సమంత అక్కినేని (Samantha Akkineni).. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ కొన్నాళ్లకే ఇండస్ట్రీ టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. కథా ప్రాధాన్యముండే సినిమాల్లో నటిస్తూ.. ప్రతి సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరువవుతోంది. మొదట్లో ఉన్న పట్టుదలనే కొనసాగిస్తూ.. తెగువ గల కథానాయికగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటనా తీరు మాత్రమే కాదు.. సినిమాలు ఎంచుకునే విధానం, ఫిట్‌నెస్.. ఇలా అన్నింటిలోనూ ఆమె మెరుగ్గా రాణిస్తోంది.
ఆ అంకితభావమే ఆమెను టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ని చేసింది. కెరీర్‌లోనూ విజయవంతంగా దూసుకుపోయేలా చేస్తోంది. కేవలం నటనతోనే కాదు.. తన ఫిట్‌నెస్‌తో (Fitness) పాటు.. అందంతోనూ అమ్మాయిలందరికీ స్ఫూర్తినిచ్చే నాయికగా మారింది సమంత. ఎంతగా అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఫిట్‌నెస్ విషయంలో.. చాలామంది అమ్మాయిలకు ఆమె రోల్ మోడల్‌గా మారిపోయింది. చిత్రమేంటంటే.. ఎంత నచ్చినంత తిన్నాసరే.. సమంత ఫిట్‌గానే ఉంటుంది.
దీనికి ఆమె జిమ్‌లో చేసే వ్యాయామాలే ప్రధాన కారణమట. వందల కేజీల బరువులు ఎత్తుతూ.. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా ఫిట్‌నెస్ రోల్ మోడల్‌గా మారిన ఈ అందాల రాశి డైట్ రహస్యాలతో పాటు.. తన సౌందర్యానికి కారణమైన చిట్కాల గురించి కూడా తెలుసుకుందాం రండి.
సమంత వర్కవుట్ రొటీన్
సమంతకు వర్కవుట్ అంటే ఎంతో ఇష్టం. జిమ్‌లో బరువులెత్తడం ఆమెకు నచ్చుతుందట. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే.. తను బరువులెత్తుతూ ఫోజులిస్తున్న ఎన్నో ఫొటోలు, వీడియోలు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు తను ఎత్తే బరువును పెంచుకుంటూ పోతుందీ అందాల తార. జిమ్‌కి రోజూ తప్పనిసరిగా వెళ్లే ఆమె.. ఇందుకోసం రోజూ ఉదయాన్నే ఐదు గంటలకే నిద్ర లేస్తుందట.
ఉదయాన్నే షూటింగ్ ఉండి జిమ్‌కి వెళ్లడం కుదరకపోతే సాయంత్రం వర్కవుట్ చేస్తుంది. షూటింగ్‌లు లేదా హాలిడే ట్రిప్‌లకు వెళ్లే సందర్భంలో.. ఆయా ప్రదేశాలలో వ్యాయామం చేయడం కుదరదు కాబట్టి.. తప్పనిసరిగా జాగింగ్ చేస్తుందట. ఫిట్‌నెస్ అంటే ఇంతగా ఆసక్తి ఉన్నా.. కార్డియో చేయడానికి మాత్రం పెద్దగా ఇష్టపడదట సమంత. కేవలం వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి మాత్రమే ఆసక్తి చూపుతుందీ అందాల నాయిక.
దీనికి ఓ పెద్ద కారణం కూడా చెబుతుందామె. “నేను ఎక్కువ బరువుతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. ఇలాంటి బరువుతో ఒక రెప్ వ్యాయామం చేస్తే చాలు.. అరగంట పాటు కార్డియో చేస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో.. అన్ని క్యాలరీలు కరుగుతాయి. ఈ రెప్ చేయడానికి కేవలం ఐదు నిమిషాల సమయం పడుతుంది. అంటే ఐదు నిమిషాల్లో.. అరగంట వ్యాయామం చేసినట్లు లెక్కన్నమాట. అందుకే నేను కార్డియోకి దూరంగా ఉంటాను. కార్డియో చేసే సమయాన్ని కూడా వెయిట్ లిఫ్టింగ్‌కే కేటాయిస్తాను” అని అంటుందామె.
కేవలం వెయిట్ లిఫ్టింగ్ మాత్రమే కాదు.. జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటోందీ భామ. దానికి సంబంధించిన వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వీటితో పాటు శీర్షాసనం, కార్ట్ వీల్ (చేతులపై నిలబడడం) కూడా సులువుగా చేస్తుందీ బ్యూటీ. సిలంబం అనే కర్రసామును నేర్చుకున్న సమంత తనకు కర్ర తిప్పడం బాగా అలవాటైందని చెప్పింది. అంతేకాదు.. మార్షల్ ఆర్ట్స్ అన్నా.. సవాళ్లు ఎదుర్కోవడం అన్నా తనకు ఆసక్తి ఎక్కువ అని.. అందుకే నేర్చుకున్నానని చెబుతుంది.
సమంత ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. నగరంలోనే బెస్ట్ ఫిట్‌నెస్ ట్రైనర్‌తో కలిసి.. ట్రైనింగ్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందామె. తాను ఆహారం విషయంలో అప్పుడప్పుడూ చీటింగ్ చేసినా.. వ్యాయామం విషయంలో ఎప్పుడూ రాజీ పడనని.. అదే తన అందానికి, ఫిట్‌గా ఉండేందుకు కారణమని చెబుతుంటుంది సమంత.
సమంత డైట్ ప్లాన్
సాధారణంగా జిమ్‌లో గంటకు పైగా వర్కవుట్ చేస్తుంది కాబట్టి.. ఆహారం విషయంలో సామ్ పెద్దగా రూల్స్ పాటించదట. అయితే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటుందట. అవే కాదు.. కూరగాయలంటే ఎక్కువగా ఇష్టపడే ఆమె.. క్యాలరీలు లెక్కించుకోకుండా తినేస్తుందట. అన్నం, సాంబార్, చేపలు, మటన్ వంటివి తను ఎక్కువగా తీసుకుంటుందట. తగినన్ని నీళ్లు తాగడానికి కూడా.. తాను చాలా ఎక్కువ ప్రాధాన్యమిస్తానని.. ఒక్క రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా.. సరిగ్గా నిద్రపోకపోయినా.. మరుసటి రోజు తాను జిమ్‌లో బరువులు మోయలేనని చెబుతుందామె.
వారమంతా డైట్ పాటించినా.. ఆదివారం మాత్రం తనకు నచ్చిన ఆహారం తీసుకుంటానని చెబుతుందామె. తనకెంతో ఇష్టమైన తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ, రొయ్యల కూర వంటి స్పైసీ ఫుడ్ తెప్పించుకొని తింటుందట. బిర్యానీ తినడం అంటే తనకెంతో ఇష్టమని.. బిర్యానీ తినే సందర్భం కోసం వేచి చూస్తుంటానని చెబుతోంది సమంత. అంతేకాదు.. ఇండియన్ వెజ్ ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని.. అందుకే రోజూ అదే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తానని చెబుతుందామె.
తనకు ఆహారం పట్ల ఆసక్తి పెరగడానికి తన చిన్నతనమే కారణమని చెబుతుంది సమంత. “నాకు ఇద్దరు అన్నయ్యలు. ఇంట్లో నేనే చిన్నదాన్ని. మా చిన్నతనంలో అమ్మా, నాన్న మాకు నచ్చిన వస్తువు ఏదైనా తీసుకొస్తే.. ముగ్గురికీ పంచి ఇచ్చేవారు. కానీ మా అన్నయ్యలు వాళ్ల వంతు తినేసి.. నాది కూడా తినేందుకు ప్రయత్నించేవారు. అందుకే వారిది పూర్తయ్యేలోపే.. నాది కూడా అయిపోవాలని వేగంగా తినడం అలవాటు చేసుకున్నా. చిన్నప్పుడు ఎక్కువ ఫుడ్స్ ప్రయత్నించే అవకాశం లేకపోయింది.
అందుకే నాకు వివిధ రకాల ఆహారాలు.. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తీసుకోవడమంటే ఇష్టం. అది ఇప్పటికీ అలాగే ఉంది. నా కోరికను ఇప్పుడు తీర్చుకుంటున్నా. హీరోయిన్‌గా ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నా.. జంక్ ఫుడ్ కనిపిస్తే ఆగలేను. ముఖ్యంగా పిజ్జా, బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని వారానికోసారి తప్పక తింటుంటా” అంటూ తనకు ఆహారం పై ఉన్న ప్రేమ గురించి చెప్పుకొచ్చింది సమంత.
సమంత డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే..
బ్రేక్ ఫాస్ట్ – ఉదయాన్నే సమంత గుడ్లు లేదా ఆమ్లెట్లు తీసుకుంటుందట. అయితే బ్రెడ్ ఎక్కువగా తీసుకోదట. అలాగే.. ఓట్స్‌తో చేసిన బ్రేక్ ఫాస్ట్ తింటుందట. అంతేకాదు.. అవకాడో అంటే తనకెంతో ఇష్టం కాబట్టి.. దాన్ని తప్పనిసరిగా తీసుకుంటానని చెబుతుంది సమంత.
లంచ్ – సమంత చికెన్ ఎక్కువగా తినదు కాబట్టి.. రోజూ మధ్యాహ్న భోజనంలో భాగంగా కూరగాయలు, చిరు ధాన్యాలతో చేసిన వంటకాలతో పాటు.. చేపలు లేదా మటన్ తీసుకుంటుందట. తన భోజనంలో భాగంగా రైస్‌ను అసలు టచ్ కూడా చేయదట. వాటి బదులు మిల్లెట్స్‌తో చేసిన వంటకాలే తీసుకుంటుందట.
స్నాక్స్ – స్నాక్స్‌లో భాగంగా ఉడికించిన లేదా బేక్ చేసిన చిలగడదుంపలతో పాటు గుడ్లు కూడా తీసుకుంటుందట.
డిన్నర్ – డిన్నర్ కూడా లంచ్ మాదిరిగా చేసినా.. కూరగాయలు, చేపలు, మటన్ మొదలైనవాటిని ఎక్కువగా తీసుకొని.. మిగిలిన పదార్థాలను తక్కువగా తీసుకుంటుందట సామ్.
వీటితో పాటు వర్కవుట్‌కి ముందు.. ప్రీ వర్కవుట్ స్నాక్‌గా వీగన్ ప్రొటీన్ షేక్‌ని తీసుకుంటుందట సామ్. ఇది తన పొట్ట పై ఒత్తిడిని పెంచకుండా.. సులువుగా అరుగుతుందట. అంతేకాదు.. వీటితో పాటు స్నాక్స్‌లో భాగంగా గుడ్లు లేదా పీనట్ బటర్ వేసి.. బ్రెడ్ తీసుకోవడానికి సమంత ఆసక్తి చూపిస్తుందట. వీటి వల్ల తాను వ్యాయామం చేయడానికి తగిన శక్తి అందుతుందని.. తాను చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తాను కాబట్టి.. వ్యాయామం చేయడానికి ముందు శక్తినిచ్చే ఆహారం తినడం వల్ల.. అలాంటి వ్యాయామాలు చేసే శక్తి లభిస్తుందని చెబుతుంది సమంత.
మెరిసే చర్మానికి సమంత చిట్కాలు
తన వర్కవుట్, ఫిట్‌నెస్ రొటీన్ తన అందానికి కూడా కారణమని చెబుతోంది సమంత. రోజూ తగినన్ని నీళ్లు తాగడం.. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు కూరగాయలు తీసుకోవడం వల్ల.. చర్మ సమస్యలకు దూరంగా ఉంటుందట ఈ భామ. దీంతో పాటు ఎక్కడికి వెళ్లినా.. సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగిస్తుందట సమంత. “నేను ఎక్కడికి వెళ్లినా నా హ్యాండ్ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండే వాటిలో.. సన్ స్క్రీన్ లోషన్ ఒకటి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా దాన్ని అప్లై చేసుకుంటా” అని చెబుతోంది సమంత.
అంతే కాదు.. తన మెరిసే చర్మానికి గల రహస్యాన్ని వెల్లడిస్తూ “సాధారణంగా మనం ఇంట్లో వెనిగర్ పెద్దగా ఉపయోగించం. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల ముఖం పై ఎలాంటి మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం అద్భుతంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? అలాంటివారందరూ.. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగండి. నేను రోజూ పరిగడుపునే దాన్ని తాగుతాను కాబట్టే నా చర్మం ఇలా ఉంది. పైగా దీనివల్ల కొవ్వు కరిగిపోవడంతో పాటు మెటబాలిజం కూడా వేగంగా మారుతుంది” అంటూ తన సౌందర్య రహస్యం గురించి చెప్పుకొచ్చింది. అయితే ఇది తాగిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలట. లేదంటే పళ్లు పాడవుతాయని చెబుతోందీ బ్యూటీ.
అలాగే తనది ఆయిలీ స్కిన్ కాబట్టి.. టీనేజ్‌లో మొటిమలు ఎక్కువగా వచ్చేవని చెప్పే సమంత.. అవి రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి క్రీమ్‌లు వాడుతుందట. ఆమె ‘బీహెచ్ ఏ పవర్ లిక్విడ్’ ఉపయోగించి తన చర్మం పై నూనె ఎక్కువగా విడుదల కాకుండా.. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా కాపాడుకుంటుందట.
అంతేకాదు.. పగలంతా అలసిపోయిన తన కళ్ల కింద.. నల్లటి వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు రాత్రి కాగానే ‘బేజున్ రోసెల్లే టీ ఐ జెల్ ప్యాచెస్’ని కళ్లపై ఉంచుకొని.. అలసటని దూరం చేసుకుంటుందట. వీటితో పాటు చర్మం ముడతలు పడకుండా.. ప్యూరిటో రిపేర్ అడ్వాన్డ్స్ సీరమ్‌ని.. చర్మంలో తేమను పెంచి ట్యాన్ బారిన పడకుండా కాపాడేందుకు.. గెలాక్టో నియాసిన్ పవర్ ఎస్సెన్స్‌ని ఉపయోగిస్తుందట.
సమంత ఉపయోగించే మేకప్ ఉత్పత్తులు
మేకప్ విషయంలో ఎప్పటికప్పుడు సమంత ఆలోచనలు మారుతుంటాయి. అయితే తను ఉపయోగించే మేకప్ ఉత్పత్తుల సంస్థను మాత్రం తను ఎప్పటికీ మార్చదట. లిప్ స్టిక్ విషయానికొస్తే.. మ్యాట్ ఫినిషింగ్ అందమైన లుక్‌ను అందించడంతో పాటు.. పెదాలను మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి దాన్నే ఉపయోగిస్తుందట. అంతేకాదు.. ఎక్కువగా న్యూడ్ కలర్స్ ఉపయోగించడానికే సమంత ఆసక్తి చూపిస్తుంది.
అందులోనూ ‘నార్స్ వాకిరీ లిప్ పెన్సిల్’నే ఎక్కువగా వాడుతుంది. ఇక కళ్లకు మ్యాక్ కాస్మెటిక్స్ ఐ లైనర్, ఐకో బ్లాక్ మ్యాజిక్ మస్కారా, ద బామ్ సంస్థ రూపొందించిన ‘ఐ షాడో’ని ఉపయోగిస్తుంది. శరీరంలో కళ్లు చాలా సున్నితమైన భాగాలు కాబట్టి.. వాటికి ఉపయోగించే మేకప్ విషయంలో తాను ఏమాత్రం రాజీ పడనని.. బాగా నమ్మకం ఉన్న ఉత్పత్తులనే వాడతానని చెబుతుందామె. వీటితో పాటు మెరిసే ముఖం కోసం సీసీ క్రీమ్‌తో పాటు ‘అవర్ గ్లాస్ గ్లో ప్యాలెట్’తో బ్లష్ చేసుకుంటుంది సమంత.
మేకప్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించే ఆమె.. ఛానెల్ లుమైర్ ఫ్లూయిడ్ లైట్ వెయిట్ ఫౌండేషన్, లారా మెర్సియ్ ట్రాన్స్ లుసెంట్ పౌడర్‌ను ఉపయోగిస్తుంది. వీటితో పాటు బ్లెండ్ చేయడానికి.. బ్యూటీ బ్లెండర్ స్పాంజ్‌ను ఉపయోగిస్తుందామె. ఇక చక్కటి సువాసన కోసం బైరెడోస్ వెల్వెట్ హేజ్ పెర్ఫ్యూమ్‌ను ఉపయోగిస్తుంది. రాత్రి పడుకునే ముందు.. మేకప్ తీయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదట సమంత.
దీన్ని తీసేయడానికి ‘గార్నియర్ మిసెల్లార్ వాటర్’ని కాటన్ పై వేసి.. దాంతో ముఖాన్ని తుడిచేస్తుందట. ఆ తర్వాత ముఖాన్ని కడుక్కొని.. నైట్ క్రీం అప్లై చేసుకొని నిద్రపోతుందట. అందుకే ఆమె చర్మం అంత అందంగా ఉందనుకోవచ్చు.
ఫ్యాషన్ విషయంలో కూడా..
కేవలం ఇవే కాదు.. తన ఫ్యాషన్లతోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది సమంత. టాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరు సాధించిన సమంత టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ స్టైలిస్ట్‌లను కూడా తన దుస్తుల ఎంపికకు ఉపయోగించింది. అంతేకాదు.. దేశ విదేశాలకు చెందిన డిజైనర్ల దుస్తులను కూడా ధరించి కొత్త ట్రెండ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది సమంత.
దీని గురించి ఆమె మాట్లాడుతూ “నేనెప్పుడూ సాధారణంగా ఉండే దుస్తులను ఎంచుకోను. నా దుస్తులతో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే ప్రతి సందర్భానికీ నా లుక్ ప్రత్యేకంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటా. వదులుగా ఉండే దుస్తులు నాకు పెద్దగా నప్పవని నా అభిప్రాయం. అందుకే ఫ్యాషన్ గురించి కాకుండా.. ఆ దుస్తులు నాకు నప్పుతాయా? లేదా? అని ఆలోచించి ఎంచుకుంటుంటా” అని తన ఫ్యాషన్ల గురించి చెప్పుకొచ్చింది సామ్.
అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి తనేం చెబుతుందంటే..
తన వ్యాయామాలతో అందరికీ స్ఫూర్తినిచ్చే సమంత వ్యాయామం చేయడానికి.. ఉదయం లేచి జిమ్‌కి వెళ్లడానికి ఇబ్బంది పడేవారికి సలహా ఇస్తూ.. “నేను ఇప్పటికీ జిమ్‌కి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటా. కానీ నేను నటిని. అందంగా కనిపించాలి కాబట్టి.. జిమ్‌కి వెళ్లడం తప్పనిసరి. అయితే ఒకసారి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసి దాని ఫలితాలు చూడడం ప్రారంభిస్తే.. అదే మనకు ఎంతో కిక్ ఇస్తుంది. మన శరీరంలో అడ్రినలిన్ పరిగెత్తేలా చేస్తుంది. మీలో మార్పును చూడడం మీకు ఆనందాన్ని ఇస్తుంది.
ఇలా వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల.. మీ జీవితం కూడా ఆర్గనైజ్డ్‌గా మారి.. ప్రతి దానికి తగిన సమయాన్ని కేటాయించుకుంటారు. ఇది మీకో థెరపీలా పనిచేస్తుంది. కాబట్టి వ్యాయామం చేయడం ప్రారంభించండి” అంటూ సలహాను కూడా ఇస్తోంది సమంత.
అంతేకాదు.. వ్యాయామం వల్ల కండలు పెరిగిపోయి.. మగవారిలా కనిపిస్తామని భయపడే వారికి.. అలాంటిదేమీ ఉండదని.. పైగా వెయిట్ లిఫ్టింగ్ వల్లే తన శరీరం ఒంపులు తిరిగి కనిపిస్తూ.. తానింకా అందంగా మారేందుకు కారణమైందని చెబుతోంది సమంత.
అమ్మాయిలు బరువులెత్తడం చాలా ముఖ్యమని కూడా చెబుతోంది సమంత. ఇక అందం విషయానికొస్తే.. సహజ సౌందర్యంతో కనిపించేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు.. యాపిల్ సైడర్ వెనిగర్ లాంటి ఉత్పత్తులను ఉపయోగించి చర్మాన్ని నాజూగ్గా మార్చుకోవచ్చని చెబుతుందీ అందాల తార.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.