ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
చరిత్ర సృష్టించిన మన ‘సింధు’ విజయం గురించి.. ఈ విషయాలు తెలుసా ?

చరిత్ర సృష్టించిన మన ‘సింధు’ విజయం గురించి.. ఈ విషయాలు తెలుసా ?

పూసర్ల వెంకట సింధు.. అందరూ ముద్దుగా పీవీ సింధు (Pv sindhu) అని పిలుచుకునే ఈ తెలుగు తేజం ప్రపంచ వేదికపై మన తెలుగు వారికే కాదు.. యావత్ భారత దేశానికే గర్వకారణంగా నిలిచింది. దేశంలో మరే క్రీడాకారుడికి దక్కని.. ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో ఎప్పుడూ రజతం, కాంస్యంతో సరిపెట్టుకునే మన దేశానికి తొలిసారి స్వర్ణాన్ని (Gold medal) అందించింది. అయితే సింధు చరిత్ర సృష్టించడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనూ ఎన్నో రికార్డులను తిరగరాసిందీ బ్యాడ్మింటన్ సంచలనం.

మన దేశంలో క్రికెట్ తర్వాత స్థానంలో బ్యాడ్మింటన్‌‌ని నిలిపేలా చేసిందామె. గత ఒలింపిక్స్ ఫైనల్లో సింధు ఆడుతుంటే క్రికెట్ మ్యాచ్ చూసినట్లుగా దాన్ని అంతా రెప్పార్పకుండా చూశారు. అదీ సింధు ఆటంటే. ఈ బ్యాడ్మింటన్ తార గురించి చాలా విషయాలు మనందరికీ తెలిసే ఉంటాయి. కానీ ఈ విజయానికి సంబంధించి మనకు తెలియని కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

Twitter

ADVERTISEMENT

1. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం కోసం సింధు ఎప్పటి నుంచో పోరాడుతోంది. 2013లో కాంస్యం, 2014లో కాంస్యం, 2017లో రజతం, 2018లో రజతం తర్వాత.. ఇన్నాళ్లకు స్వర్ణం సాధించి అద్భుత విజయాన్ని సాధించింది. వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు అలవోకగా విజయాన్ని సాధించింది.

2. కేవలం 37 నిమిషాలు.. ఇది సింధు ఆదివారం నాటి మ్యాచ్‌ని పూర్తి చేయడానికి తీసుకున్న సమయం. 2017లో వీరిద్దరి మధ్యే ఇదే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరిగింది. అప్పుడు 110 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చి నిలిచినా.. ఆఖరికి అలసిపోయిన సింధు ఆ మ్యాచ్‌లో రజతంతో సరిపెట్టుకుంది. ఒకుహుర మ్యాచ్ స్టైల్ పై బాగా అవగాహన పెంపొందించుకున్న సింధు.. ఇప్పుడు ఆమెను కేవలం అందులో సగం కంటే తక్కువ సమయంలోనే ఓడించింది.

Twitter

ADVERTISEMENT

3. సింధు, ఒకుహుర ఇప్పటికి వివిధ మ్యాచుల్లో 15 సార్లు తలపడ్డారు. అందులో ఎనిమిది సార్లు ఒకుహుర విజయాన్ని సాధిస్తే.. సింధు ఏడు విజయాలను సాధించింది. అయితే ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటివరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలవకపోవడం మాత్రమే కాదు.. ఈ సంవత్సరం అసలే పోటీలోనూ గెలుపొందలేదు సింధు. అందుకే ఈ మ్యాచ్ పైనా ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయినా విజయం సాధించింది.

4. ఇలా అంచనాలు లేని సమయంలో అద్భుతం సృష్టించడం సింధుకి ఇది మొదటిసారేమీ కాదు. 2016 రియో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టడానికి.. కొన్ని నెలల ముందు కాలి గాయంతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉంది సింధు. అయినా కూర్చొని చేత్తో ప్రాక్టీస్ చేసేదట. అప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి రజత పతకంతో తిరిగొచ్చింది.

Twitter

ADVERTISEMENT

5. ఇంతటి ఘన విజయాన్ని తన తల్లి విజయకు అంకితమిచ్చింది సింధు. మ్యాచ్ తర్వాత ఆమె మాట్లాడుతూ “2017, 2018 ఫైనల్లో నేను ఓడిపోయాను. అందుకే ఈ ఏడాది ఎలాగైనా గెలవాలనుకున్నా. నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కోచ్ గోపీచంద్, కోచింగ్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ పతకాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఇదే నేను తనకు ఇచ్చే పుట్టినరోజు కానుక” అని చెప్పింది సింధు.

6. సింధు విజయం గురించి వాళ్ల అమ్మ మాట్లాడుతూ.. “సింధు క్వార్టర్స్ గెలవడం ఓ టర్నింగ్ పాయింట్. మొదటి సెట్‌లో రాణించలేదు. దాంతో కాస్త టెన్షన్ పడ్డాం. కానీ ఆపై పుంజుకొని మిగిలిన రెండు సెట్లలో సత్తా చాటి విజయం సాధించింది. ఆరు నెలల నుంచి తన కఠిన సాధనకు ఫలితం దక్కింది. ప్రతిసారి నా పుట్టిన రోజుకు ఏదో ఒక బహుమతి ఇచ్చేది. ఈసారి నాతో పాటు దేశానికి.. మంచి బహుమతిని ఇచ్చింది..” అంటూ మీడియాతో ఆనందాన్ని పంచుకుంది. 

Twitter

ADVERTISEMENT

7. సింధు తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ప్లేయర్స్. ఆమె తండ్రి పీవీ రమణకి వాలీబాల్‌లో అర్జున అవార్డు కూడా దక్కింది. అయినా వారిలా కాకుండా.. సింధు బ్యాడ్మింటన్‌ని ఎంచుకోవడమే విభిన్నమంటే.. అందులో ఎన్నో పతకాలు సాధిస్తూ అద్భుతమైన కెరీర్ వైపు అడుగులు వేయడమనేది ఎవరూ ఊహించని విషయం అని చెప్పుకోవచ్చు.

8. సింధు ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌లో శిక్షణను ప్రారంభించింది. ముందు సికింద్రాబాద్‌లోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో మహబూబ్ అలీ దగ్గర శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకుంది. దీనికోసం ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి.. కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి మరీ స్టేడియంకు చేరుకొనేది. శిక్షణ పూర్తయ్యాక.. మళ్లీ తిరుగు ప్రయాణమయ్యేది. ఆటల కోసం తనకెంతో ఇష్టమైన బిర్యానీ, చాక్లెట్లను కూడా మానేసింది సింధు.

Hindu

ADVERTISEMENT

9. ఆటల్లో ముందున్నా.. చదువును కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు సింధు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 62 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. దీనికోసం పరీక్షలకు కొన్ని వారాల ముందు.. కాలేజీకి వెళ్లి మరీ లెక్చరర్స్‌తో పాఠాలను చెప్పించుకునేదట. అలా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించిన పాఠాలన్నీ ఒకేసారి విని.. ఆ తర్వాత దాన్ని చదివి గుర్తుంచుకొని పరీక్షలు రాసిందట. దానికే 62 శాతం మార్కులు సాధించింది.

10. మరో ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కీ రెడ్డి సింధుకి మంచి స్నేహితురాలు. వీరిద్దరూ ఒకేసారి శిక్షణను ప్రారంభించారట. ఇద్దరూ కలిసి శిక్షణ రోజుల్లో ఎంతో అల్లరి చేసేవారట. ఒక్కోసారి ముఖానికి పౌడర్, రెడ్ టూత్ పేస్ట్ రాసుకొని రాత్రుళ్లు జూనియర్స్‌ని దెయ్యాల్లా భయపెట్టేవారట కూడా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
26 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT