Advertisement

Entertainment

Thappad Trailer Talk : భర్త చెంపదెబ్బ కొట్టినందుకు.. విడాకులు కోరిన భార్య కథ

Sandeep ThatlaSandeep Thatla  |  Jan 31, 2020
Thappad Trailer Talk : భర్త చెంపదెబ్బ కొట్టినందుకు.. విడాకులు కోరిన భార్య కథ

గత కొంతకాలంగా హీరోయిన్ తాప్సి పన్ను (taapsee pannu) నటిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆమె చేసిన పింక్ చిత్రానికి.. ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చాక.. కాస్త విభిన్నంగా ఉండే పాత్రలనే ఆమె ఎంచుకోవడం గమనార్హం. 

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

పింక్ తరువాత తాప్సీ చేసిన చిత్రాలు – ముల్క్ , బదలా, సాండ్ కి ఆంక్.. ఇలా వేటికవే  తాప్సిని ఒక మంచి నటిగా ఆవిష్కరించాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘తప్పడ్’. ఈ ‘తప్పడ్’ (thappad) సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇక ఈ  ట్రైలర్ చూశాక … మరోసారి తాప్సి  నటన లేదా అభినయం జన సామాన్యాన్ని ఆకర్షిస్తుందని ఇట్టే చెప్పవచ్చు. 

మీరు కూడా తప్పడ్ ట్రైలర్ (thappad trailer) ని చూడండి …

తప్పడ్ ట్రైలర్ టాక్ (Trailer Talk)

చూసారుగా..  ఎటువంటి తప్పు చేయకుండా ఒక తప్పడ్‌ని (చెంపదెబ్బ) ఎలా భరించాలి ? అని నిర్మొహమాటంగా చెప్పే గృహిణి పాత్రలో తాప్సి మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.  ఒక చెంపదెబ్బకే.. ఇలా భర్త నుండి విడాకులు తీసుకొవడమేంటి ? అని మీకు అనిపించవచ్చు. అయితే ఒక భార్య తన భర్త నుండి కోరుకునేది కేవలం ప్రేమ, గౌరవం మాత్రమే కాని … చెంపదెబ్బ కాదని చెబుతుంది ఈ చిత్ర కథ. 

ఇక సాధారణంగా ఇలాంటి సంఘటనలు భార్యాభర్తల మధ్య జరిగితే.. సర్దుకుని పొమ్మని లేదా పొరపాటున అలా జరిగిపోయిందని చెప్పే వారు మన చుట్టూ చాలామందే ఉంటారు.  ఇదే విషయాన్ని ఈ చిత్రంలో కూడా  చూపెట్టడం జరిగింది. అలాగే తాప్సి ఇంట్లో పనిమనిషి మాట్లాడుతూ – “నా భర్త నన్ను రోజు కొడుతూనే ఉంటాడు.. కాకపోతే ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఎలా విడిపోతాము” అని తెలపగా.. వివాహ బంధం నిలబడాలంటే ఆడదే కాస్త ఓర్పుగా ఉండాలని తాప్సి అత్తగారి పాత్ర చెబుతుంది. 

అలాగే కోర్టులో కేవలం భర్త తనని చెంపదెబ్బ కొట్టిన కారణంగానే విడాకులు కావాలని అనుకున్నానే తప్ప.. మరే ఇతర కారణాలు చెప్పబోనని తేల్చి చెబుతుంది కథానాయిక పాత్ర. 

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

అలాగే ఈ చిత్రంలో సంభాషణలు కూడా జనాలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయనే హింట్‌ని ఇస్తూ.. ఈ ట్రైలర్ ద్వారా మనకి ఆ విషయం చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అనుభవ సిన్హా. అలా ట్రైలర్‌లో (trailer)  మెరిసిన కొన్ని సంభాషణలు ఇవే –

“బంధం అన్నాక కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.. అందుకే ఆ బంధం విడిపోకుండా చూసుకోవాలి” అని లాయర్ చెబితే.. “విడిపోకుండా చూసుకోవాలంటే.. అప్పటికే అది విడిపోయింది అని అర్ధం కదా” అని సమాధానం చెబుతుంది కథానాయిక.

“మనం చేసేది కరెక్ట్ అనే చేస్తాము.. కాని కొన్నిసార్లు అలా కరెక్ట్ అని చేసిన వాటి ఫలితం మాత్రం సంతోషంగా ఉండదు” అని తాప్సితో తన తండ్రి చెప్పడం మరో ఆసక్తికరమైన సన్నివేశం

“ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు… ఈ చెంపదెబ్బలు అనేవి ఆ ప్రేమను వ్యక్తపరచడమే అని అనుకోవచ్చు కదా” అని ఒక లాయర్ ప్రశ్నిస్తాడు.

ఆఖరుగా.. తాప్సి చెప్పే డైలాగ్ ఈ సినిమా కథను ఒక సింగిల్ పాయింట్‌లో చెబుతుంది. ఆ డైలాగ్ ఏంటంటే – “ఆ ఒక్క చెంపదెబ్బ కారణంగా.. మా పెళ్ళిలో ఉన్న అసమానతలన్నీ నాకు స్పష్టంగా కనిపించాయి. అంతకముందు వరకు అసమానతలను చూసి చూడకుండా వదిలిపెట్టేసి బ్రతుకుతూ ఉన్నాను”.

ఈ పైన పేర్కొన్న సంభాషణలు చదివితే.. సినిమాలో మనం ఏం చూడబోతున్నామో.. ఆ విషయం పైన ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!