Advertisement

Bollywood

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన.. టాలీవుడ్ సినిమాలెన్నో..!

Soujanya GangamSoujanya Gangam  |  Sep 20, 2019
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన.. టాలీవుడ్ సినిమాలెన్నో..!

Advertisement

వాల్మీకి (valmiki).. టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. తమిళ నటుడు అధర్వ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సైతం కనిపించాడు. ఈ సినిమాకి ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టడాన్ని నిరసిస్తూ బోయ సామాజిక వర్గం వారు మొదటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ సినిమాకి వాల్మీకి పేరు పెట్టడమేంటని వారు ఆందోళన నిర్వహించారు.

ఈ టైటిల్ పై చిత్ర యూనిట్ వెనక్కి తగ్గకపోవడంతో.. వారు హైకోర్ట్‌ని కూడా ఆశ్రయించారు. దాంతో హైకోర్ట్ చిత్ర యూనిట్‌కి నోటీసులు జారీ చేసింది. దీంతో వెనక్కి తగ్గిన చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ .. టైటిల్‌ని గద్దలకొండ గణేష్‌గా (gaddalakonda ganesh)  మారుస్తున్నట్లు వెల్లడించింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్లన్నీ పూర్తయ్యాక.. చిత్ర విడుదలకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. 

 

ఈ సినిమాలో వాల్మీకి మహర్షిని కించపర్చేలా ఎలాంటి సీన్లు, డైలాగులూ లేకపోయినా.. డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని దర్శకుడు చెప్పారు. ఏ సామాజిక వర్గాన్ని కించపర్చేలా తమ సినిమా ఉండదని.. పైగా సినిమాలో వాల్మీకి మహర్షి జీవితం గురించి గొప్పగా చెబుతూ.. డైలాగులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇలా ఒక వివాదం వల్ల.. తన సినిమాకి ఓ గొప్ప టైటిల్ పెట్టలేక ఓడిపోయినట్లుగా ఫీలవుతున్నానని దర్శకుడు హరీష్ శంకర్ బాధపడ్డారు. అయితే వివాదాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తేం కాదు. తరచూ వివిధ సినిమాల్లో పాటలు లేదా డైలాగులతో పాటు.. చాలాసార్లు టైటిల్స్ విషయంలో కూడా వివాదాలు (controversies) రేగాయి. అలా వివాదాల బారిన పడిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం..

1. మిస్టర్ నూకయ్య

మంచు మనోజ్ నటించిన ఈ చిత్రానికి ముందు ‘మిస్టర్ నోకియా’ అని పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత నోకియా సంస్థ వారు దిల్లీ హైకోర్టులో కేసు వేశారు. దీంతో సినిమా విడుదయ్యాక కూడా మల్టీపెక్స్‌ల నుంచి సినిమాను తొలగించడం జరిగింది. సినిమా పేరును ‘నో కియా’గా మార్చినా.. సంస్థ పేరుకు దగ్గరగా ఉంది కాబట్టి.. దాన్ని తొలగించాలని, కాపీ రైట్ చట్టం ప్రకారం జరిమానా కట్టాలని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత సినిమా పేరును ‘మిస్టర్ నూకయ్య’గా మార్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

2. కొమురం పులి

పవన్ కల్యాణ్ హీరోగా 2010లో విడుదలైన సినిమా కొమురం పులి. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనూ ఆదివాసీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కొమురం అనేది ఆదివాసీల్లో ఓ తెగ పేరు అని.. తమ సంస్కృతి, సంప్రదాయాలను ఈ టైటిల్‌తో కించపరిచారన్నది వారి వాదన.  అలాగే.. ఈ సినిమాలో కొమురం భీం పేరును ఉపయోగించి.. ఆయనను కూడా అవమానిస్తున్నారని.. వెంటనే టైటిల్ నుంచి కొమురం అనే పదాన్ని తీసివేయాలని ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనలకు తలొగ్గిన సినిమా యూనిట్ టైటిల్‌ని ‘పులి’గా మార్చింది.

3. డీజే.. దువ్వాడ జగన్నాథమ్

ఈ సినిమా కథ, టైటిల్‌తో ఏమాత్రం ఇబ్బంది లేకపోయినా.. ఈ చిత్రంలోని ఓ పాట తమని కించపర్చేలా ఉందని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో.. పాటలోని పదాలను మార్చేశారు. ముందుగా ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో..’ అంటూ సాగే ఈ పాటలో ఉన్న నమక చమకాలు, ప్రవర, అగ్రహారం వంటి పదాలను తొలగించారు. ఇలాంటి మరికొన్ని పాటలలో కూడా పదాలు తొలగించడం మనం చూడొచ్చు.

ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ సినిమాలో ‘వేర్ ఈజ్ పంచెకట్టు.. వేర్ ఈజ్ ద నిలువు బొట్టు’ అంటూ సాగే పాటలో లిరిక్స్‌ని కూడా బ్రాహ్మణ సంఘాల నిరసనల అనంతరం మార్చారు. ‘జయం’ సినిమాలో రైలు బండిని తిడుతూ సాగే పాటను.. ఆ తర్వాత పొగుడుతూ రాసి పాడడం విశేషం.

4. దరువు

‘దరువు’ అనేది తెలంగాణకు చెందిన సాంస్కృతిక సంఘం పేరు. అందుకే తమ సంఘం పేరును ఉపయోగించి తీసిన సినిమాలో.. కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని తొలుత గొడవ చేశారు. అయితే ఆ సన్నివేశాలను తొలగించడంతో.. సినిమా విడుదల పట్ల అభ్యంతరాలు తొలగిపోయాయి.

5. దేనికైనా రడీ

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన నిర్వహించడంతో.. ఆయా సన్నివేశాల్లోని డైలాగులను మార్చడం జరిగింది. ఈ సినిమాలో తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కథా రచన ఉందని కూడా.. ఆయా సంఘాలు పెద్ద గొడవ చేయడం గమనార్హం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.