(Priyanka Chopra get Emotional talking about her father Ashok Chopra)
ప్రతి తండ్రికి తన కూతురి కంటే గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. బెస్ట్ ఫ్రెండ్ అయినా.. తనకున్న చిన్ని సామ్రాజ్యానికి యువరాణి అయినా.. అన్నీ ఆ కూతురే. తను జీవితంలో అన్నీ సాధించాలని కోరుకుంటూ.. ఆమె కోసం ఎంతో కష్టపడేందుకు తండ్రి సిద్ధమవుతుంటాడు. అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి తనని సిద్ధం చేస్తాడు. మనోధైర్యాన్ని పెంపొందిస్తాడు.
అలాంటి తండ్రి కోరుకొనేది ఒక్కటే. ఎప్పటికైనా తన గారాల పట్టిని.. పెళ్లికూతురిగా చూడాలనుకోవడం. కూతురి పెళ్లి కోసమే ప్రతి తండ్రి కలలు కంటాడంటే.. అది అతిశయోక్తి కాదేమో. తన తండ్రి కూడా అచ్చం అలాంటి వ్యక్తేనని.. తన పెళ్లి కోసం ఆయన ఎంతగానో వేచి చూశారని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.
తన తండ్రి అంటే తనకెంతో ఇష్టమని.. ఆయన మరణాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని చాలా సార్లు ఇంటర్వ్యూల్లో భాగంగా వెల్లడించింది ప్రియాంక. తన తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా క్యాన్సర్ బారిన పడి ఆరేళ్ల క్రితం మరణించిన తర్వాత.. ఆయనపై ఉన్న ప్రేమకు గుర్తుగా.. ఆయన చేతి రాతతో ‘డాడీస్ లిటిల్ గర్ల్’ అనే ట్యాటూని కూడా వేయించుకుంది ప్రియాంక. మామూలు సమయంలో కంటే.. తనకు ఆయన లేని లోటు.. తన పెళ్లి సమయంలో బాగా తెలిసిందని చెప్పుకొచ్చింది ప్రియాంక.
“మా నాన్న ఎప్పుడూ నా పెళ్లి గురించే ఆలోచించేవారు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా..? అని వేచిచూసేవారు. నన్ను పెళ్లి కూతురిగా చూడాలని ఆయన కలలు కనేవారు. నా పెళ్లి సమయంలోనూ.. నేను మా నాన్నను చాలా మిస్సయ్యాను. మా అమ్మ ఒక్కతే అన్ని పనులూ చేసుకుంటూ ఉంటే.. మా నాన్న ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఆయన అప్పుడు ఉండి ఉంటే.. ఎంత సంతోషంగా ఉండి ఉంటారో అనిపించింది. ఆయనెప్పుడూ నా పెళ్లి కోసమే వేచి చూస్తుండేవారు. “నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను సూట్ కుట్టించుకుంటాను. నేను సూట్ ఎప్పుడు కుట్టించుకోవాలి? నువ్వే చెప్పు?” అంటూ ప్రశ్నించేవారు. నా పెళ్లి సమయంలో కూడా.. ఆయన నా పక్కనే ఉంటే బాగుండేదని అనిపించింది” అని తన మదిలోని భావాలను పంచుకుంది ప్రియాంక.
“మా నాన్న చనిపోయి ఆరేళ్లయినా.. ఆయన మాకు తోడుగా లేరన్న నిజాన్ని నేను నమ్మలేకపోతున్నా. ఆయన గురించి నేను ఎప్పుడూ బాధపడేదాన్ని. ఆ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ‘స్కై ఈజ్ పింక్’ సినిమాలో నేను అదితి పాత్రలో నటించాను. ఈ సినిమాలో నటించిన తర్వాత.. నా తండ్రి పోయిన బాధ నుంచి నేను బయటకొచ్చా. ఈ సినిమా నాకు చనిపోవడం అన్నది చాలా సహజమైన ప్రక్రియ అని.. అది మనలో ప్రతి ఒక్కరికీ జరుగుతుందని నేర్పించింది. వారి కోసం మనం బాధపడకుండా.. వారు అంత ఆనందమైన జీవితాన్ని గడిపినందుకు ఆనందించాలని నేర్పించింది” అంటూ తన సినిమా గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.
గతంలో తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి చెబుతూ “మా నాన్న మిలిటరీలో పనిచేసేవారు. అందుకే మేం ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్స్‌తో వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాళ్లం. మా నాన్న నాకు పదమూడేళ్ల వయసులో డ్రైవింగ్ నేర్పించారు. ఆయన 1997లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన మంచి నటుడు, పెయింటర్, గాయకుడు కూడా. అందరూ ఆయనని సింగింగ్ సర్జన్ అనేవారు. ఆయన నుంచే నేను పాటలు పాడడం, నటించడం నేర్చుకున్నా. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు స్టేజ్ షోలు నిర్వహించేవారు.
నన్ను కూడా స్టేజ్ పైకి తీసుకెళ్లి.. నాకు తెలిసిన ఆఫ్రికన్ పాటను పాడించేవారు. ఆయన చాలా పొడవుగా ఉండేవారు. నా వయసు రెండు లేదా మూడేళ్లు ఉన్నప్పుడు.. నేను ఆయన కాళ్ల కింద నుంచి వెళ్లడానికి ప్రయత్నించేదాన్ని. అప్పుడు ఆయన నా తల పట్టుకునేవారు. నేను ఏడ్చేదాన్ని. అప్పుడు ఆయన నాకోసం ప్రత్యేకంగా కొన్న సైకిల్ పై కూర్చోబెట్టి తిప్పేవారు. ఇలా చిన్నతనం అంతా నాన్నతో ఎంతో ఆనందంగా గడిపాను” అంటూ తన తండ్రిని గుర్తుచేసుకుంది ప్రియాంక.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.