Advertisement

#MeToo

#MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..

Lakshmi SudhaLakshmi Sudha  |  Jan 7, 2019
#MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..

Advertisement

‘అమ్మాయ్..! మీటూ ఉద్యమం అంటే ఏంటి?’

నిన్న రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మా బామ్మ నన్నడిగిన ప్రశ్న ఇది. అది విన్ననేను కొంచెం షాక్ అయ్యాననే చెప్పాలి. ఎందుకంటే పెద్దగా వార్తలపై ఆసక్తి చూపించని ఆమె ఉన్నట్టుండి అలా అడిగేసరికి కాస్త షాకింగ్‌గా అనిపించింది. అయినప్పటికీ మీటూ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్న ఆమె ఆసక్తి నాకు సంతోషం కలిగించింది. ‘నీకు మీటూ గురించి ఎలా తెలిసిందే బామ్మ?’ అని అడిగాను ఉత్సుకత ఆపుకోలేక. ‘నిన్న సీరియల్ కోసం ఛానల్ మారుస్తున్నప్పుడు ఓ న్యూస్ ఛానల్‌లో కనిపించింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఏదైనా స్వాతంత్య్ర ఉద్యమం లాంటిదా?’ అని అడిగింది.

‘నిజమే బామ్మ.. అది స్వాతంత్య్ర ఉద్యమమే. లైంగిక వేధింపుల నుంచి విముక్తి కోసం మహిళలు చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమం’

‘ఎట్టెట్టా.. లైంగిక వేధింపుల మీద మహిళలు సాగిస్తున్న పోరాటమా? ఏంటే.. అమ్మాయీ మీకేమైనా మతి పోయిందా? ఇలాంటి వాటి గురించి బయట తెలిస్తే పరువు పోదూ?’ అంది బామ్మ.

‘అలా అని వదిలేయబట్టే ఇక్కడి దాకా వచ్చింది పరిస్థితి’ అన్నాన్నేను. ‘ఆడపుట్టుక పుట్టిన తర్వాత ఇలాంటివన్నీ తప్పవు కదా..! ఇలాంటివన్నీ మౌనంగానే భరించాల్సిందే’ అంటున్న బామ్మను చూస్తే నాకు మీటూ ఉద్యమం గురించి కచ్చితంగా  చెప్పాలనిపించింది. అందుకే తనకు మీటూ ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? దానివల్ల ప్రయోజనమేంటి? మహిళలకు దానివల్ల లాభమేంటని చెప్పాలనిపించింది. 

#Me Too ఉద్యమం అంటే ఏంటి?

1-me-too-movement-march

Image source: Shutterstock

ఇదుగో బామ్మ..! ముందు నీకు మీటూ ఉద్యమం అంటే ఏంటో చెబుతాను. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆన్ లైన్ ఉద్యమం ఇది. 2006లో అమెరికాలో దీన్ని మొదలుపెట్టారు. లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళలకు తోడ్పాటుగా, వారికి సాంత్వన కలిగించే దిశగా వారిని నడిపించడానికి #MeToo ఉద్యమం ప్రారంభించారు. 2017లో హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టైన్ పై లైంగిక వేధింపుల(sexual harassment) ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనంటూ.. కొంతమంది హాలీవుడ్ హీరోయిన్లు బయటకు వచ్చారు. అతనికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పారు. అతగాడు తమపై లైంగిక హింసకు పాల్పడ్డాడని వారు బహిరంగంగా చెప్పారు. ఆ సమయంలోనే #MeToo ట్విట్టర్ లో పెద్ద ఆన్ లైన్ ఉద్యమంగా మారింది. అలీసా మిలానో, ఆష్లే జడ్, ఆస్కార్ విజేతలైన గ్వెనెత్ పాల్ట్రో, జెన్నిఫర్ లారెన్స్ వంటి వారందరూ లైంగిక వేధింపులు, లైంగిక హింసకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు.

3-me-too-movement-Alyssa-milano

Image source: Instagram

ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?

సుమారుగా దశాబ్దం క్రితం న్యూయార్క్‌కి చెందిన టరానా బుర్కే(Tarana Burke) అనే సామాజిక ఉద్యమకారిణి మీటూ ఉద్యమం ప్రారంభించారు. లైంగిక హింస కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ధైర్యం కల్పించడానికి దీన్ని ప్రారంభించారు. మీరు ఒంటరి కాదనే ధైర్యాన్ని అందించడమే మీటూ ముఖ్యోద్దేశం.

2-me-too-movement-Tarana Burke

Image source: Instagram

మీటూ అనే రెండు పదాలు 2017లో పెను ఉప్పెనలా వెల్లువెత్తాయి. లైంగిక వేధింపులకు గురైన మహిళలు మీటూ అంటూ స్పందించాలన్న హాలీవుడ్ నటి అలీసా మిలానో పిలుపుతో స్త్రీలోకం అంతా ఏకమైంది.

ఆమె ట్వీట్ తర్వాత హర్వే వీన్ స్టైన్ ఆగడాలపై న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు వెలువరించింది. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న అతని దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా తక్కువ రోజుల్లోనే #MeToo ఉద్యమం వైరల్‌గా మారింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టించింది.

భారత్‌లో #MeToo ఉద్యమం

అమెరికాలో మొదలైన ఈ ఉద్యమం.. క్రమక్రమంగా ప్రపంచమంతా పాకింది. అనతి కాలంలోనే భారత్‌లోనూ మీటూ ప్రభావం మొదలైంది. రాధికా ఆప్టే, కల్కి కొచ్లిన్ వంటి ప్రముఖులు దీనికి మద్ధతు తెలపడమే కాకుండా తమపై జరిగిన లైంగిక హింస గురించి బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయనే విషయం అందరికీ అవగతమవడం ప్రారంభమైంది. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు, విభిన్నరంగాలకు చెందిన మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెప్పడం ప్రారంభించారు. బాధితులకు అండగా నిలిచారు. నటి రిచా చద్దా సైతం మన దేశంలో లైంగిక హింస తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తన బ్లాగులో చెప్పుకొచ్చింది.

అయితే.. గతేడాది అంటే 2018 సెప్టెంబర్లోనే ఇది తారస్థాయికి చేరుకొందని చెప్పాలి. ప్రముఖ నటి తనుశ్రీ దత్తా.. నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధిపులకు గురిచేశారని ఆరోపించింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమాలో ఓ పాట షూటింగ్ సమయంలో తనను వేధించారని చెప్పింది తనుశ్రీ దత్తా. ఆ సమయంలో తనకు ఎవరూ సపోర్ట్‌గా రాకపోవడం వల్ల ఆమె సెట్స్ నుంచి వెళ్లిపోయింది. సినిమా షూటింగ్ సమయంలోనే నానా పటేకర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ ఎవరూ వాటిని పట్టించుకోలేదు. పైగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమె బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి లైంగిక హింస గురించి తమ గళాన్ని వినిపిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలు సైతం ఈ విషయంలో తమ వాణిని బలంగా వినిపించడం ప్రారంభించారు. వీటిని గమనించిన తనుశ్రీ దత్తా గతంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. తనుశ్రీ కారణంగా మనదేశంలో మీటూ ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చింది.

4-me-too-movement-Tanushree-Dutta

ఒకప్పటి కమెడియన్, ఏఐబీ రైటర్ అయిన ఉత్సవ్ చక్రబర్తి తనపై జరిగిన వేధింపుల గురించి బయటపెట్టారు. ఆ తర్వాత క్వీన్ సినిమా దర్శకుడు వికాస్ భల్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కంగనా సైతం సమర్థించింది. వికాస్ భల్ తప్పుగా ప్రవర్తించేవాడని చెప్పింది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో పెద్దలుగా చలామణీ అయ్యే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ తమ విషయంలో అనుచితంగా ప్రవర్తించారని ఏకంగా ఆరుగురు మహిళలు ఆరోపించారు. ఎంజే అక్బర్ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారు చెప్పారు. ఇలాంటి కారణాలతో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ సైతం రాజీనామా చేశారు.

దక్షిణాదిన గాయని చిన్మయి ఈ విషయంలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తమపై లైంగిక హింస జరిగిందంటోన్న మహిళలకు అండగా నిలబడుతున్నారు.

మీటూ ఉద్యమం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పిన 12 మంది మహిళలు – #MeToo Stories

మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు మహిళలు, పురుషులనే తేడా లేకుండా తమ సోషల్ మీడియా అకౌంట్ స్టేటస్ ను మీటూ అని అప్ డేట్ చేస్తున్నారు. దీని ద్వారా లైంగిక హింస ఎలా పెచ్చరిల్లుతోందో తెలియజేస్తున్నారు. ‘#MeToo’ అంటే నేనూ లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ సంఘటన కారణంగా మానసిక హింస అనుభవిస్తున్నానని చెప్పడానికి సంక్షిప్త రూపం. ఇలాంటి వారికి మా మద్ధతు తెలపాలనే ఉద్దేశంతో POPxo కొంతమంది మహిళలను తమకెదురైన లైంగిక హింస గురించి ముందుకొచ్చి చెప్పమని కోరింది.

1. నేను చదువుకొనే రోజుల్లో మెట్రో స్టేషన్ నుంచి మా ఇంటికి నడిచి వెళ్లేదాన్ని. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ అలా నడుచుకొంటూ వెళ్లడం నాకిష్టం. ఎప్పటి లాగే ఆ రోజు కూడా మధ్యాహ్నం మూడింటికి నేను కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్నాను. ఫ్లై ఓవర క్రాస్ చేస్తుండగా నేను ఓ అబ్బాయిని గమనించాను. అతను నా వంకే చూస్తున్నాడు. నేను అతన్ని అంతగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాను. ఉన్నట్టుండి నా వెనక అతి దగ్గరగా ఏదో ఉన్నట్టనిపించి వెనక్కి తిరిగాను. ఇంతకు ముందు నేను చూసిన అబ్బాయి నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు. నాకు కాస్త భయం వేసింది. సాయం కోసం అటూ ఇటూ చూశాను. కానీ కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు. అతడు ఏమీ మాట్లాడకుండా.. నన్ను కిందకి చూడమని కళ్లతో సైగ చేస్తున్నాడు. అప్పుడు గుర్తించాను. అతడు తన పురుషాంగాన్ని తన చేత్తో పట్టుకొన్నాడు. నేను చూడగానే తను వెనక్కి పరిగెత్తుకు వెళ్లిపోయాడు. ఆ సంఘటన తర్వాత దీని గురించి కొందరికి వివరించాలని ప్రయత్నించాను. కానీ ఎవరూ అర్థం చేసుకోలేదు. అతడు తన పురుషాంగాన్ని నాకు చూపించడానికే అలా చేసి ఉంటాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఇక నడిచి వెళ్లడం మానేశాను. ఎందుకంటే.. పగటి వేళలోనే ఇలా ఉంటే.. రాత్రి సమయంలో అయితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో అనిపించింది. ఇప్పటికీ ఈ సంఘటన నన్ను వెంటాడుతూ ఉంటుంది. అందుకే నేనూ అంటున్నాను ‘#MeToo’ అని. – ఇషిత శర్మ, జూనియర్ లైఫ్ స్టైల్ ఎడిటర్

5-me-too-movement-harassment-office

Image source: Shutterstock

2. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నేను టీనేజ్ పార్టీలకు ఎక్కువగా వెళ్లేదాన్ని. ఓసారి ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాను. అక్కడే నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. నేను బాత్ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ పెద్దాయన డోర్ బయట ఉన్నాడు. అతడు నన్ను లోనికి నెట్టి తనూ లోనికి వచ్చాడు. కానీ నేను అతన్నుంచి ఏదోలా తప్పించుకొన్నాను. ఆ తర్వాత నేను ఏడుస్తూనే ఉన్నాను. నా స్నేహితులు నన్ను ఓదారుస్తున్నా.. నాకు ఏడుపు ఆగడం లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తిని గుర్తించి అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఆ తర్వాత నేను మానసికంగా బలహీనపడ్డాను. కొన్ని రోజుల పాటు అలానే ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడూ వాణ్ని అలా వదిలేయకుండా పోలీసులకు పట్టిస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. – నిత్య ఉప్పల్, అసిస్టెంట్ ఎడిటర్.

3. 2009లో ఎదురైంది నాకు ఈ చేదు సంఘటన. అప్పుడు  నేను గార్గి కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ రెండో ఏడాది చదువుతున్నాను. బాండ్ ప్రాక్టీస్ పూర్తి చేసిన తర్వాత నేను ఆటో కోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే అప్పటికి ఓలా, ఉబెర్ సర్వీస్ లు అందుబాటులో లేవు. ఆ రోజు టైం కూడా పెద్దగా అవ్వలేదు. సాయంత్రం ముూడింటికో.. నాలుగ్గంటలకో సిరి ఫోర్ట్ రోడ్ ఏరియా దగ్గర ఎదురుచూస్తున్నాను. కొంత సమయం ఎదురు చూసిన తర్వాత నా ముందు నుంచి ఓ కారు వెళ్లింది. కొంత దూరం వెళ్లిన ఆ కారు మళ్లీ వెనక్కి వచ్చింది. అతను నవ్వుతూ కారెక్కమన్నాడు. నాకు అతనెవరో తెలీదు. నాకు తెలిసినవారేమోనని గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు అలా అనిపించలేదు. ఎక్కడికైనా దారి చెప్పాలా? అని అడిగాను. అతను నవ్వుతూ.. ‘నువ్వు కాలేజీ గర్ల్ కదా’ అన్నాడు. నేను తలూపాను. ‘కామన్వల్త్ గేమ్స్ లో వాలంటీర్ గా పనిచేస్తావా?’ అనడిగాడు. ఆ సమయంలో దిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. యువత అంతా ఆ సమయంలో వీటిలో తమ వంతు పాలు పంచుకొనేందుకు ప్రయత్నాలు చేసేవారు. నేను అతన్ని ‘ఎందుకడుగుతున్నారు?’ అనడిగా. ‘నేను నీకు ఆ అవకాశం ఇస్తా’నన్నాడు మళ్లీ నవ్వుతూ. అది కాస్త అసహజంగా అనిపించింది. ‘నా హోటల్ రూం కి నిన్ను తీసుకెళ్లి ఏ పని ఎలా చేయాలో చెబుతా’నన్నాడు. అప్పటికీ నాకు అంత అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి సంఘటన నాకెదురు కాలేదు. నేను ఆలోచించుకొంటుండగానే.. భయపడుతున్నావా? అన్నాడు. ‘ఇలాంటి బ్రా వేసుకొన్న అమ్మాయిలు కూడా భయపడతారా?’ అని నా మెడ దగ్గర కనిపిస్తున్న హాల్టర్ బ్రా స్ట్రాప్ చూసి అతడు అలా అన్నాడు. అంతే ఇక నేను ధైర్యం తెచ్చుకొన్నాను. కాస్త కఠినంగానే నీ దారిన నువ్వెళ్లు అన్నాను. అతను మరింత శ్రుతి మించసాగాడు. ఈ లోగా అక్కడికి ఓ ఆటో వచ్చింది. వెంటనే అది ఎక్కి త్వరగా పోనిమ్మన్నాను. అక్కడి నుంచి బయటపడటానికి నేను ఆటోవాలా అడిగినంత డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. – డెస్సీడ్రె ఫ్లెమింగ్, లైఫ్ స్టైల్ ఎడిటర్.

4. కార్పొరేట్ ప్రపంచంలో పురుషులు మహిళలపై ఎలా తమ బలాన్ని ప్రయోగించాలని చూస్తారనేదానికి తార్కాణం ఈ సంఘటన. ఈ మధ్య కాలంలోనే నేనెదుర్కొన్న సంఘటన ఇది. నా దుర‌దృష్టం కొద్దీ పని ప్రదేశంలోనే నేను ఈ వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చంది. కారిడార్ లో నడుస్తున్నప్పుడు అమ్మాయిలను అసభ్యంగా తాకడం అతనికున్న అలవాటు. అతడు దాన్ని తప్పుగా భావించడు. ఎందుకంటే అక్కడ పనిచేసే కొందరు మహిళలు అతని చేష్టలకు అభ్యంతరం చెప్పరు. పైగా అది సాధారణమని భావిస్తారు. పైగా అతడు మేనేజ్మెంట్ స్థాయిలో పెద్ద హోదాలో ఉన్నాడు. ఓ సారి ఆఫీస్ పార్టీ కోసం ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లాం. అక్కడ నేను డ్రింక్ తెచ్చుకొన్నాను. అతడు తనతో మాట్లాడటానికి పిలిచాడు. మాట్లాడుతూ నా వెనుక భాగాన్ని చేత్తో తాకాడు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. నాకు చాలా బాధగా అనిపించింది. నేను వాష్ రూంలో చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయాను. నా కొలీగ్స్ ద్వారా విషయం తెలుసుకొన్న అతడు నాకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా చాలా చెత్తగా. ‘ప్రతి ఒక్కరితోనూ నేను ఇలాగే ఉంటాను. నన్ను క్షమించు నిన్ను కించపరచాలని నేను అలా చేయలేదు. ఇంకొన్ని రోజులు నువ్విక్కడ పనిచేస్తే నువ్వు కూడా అలాగే చేస్తావు’ అన్నాడు. అన్నింటికంటే నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే.. అక్కడ పనిచేసేవారెవరూ అతడి తప్పు గురించి అతనికి తెలియజెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అతడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. అతని ప్రవర్తనను వ్యతిరేకించే అమ్మాయిలు.. కొన్నేళ్లుగా అక్కడే పనిచేస్తూ అతన్ని సమర్థించే మహిళలు మాటల యుద్ధాలు ప్రారంభించారు. నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను. వెంటనే నాకు ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. కానీ అది కుదరలేదు. అందుకే ట్రిప్ పూర్తయ్యే వరకు మిగిలిన వారికి దూరంగా ఒంటరిగా సమయం గడిపాను. కానీ కొన్ని రోజుల తర్వాత అతడి మీద చట్టపరమైన చర్య తీసుకోనందుకు నా మనసు నన్ను నిందించడం ప్రారంభించింది. – నిధి కావ్లే, సీనియర్ బ్యూటీ రైటర్.

6-me-too-movement-harassment-touching-inapproproiate

Image source: Shutterstock

5. సాయంత్రం ఏడు గంటలకనుకొంటా.. ఓ రోజు నేను అహ్మదాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఓ మల్టీప్లెక్స్ కి వెళ్లాను. ఏడో ఫ్లోర్ లోకి వెళ్లడం కోసం నేను లిఫ్ట్ ఎక్కాను. నా వెనకే ఓ వ్యక్తి లిఫ్ట్ లోకి వచ్చాడు. అతన్ని చూడగానే నాకు ఎందుకో అనుమానం కలిగింది. లిఫ్ట్ డోర్ మూసుకోగానే. అతడు తన ప్యాంట్ లో నుంచి అతడి చెత్తను బయటకు తీసి నాకు చూపించడం మొదలుపెట్టాడు. నిరంతరం రద్దీగా ఉండే ప్రదేశంలో అతడలా చేస్తున్నాడంటే దీనికోసం ముందే ప్లాన్ చేసుకున్నాడేమో అనిపించింది. అందుకే ఏం ఆలోచించకుండా.. వెంటనే లిప్ట్ ఆపేసి బయటకు పరిగెత్తాను. అలా నన్ను చూసిన ఇద్దరు నన్ను ఆపి ఏం జరిగిందని అడిగారు. అది చూసిన అతడు తన ముఖాన్ని అడ్డు పెట్టుకొని పారిపోసాగాడు. అతన్ని పట్టుకోమని నేను గట్టిగా అరవసాగాను. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ సంఘటన నాకు షాక్ లానే మిగిలిపోయింది. అమ్మాయిలు శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు. దాన్ని అలుసుగా తీసుకొని ఇలా చేయడం నాకు నచ్చలేదు. నేను సీసీటీవీ ఫుటేజ్ కోసం మాల్ యాజమాన్యాన్ని పట్టుబట్టాను. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే.. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో కూడా లిఫ్ట్ లో సెక్యూరిటీ కెమెరాలు పెట్టడం లేదు. ఇలా అయితే ఎలా? మన దేశంలో బుల్లెట్ ట్రెయిన్, స్మార్ట్ సిటీల కంటే ముందు మహిళల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో మహిళలు ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చెప్పలేం కదా..! – సుమోనా బోస్, ఫ్యాషన్ రైటర్.

6. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో నేను వేధింపులకు గురయ్యాను. ఓ మధ్యాహ్నం సమయంలో నేను కాలేజీ నుంచి ఇంటికి బస్ లో వెళుతున్నాను. కొన్ని స్టాపుల తర్వాత ఒక తాగుబోతు నా చేయి నొక్కడం ప్రారంభించాడు. వెంటనే నేను అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్లాను. అతడు అక్కడికి కూడా వచ్చాడు. నాకేం చేయాలో పాలు పోలేదు. తర్వాతి స్టాప్ లో నేను బస్ దిగిపోయాను. ఆ తాగుబోతు కూడా నా వెనకే బస్ దిగాడు. ఇక నా వెన్నులో వణుకు మొదలైంది. ఆ వెంటనే వచ్చిన బస్ ఎక్కేశాను. వాడు కూడా అదే బస్ ఎక్కాడు. బస్ దిగిన తర్వాత కూడా నా వెంట పడ్డాడు. ఏదోలా ధైర్యం తెచ్చుకొని మా ఇంటికి పరిగెత్తుకు వెళ్లిపోయాను. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు నాకు బస్ లో వెళ్లాలంటే చాలా భయం వేసేది. – సొనాలీ పవార్, బ్యూటీ రైటర్ & ఎడిటోరియల్ కో ఆర్డినేటర్.

7-me-too-movement-harassment-bus

Image source: Shutterstock

7. పద్దెనిమిదేళ్ల వయసులో నేను మా సోదరీమణులతో కలసి దగ్గర్లో ఉన్న మార్కెట్ కు వెళుతున్నాను. మధ్యలో అక్కడికి ఏ దారిలో వెళ్లాలా? అని మాట్లాడుకొంటున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్లడానికి రెండు దారులున్నాయి. ఈ లోగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. బహుశ మా మాటలు విని మాకు దారి చెప్పే వంకతో మా దగ్గరికి వచ్చాడు. మేం అతన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం. కానీ ఆ వ్యక్తి మమ్మల్ని వెనకే అనుసరిస్తూ వస్తున్నాడు. మా ఇంటి పక్కకు రాగానే వాడు మా దగ్గరికి వచ్చి మా శరీరాలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయసాగాడు. మాకేం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. వెంటనే ఆయన్ని పిలిచాం. మా సోదరి అయితే వెక్కి వెక్కి ఏడవసాగింది. మా ముగ్గురిలోకి ఎక్కువ హింసకు గురైంది ఆమే. చుట్టుకపక్కల వారంతా వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కానీ పోలీసులు మాత్రం వాడి భవిష్యత్తు పాడవుతుంది. క్షమించి వదిలేయమన్నారు. జరిగిన సంఘటన కంటే ఇదే నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. నా అంగీకారం లేకుండా నన్ను తాకే అధికారం వాడికి ఎవడిచ్చాడు? – సృష్టి గుప్త, జూనియర్ ఎడిటర్

8. నాకు పదకొండేళ్ల వయసున్నప్పుడు నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ సమ్మర్ హాలిడేస్ కి ముంబయిలోని మా అక్క ఇంటికి వెళ్లాను. అక్కడి నుంచి గోవాకి పెళ్లికి వెళ్లాం. ఆ పెళ్లి రోజు నాకెదురైన సంఘటన గుర్తు తెచ్చుకొంటే.. నా ఒంటిపై తేళ్లు, జెర్రులు పాకినట్టుగా అనిపిస్తుంది. నా తండ్రి వయసున్న వ్యక్తి నాతో మాట్లాడటం ప్రారంభించారు. నా చదువు గురించి అడిగి తెలుసుకొంటున్నారు. కంప్యూటర్ పై నాకున్న అవగాహనపై చాలా ఆసక్తి కనబరిచాడు. దాని గురించే మరిన్ని విషయాలు మాట్లాడుతూ నన్ను తన వెంట తీసుకెళుతున్నారు. నేను నాకు తెలిసిందంతా చెబుతూ ఆ అంకుల్ వెంట వెళ్లిపోతున్నాను. అలా ఎవరూ లేని చోటకి నన్ను తీసుకెళ్లిపోయాడు. అక్కడ నన్ను ఎత్తుకొని నా పెదవులపై ముద్దుపెట్టసాగాడు. ఆ వయసులో ఏం జరుగుతుందో నేను గుర్తించలేకపోయాను. కానీ నాకు అతడలా చేయడం అనీజీగా అనిపించింది. అంతటితో ఆగకుండా.. ఇంకా ఎదగని నా స్థనాలను తడమసాగాడు. నాకు చాలా భయం వేసింది. నేను వాష్రూం కి వెళ్లాలని అతడ్ని నేను అడిగాను. అలా ఎందుకడిగానంటే.. పెద్దల పట్ల మర్యాదగా వ్యవహరించాలని చిన్నప్పటి నుంచి నేర్పించారు. బాత్రూంకి వెళుతున్నప్పుడు కూడా నా వెనకే వచ్చాడు. చివరికి అందులోకి రావడానికి కూడా ప్రయత్నించాడు. కానీ అక్కడికి మా అక్క రావడంతో అతడు వెనకడుగు వేయక తప్పలేదు. రెండుమూడేళ్ల తర్వాత నాకేం జరిగిందో తెలసింది. ఆ తర్వాత కూడా అతడు మా ఇంటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. వాడు రావడానికి ముందే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయేదాన్ని. ఇప్పటికీ ఈ విషయం గురించి నేను మా ఇంట్లో చెప్పలేదు. చెప్పాలని అనుకోవడం లేదు కూడా. నిజానికి నాకు అతని పేరు కూడా తెలీదు. ఇంక నేను మా అమ్మానాన్నకి ఏమని చెప్పాలి? ఎవరని చెప్పాలి? – మనస్వి జైట్లీ, వెడ్డింగ్ ఎడిటర్.

8-me-too-movement-harassment-child-abuse

Image source: Shutterstock

9. కొన్ని వారాల పాటు నాలో నేను కుమిలిపోయిన తర్వాత నేనెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నేను మా సోదరికి చెప్పాను. పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నేను పనిచేయాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉండేది.  ఓసారి బెంగళూరులో జరుగుతున్న కామికాన్ లో స్టాల్ పెట్టాం. నాతో పాటు మరో అమ్మాయి, ముగ్గురబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు. కామికాన్ పూర్తయిన తర్వాత నేనూ నా స్నేహితురాలు కొద్దిగా డ్రింక్ చేసి  స్నేహితులను కలవడానికి వెళ్లాం. తిరిగి వచ్చిన తర్వాత నా స్నేహితురాలు త్వరగా నిద్రపోయింది. నేను మాత్రం ఇంకా మెలకువగానే ఉన్నాను. మా సేల్స్ టీమ్ లో ఒక వ్యక్తికి మేం ఆల్కహాల్ తాగామనే విషయం తెలిసింది. మమ్మల్ని చెక్ చేసే వంకతో మా రూం కి వచ్చాడు. నేను గుర్తించే లోపే.. నా దగ్గరగా వచ్చి నాకు ముద్దు పెట్టాడు. అతడికి పెళ్లయింది. ఆరేళ్ల పాప కూడా ఉంది. నేను అతన్ని దూరంగా తోసి వెంటనే గదిలోంచి వెళ్లక పోతే.. మర్యాదగా ఉండదని హెచ్చరించాను. అతడు మారుమాటడకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన గురించి రెండు వారాల పాటు ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నా సోదరితో ఈ విషయం చెప్పాను. తను మా బాస్ తో మాట్లాడి.. వాడి ఉద్యోగం పీకించేసింది. – సృష్టి సబర్వాల్, సీనియర్ ఫ్యాషన్ రైటర్.

10. నాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు నేను నా సోదరి చికెన్ కబాబ్స్ తెచ్చుకోవడానికి వెళుతున్నాం. నా సిస్టర్ నాకంటే కొంచెం ముందు వెళుతోంది. నేను కాస్త వెనకబడి ఉన్నాను. ఈలోగా ఒకడు.. నా దగ్గరకు వచ్చి నా స్థనాలను పట్టుకొని చెత్తగా మాట్లాడి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నేనేం చేయలేకపోయాను. చెప్పాలంటే ఆ సంఘటనకు షాక్ కి గురయ్యాను. ఆ సంఘటన గురించి నేనెవరికీ చెప్పలేదు. చివరికి నా సోదరికి కూడా. ఇంటికి వెళ్లిన తర్వాత బాగా ఏడ్చాను. కొన్ని రోజుల తర్వాత మా అమ్మతో ఈ విషయం గురించి చెప్పాను. నా స్నేహితులతో ఆ సమయంలో నేను ఎలా ప్రతిస్పందించి ఉంటే బాగుంటుందని అడిగాను. ఇప్పటికీ ఆ బ్రిడ్జి దాటుకొని వెళుతుంటే.. నాకు ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురైతే ఏం చేయాలా? అని ఆలోచిస్తూ ఉంటాను. ఇలాంటి సంఘటనలు మన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి. కానీ చాలా మంది అబ్బాయిలకు తాము చేసిన ఇలాంటి పని వల్ల ఆ అమ్మాయికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. ఎందుకంటే వారికి ఈ బాధ తెలియదు కాబట్టి. ఇది చదువుతున్న అబ్బాయిలు.. నేను మిమ్మల్ని చేతుల్ని జోడించి వేడుకొంటున్నాను.. ఇలాంటి పరిస్థితిల్లో ఎవరైనా ఉంటే వారికి అండగా నిలబడండి. అమ్మాయిలూ.. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే భయపడిపోకుండా.. ఇలాంటి చేష్టలకు పాల్పడే వారి ముఖాన్ని పచ్చడి చేసేయండి. ఎక్కడ కొట్టకూడదో.. అక్కడ ఓ తన్ను తన్నండి. ఎందుకంటే.. ఇలాంటి వారిని మనం ఊరికే వదిలేయకూడదు. – క్యాథలీన్ చెన్, లైఫ్ స్టైల్ రైటర్.

11. గ్రాడ్యుయేషన్ తర్వాత మా స్కూల్ లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లాను. అక్కడ నా పాత మిత్రులను ఎందరినో కలుసుకొన్నాను. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడకి వచ్చాడు. మా ఇద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కట్ అవ్వలేదు. పార్టీ పూర్తయిన తర్వాత నేను ఒంటరిగా మా ఇంటికి వెళ్లడానికి అతడు ఇష్టపడలేదు. కానీ మాకు క్యాబ్ గానీ, ఆటో గానీ దొరకలేదు. కాబట్టి మా ఇంటికి నడుచుకుంటూనే బయలుదేరాం. స్కూల్ కి మా ఇంటికి దూరం మూడు కి.మీ. మాత్రమే. మార్గమధ్యంలో కాలేజీ విషయాలు చర్చించుకొన్నాం. వాటిలో అనుమానించడానికి నాకేమీ కనబడలేదు. మా ఇంటికి చేరుకొన్న తర్వాత నాకు అతని ప్రవర్తనలో తేడా కనబడసాగింది. మా ఇంటికి రావడానికి అతను పట్టుబడుతున్నాడు. నేను వద్దని చెప్పి మా బిల్డింగ్ లోకి వెళ్లబోతోంటే.. నా వెనకే వచ్చి నన్ను గోడ వైపు నెట్టి ముద్దు పెట్టుకోబోయాడు. నేను వద్దని చెప్పినా వినలేదు. బలవంతంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించసాగాడు. నా శక్తినంతా కూడదీసుకొని నేను తనని వెనక్కి నెట్టి.. మా ఇంటివైపు పరుగుపెట్టాను. నా గురించి తెలిసిన వ్యక్తి నన్ను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఇంతకు ముందు మేం క్లోజ్ గా ఉన్నాం కాబట్టి ఇలా చేయచ్చనుకొన్నాడు. ‘ఇంతకు ముందు మనం చేయగాలేనిది ఇప్పుడు చేస్తే తప్పేంటి?’ అని ఆ రాత్రి నాకు మెసేజ్ పెట్టాడు. నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి అతనడిగింది చేయాలట. ఇంట్లోకి వెళ్లిన తర్వాత నా గదిలో గడియ పెట్టుకొన్నాను. ఎందుకంటే నేను ఏడ్వటం అమ్మానాన్న చూడటం నాకు ఇష్టం లేదు. ఇది జరిగి ఇప్పటికి ఐదేళ్లు దాటుతోంది. అతను నాకు ఈ విషయమై క్షమాపణలు చెబుతున్నాడు. అయినా నేను అతన్ని క్షమించలేను. క్షమించను. – సాయుంక్త జైన్, సీనియర్ ఫ్యాషన్ రైటర్.

9-me-too-movement-harassment

Image source: Shutterstock

12. దాదాపుగా ఏడేళ్ల పాటు నేను నా కుటుంబ సభ్యుడి చేతిలో లైంగిక హింసకు గురయ్యాను. పైగా అతడు మా కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి. పైగా అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉంటాడనే పేరు అతనికుంది. నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడనుకొంటా.. అతను నా పట్ల తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. నిజం చెప్పాలంటే నాకేం జరుగుతుందో తెలిసేది కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇది తప్పు అని నాకర్థం అవడం ప్రారంభించింది. అతడు మా ఇంటికి వచ్చినా.. లేదా నేను వాళ్లింటికి వెళ్లినా.. ఇతర పిల్లలతో నన్ను ఆడుకోనిచ్చేవాడు కాదు. ఆడిస్తాననే వంకతో ఎవరూ లేని చోటకు నన్ను తీసుకెళ్లేవాడు. నా విషయంలో అతడి ప్రవర్తన అర్థం అయిన తర్వాత నేను తప్పించుకు తిరగసాగాను. అతడు రాగానే నేను మా స్నేహితురాలింటికి వెళ్లడం.. ఐదు నిమిషాలు చేయాల్సిన స్నానం అరగంట చేయడం.. లేదా ఎవరైనా వచ్చే వరకు బాత్రూంలోనే ఉండటం చేసేదాన్ని. 15 ఏళ్ల వయసులో అతని చెడు ప్రవర్తన గురించి ధైర్యం చేసి ఇంట్లో చెప్పాను. కానీ అతన్ని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానన్నారు. చివరికి ఓ రోజు వాడు నా ప్యాంట్ విప్పడానికి ప్రయత్నించినప్పుడు.. పక్కకు తోసి.. నా శక్తికొద్దీ తన్నాను. కొన్నేళ్ల పాటు నాపై పాల్పడిన హింసకు అతడు చెల్లించిన మూల్యం రెండు చాక్లెట్లు. ఇది జరిగి దాదాపు పదేళ్లు కావస్తోంది. దాని గురించి నేనెప్పుడూ మాట్లాడాలనుకోను. ఎందుకంటే నేను చేయగలిగిందేమీ లేదు. నా మెదడులోని ఓ భాగం.. ఇది జరిగి చాలా రోజులైంది కదా.. ఇప్పుడు దానిగురించి ఎందుకని అడుగుతోంది. మరో భాగం ఈ విషయం బయటకు తెలిస్తే అమ్మానాన్న ఏమనుకొంటారని అడుగుతోంది. –  లైంగిక హింసకు గురైన ఓ సోదరి.

వీరే కాదు.. మనదేశంలోని అమ్మాయిలంతా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, బడి, గుడి ఇలా మనం సురక్షితంగా భావించే ప్రదేశాల్లో సైతం వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. రోజుల వయసున్న పసికందు నుంచి పండు ముసలి అవ్వ వరకు లైంగిక హింసకు గురవుతున్నారు. వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే తామెదుర్కొన్న వేధింపుల గురించి బయటకు చెబుతున్నారు. ఫిర్యాదు చేస్తున్నారు. తమను తక్కువగా చూస్తారేమో.. తమనే తప్పు పడతారనే ఉద్దేశంతో చాలామంది తమకు జరిగిన అన్యాయాన్ని తమలోనే దాచుకొంటున్నారు. మరికొందరు బెదిరింపులకు భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి మహిళలందరికీ అండగా నిలబడి.. ధైర్యాన్ని నూరి పోసి.. లైంగిక హింసకు చరమగీతం పాడే దిశగా వారిని నడిపిస్తున్న ఉద్యమమే ఈ #MeToo.

‘ఇప్పుడు అర్థమైందా బామ్మ మీటూ ఉద్యమం అంటే ఏమిటో?’

‘అర్థమైంది కానీ.. బాగా చదువుకొన్న వాళ్లు.. పెద్ధ స్థానాల్లో ఉన్నవాళ్లు కూడా ఇలా చేస్తారా? ఎవరే వాళ్లు?’

బాలీవుడ్ పై మీటూ ఉద్యమం ప్రభావం

10-me-too-movement-harassment-in-family

Image source: Shutterstock

లాస్ ఏంజెల్స్ లో మొదలైన ఈ ఉద్యమం హాలీవుడ్ లోని ప్రముఖుల నిజ స్వరూపాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఆ ప్రభావం ముంబయిపై కూడా పడింది. తనుశ్రీ దత్తా నానాపటేకర్ పై చేసిన ఆరోపణలకు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత జాన్సీ సెక్వీరా మద్ధతు తెలపడంతో ఈ అంశం చర్చకు వచ్చింది. ఆ సంఘటన జరిగిన సమయంలో జాన్సీ ప్రత్యక్షసాక్షి. ఆ సమయంలో ఆమె రిపోర్టర్ గా పనిచేస్తోంది. ఆ తర్వాత షైనీ శెట్టి అనే మరో అసిస్టెంట్ డైరెక్టర్ తనుశ్రీ చెప్పినదంతా వాస్తవమేనని మరోసారి స్పష్టం చేసింది.

దీంతో తనుశ్రీకి మద్ధతుగా సోనమ్ కపూర్, స్వరా భాస్కర్,  ఫర్హాన్ అక్తర్ వంటి వారు ముందుకొచ్చారు. ఆ తర్వాత మహిళా కమెడియన్లు, రచయిత్రులు, దర్శకులు ధైర్యంగా ముందుకొచ్చి తామెదుర్కొన్న లైంగిక హింస గురించి చెప్పడం ప్రారంభించారు. అప్పుడే అందరికీ ఈ రంగుల ప్రపంచం వెనుక దాగున్న చీకటి కోణం గురించి తెలిసింది. నానాపటేకర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, అలోక్ నాథ్, సాజిద్ ఖాన్, ఉత్సవ్ చక్రవర్తి, వికాస్ బల్, వరుణ్ గ్రోవర్ వంటి సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి.

సినిమా రంగానికే మీటూ ఉద్యమ ప్రభావం పరిమితం కాలేదు. ఇతర రంగాల్లోనూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి ప్రపంచానికి తెలిసింది. కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఎంజే అక్బర్, చిత్రకారుడు జతిన్ దాస్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా, నేపథ్య గాయకుడు అభిజిత్ భట్టాచార్య వంటి వారికీ మీటూ సెగ తగిలింది.

హాలీవుడ్ లో హార్వే వీన్ స్టైన్ తో మొదలైన మీటూ సెగ.. కెవిన్ స్పేసీ, అజీజ్ అన్సారీ, జానీ డెప్, ఎడ్ వెస్ట్ విక్ వంటి వారినీ తాకింది. 

ఇదీ బామ్మ మీటూ ఉద్యమం అంటే. ఇక నువ్వే చెప్పు.. అమ్మాయిలు తమపై జరిగిన లైంగిక దాడి గురించి నిర్భయంగా చెప్పాలా? చెప్పకూడదా?

హాలీవుడ్ ను కుదిపేసిన మీటూ ఉద్యమం గురించి ఆంగ్లంలో చదవండి.

మీటూ ఉద్యమం ప్రారంభించిన మహిళ గురించి ఆంగ్లంలో చదవండి.

Feature Image: Shutterstock