తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిళల భద్రత నిమిత్తం మునుపు షీ టీమ్స్ (SHE Teams) ప్రారంభించిన పోలీసు అధికారులు.. ఇటీవలే విమెన్ ఆన్ వీల్స్ (Women On Wheels) పేరిట మరొక కొత్త బృందాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పడు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసులకు సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం అమల్లోకి రావడంతో తెలంగాణ పోలీసు శాఖ మరొక గుర్తింపు సంపాదించినట్లైంది. ఇంతకీ అదేంటీ అంటారా?? అదేంటో తెలుసుకోవాలంటే విషయంలోకి వెళ్లిపోవాల్సిందే..
మునుపటి వరకు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అయిన కమాండో శిక్షణ (Commando Training) ఇప్పుడు మహిళా పోలీసు అధికారులకు కూడా ఇవ్వనున్నారు. అయితే ఇది ఎప్పుడో తర్వాత అమలు చేస్తారని మీరు భావిస్తే పొరపడినట్లే. ఎందుకంటే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొందరు మహిళా పోలీసు అధికారులను ఫిట్ నెస్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపిక చేయడం, వారికి నెల రోజుల పాటు కఠిన శిక్షణ ఇప్పించడం.. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. జనవరి 28 న ప్రారంభమైన ఈ శిక్షణ ఫిబ్రవరి 28న ముగియడంతో ఇటీవలే ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా తొలి విమెన్ కమాండో టీం (Telangana State First Women Commando Team) ని పరిచయం చేసిన ఘనత కరీంనగర్ పోలీసు శాఖ సొంతం చేసుకుంది.
ఈ కమాండో ట్రైనింగ్ లో భాగంగా అత్యంత కఠినమైన యుద్ధవిద్యగా భావించే క్రావ్ మాగా లో మహిళా అధికారులకు శిక్షణ ఇస్తారు. దీని ద్వారా ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కేవలం చేతులతోనే ఎదుటి వారిని అదుపు చేసి, మట్టి కరిపించాల్సి ఉంటుంది. కరీంనగర్ పోలీసు అధికారులు తలపెట్టిన ఈ ప్రయత్నంలో భాగంగా 80మంది మహిళా పోలీసులను ఎంపిక చేసి వారికి 15 రోజుల పాటు ఫిట్ నెస్ టెస్ట్ పెట్టి వారిలో కమాండో శిక్షణనె తట్టుకోగల 43 మందిని ఎంపిక చేశారు. వీరికి నెల రోజుల పాటు క్రావ్ మాగాలో శిక్షణ ఇచ్చారు. ఇది చాలా కఠినంగా ఉంటుందన్న కారణంతో మన దేశంలో ఇప్పటి వరకు దీనిని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేశారు. కానీ మహిళలు కూడా ఈ శిక్షణను పూర్తి చేయగలరని, తమ సత్తా చాటగలరన్న నమ్మకంతో ఈ ప్రయత్నానికి తలపెట్టిన పోలీసు అధికారులకు మంచి ఫలితాలు అందాయి.
క్రావ్ మాగా అనేది చాలా కఠినతరమైన శిక్షణ. ఎందుకంటే ఈ ఒక్క విద్యలోనే దాదాపు ఆరు విద్యలైన రెజ్లింగ్, రన్నింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, కరాటే మరియు పలు కష్టతరమైన వ్యాయామాలు కూడా భాగమై ఉంటాయి. ఈ విద్యను చాలా అగ్రదేశాలు తమ స్పెషల్ ఫోర్సెస్ కు తప్పనిసరి చేశాయి. అయితే ఇది మొదలైంది మాత్రం ఇజ్రాయిల్ లో. అక్కడి డిఫెన్స్ విభాగంలో మిలటరీ సైనికుల కోసం దీనిని రూపొందించారు.
ఇంతటి కష్టతరమైన విద్యలో మొట్టమొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం మాత్రమే కాకుండా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ శక్తి- సామర్థ్యాలు, నైపుణ్యాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఇకపై మరింత మంది మహిళా పోలీసు అధికారులకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలా శిక్షణ పొందిన మహిళా పోలీసులను ర్యాలీలు, ధర్నాలు.. వంటివి జరిగే సమయంలో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వాటిని అదుపు చేసేందుకు వీరిని రంగంలో దించనున్నారట!
ఈ శిక్షణ ముగింపు వేడుకకు కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన మహిళా పోలీసులు చేసిన మాక్ డ్రిల్ చూసి వారి కృషి, పట్టుదలను ఆయన కొనియాడారు. ఈ శిక్షణ ద్వారా సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని, సాటి మహిళల్లో ధైర్యం నింపాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమల్ హాసన్ రెడ్డి కూడా మహిళా పోలీసుల నైపుణ్యాలు కళ్లారా తిలకించిన తర్వాత తన నిర్ణయం సరైనదేనని నిరూపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మహిళా పోలీసు అధికారులు సాధించిన ఈ ఘనతతో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మరొక ప్రత్యేక గుర్తింపు సంపాదించినట్లైంది. పురుషులకు ధీటుగా మహిళా అధికారులను సైతం అన్ని వేళలా, అన్ని రకాలుగా సంసిద్ధులుగా తయారుచేస్తూ వారికీ అన్ని విద్యల్లోనూ ప్రాధాన్యం ఇస్తోన్న పోలీసు శాఖకు మనం అభినందనలు తెలపాల్సిందే. ఏమంటారు??
ఇవి కూడా చదవండి
“యుద్ధం వద్దు” అనడం తప్పా : ఓ జవాన్ భార్య ఆవేదన
వీరమరణం పొందిన భర్తకు దేశం గర్వించేలా నివాళి ఇచ్చిన గౌరీ మహదిక్..!
మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ
Image source: CP Karimnagar Facebook