నిన్న మొన్నటి వరకు ఈ అమ్మాయి తన పని తాను చేసుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తన పని తాను చేసుకోగలదు. అంతేకాదు.. మెనింజైటిస్(meningitis) కారణంగా కాళ్లూచేతులూ పోగొట్టుకొన్న వారి జీవితాల గురించి అందరిలోనూ అవగాహన పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది పదమూడేళ్ల టిల్లీ లాకీ(Tilly Lockey).
సరిగ్గా పదిహేను నెలల వయసులో టిల్లీ లాకీ మెనింజైటిస్ బారిన పడింది. అసలు ఆమె బతికే అవకాశమే లేదని వైద్యులు తేల్చి చెప్పేశారు. అయినా తమ వంతు ప్రయత్నం చేశారు ఆమె తల్లిదండ్రులు. పదిహేను నెలల వయసులో ఆమెకు పది సార్లు రక్తం ఎక్కించారు. అలా ఆమె ప్రాణాలనైతే కాపాడారు కానీ.. టిల్లీ రెండు చేతులను తీసివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో టిల్లీ చేతులే కాదు.. తన కాలి వేళ్ల చివర్లు సైతం పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఎదిగే కొద్దీ ఆమె అవసరాలను తల్లిదండ్రులే తీర్చేవారు. మూడేళ్ల వయసులో ఆమెకు ఎలక్ట్రానిక్ ఆర్మ్స్ అమర్చారు. వాటి సాయంతో తనంత తానుగా కొన్ని పనులు చేసుకోగలిగేది. కానీ కొన్ని పనులు పూర్తి చేసుకోవడానికి మాత్రం తల్లిదండ్రులు లేదా స్నేహితులపై ఆధారపడేది.
గత ఏడాది జరుపుకొన్న క్రిస్మస్ పండగ టిల్లీ లాకీ జీవితంలో కొత్త కాంతిని తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. ఆ రోజు ఆమెకు బ్రిస్టల్ టెక్నాలజీ ఫర్మ్ అయిన ఓపెన్ బయోనిక్స్ నుంచి కృత్రిమ చేతులు అందాయి. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ బయోనిక్ ఆర్మ్స్ లో(Bionic arms) ఉండే ప్రత్యేకమైన సెన్సార్లు కండరాల కదలికలను గుర్తిస్తాయి. వాటికి అనుగుణంగా అవి కదులుతాయి. వీటికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ హైటెక్ లింబ్స్(కృత్రిమ చేతులు) త్రీడీ ప్రింటర్ సాయంతో తయారుచేసినవి. అంతేకాదు.. ఈ బయోనిక్ ఆర్మ్స్ బ్రిటన్‌లో వైద్యపరమైన ఆమోదం పొందిన తొలి కృత్రిమ అవయవాలుగా గుర్తింపు పొందాయి.
ఈ చేతులతో టిల్లీ లాకీ ఇప్పుడు చాలా పనులు చేసుకోగలుగుతోంది. చక్కగా పెయింట్ వేయగలుగుతోంది. ఆటలు ఆడగలుగుతోంది. అంతేనా.. తన ఫ్రెండ్స్‌కు చక్కగా హైఫై కూడా ఇచ్చేస్తోంది. అలాగే స్వయంగా మేకప్ కూడా వేసుకోగలుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాన్ని ఎంతో మంది వీక్షించారు. మెచ్చుకొన్నారు కూడా!
No hands and an arm in a cast over Christmas proves just how incredible The #HeroArm from @openbionics actually is! pic.twitter.com/ui1X4xRrjw
— Tilly Lockey (@GiveTillyaHand) December 27, 2018
టిల్లీ లాకీ తల్లి పేరు సారా లాకీ. ఆమె ఓ మెనింజైటిస్ ఛారిటీ తరఫున పనిచేస్తున్నారు. టిల్లీ లాకీ గురించి చెబుతూ.. ‘టిల్లీకి ఈ కృత్రిమ చేతులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. తనకి తాను చక్కగా మేకప్ వేసుకోగలుగుతుంది’ అంటారు. గత కొన్నేళ్లుగా తన కుమార్తెకు అన్ని విధాలుగా వీలుగా ఉన్న బయోనిక్ ఆర్మ్స్ కోసం వెతుకుతోంది సారా. ఈ క్రమంలోనే 2016లో ఓపెన్ బయోనిక్స్ వారు రూపొందించిన బయోనిక్ ఆర్మ్స్ గురించి తెలుసుకుంది.
వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు టిల్లీని ఎంపిక చేసుకోవడంతో సారా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విధంగా బయోనిక్ ఆర్మ్స్ ఉపయోగించిన తొలి చిన్నారిగా టిల్లీ గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 8 జతల బయోనిక్ ఆర్మ్స్ను ఉపయోగించింది. అంతేకాదు.. తనలాంటి వారికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వాటిలో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా సదరు సంస్థ యాజమాన్యానికి తెలియజేసింది. అలా ఆ బయోనిక్ ఆర్మ్స్ తనలా మెనింజైటిస్ బారిన పడిన చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో తన వంతు ప్రయత్నం చేస్తోంది.
అయితే టిల్లీ ఇప్పటివరకు దాదాపు 8 జతల బయోనిక్ ఆర్మ్స్ ఉపయోగించినప్పటికీ గతేడాది క్రిస్మస్కు ఆమెకు అమర్చిన చేతులు మాత్రం నిజమైన చేతుల మాదిరిగానే పని చేస్తుండడంతో ఆమె చాలా సంతోషిస్తోంది. ఈ ఆర్మ్స్‌లో ఉండే సెన్సార్స్ వల్లే ఇవి సాధారణ చేతుల్లా పని చేస్తున్నాయి. వాటి సహాయంతో టిల్లీ తన పనులు చేసుకోవడం మాత్రమే కాదు.. తన పెట్ బాగోగులు కూడా చూస్తోంది. దానికి ఆహారం సైతం తినిపిస్తోంది.
కొన్నిరోజుల క్రితం టిల్లీ లాకీ తన హీరో ఆర్మ్స్tను ప్రదర్శించడానికి అల్టియా: ది బాటిల్ ఏంజెల్ ఇన్ ది వెస్ట్ ఎండ్ ప్రీమియర్ షోకు హాజరై.. అందరినీ ఆకట్టుకొంది.
You made the biggest mistake of your life… underestimating who I am. @GiveTillyaHand #AlitaBattleAngel pic.twitter.com/lOODwvhBwO
— Open Bionics (@openbionics) February 1, 2019
‘ఒకేసారి రెెండు చేతులతో రెండు వస్తువులను పట్టుకొని పైకెత్తడం మీకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ నాలాంటి వారికి అది చాలా గొప్ప విషయం’ అంటోంది టిల్లీ. అంతేకాదు.. వాటిని ధరించడం తనకు చాలా గర్వంగా ఉంటోందని చెబుతోంది టిల్లీ.
Thank you so much @DanielJMelville for drawing Tilly wearing your @openbionics #HeroArm Super cool #bionic artist 🙂 pic.twitter.com/p5p9SbMvN5
— Tilly Lockey (@GiveTillyaHand) January 16, 2019
పదమూడేళ్ల వయసుకే ఇంత పరిణతితో ఆలోచిస్తూ.. తనతో పాటు.. తనలాంటి ఎంతో మంది చిన్నారుల జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్న టిల్లీ లాకీని మనమంతా తప్పక అభినందించాల్సిందే..
ఇవి కూడా చదవండి
వాలెంటైన్ వీకే కాదు.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ఉందండోయ్..!
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..?