే. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ఈ రోజు చాలా యాక్టివ్‌గా కార్యక్రమాలు చేపడతాయి. వారి కృషి ఫలించి బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మార్పు వస్తే అంతకు మించి కావాల్సిందేముంటుంది?

రేపటి భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పోరాటం చేస్తున్న బాలికలూ.. మీకు National Girl Child Day శుభాకాంక్షలు.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

ముగ్గులు కావవి.. మగువ అంతరంగానికి ప్రతీకలు.. ఎందుకో తెలుసా?

#MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..

ADVERTISEMENT
23 Jan 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT