'ఆమె' టీజర్‌తో.. ఆడియన్స్‌కి షాక్ ఇచ్చిన అమల పాల్

'ఆమె' టీజర్‌తో..  ఆడియన్స్‌కి  షాక్ ఇచ్చిన అమల పాల్

ఈమధ్యకాలంలో రొటీన్ సినిమాలతో పాటుగా.. వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలు కూడా ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలని ఎలాగైతే ఆదరించారో.. అదే తరహాలో వీటికి కూడా బ్రహ్మరధం పడుతూనే ఉన్నారు. అలాంటి వైవిధ్యమైన చిత్రమే అమలాపాల్ నటించిన "ఆమె" (Aame). తమిళ చిత్రం "ఆడాయి"కి (Aadai) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా ఇది విడుదలవుతోంది. ఈ రోజే ఆ సినిమా టీజర్ విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ విషయాలు మనం కూడా తెలుసుకుందాం.

 

ఈ టీజర్ ప్రారంభంలో ఓ తల్లి పోలీస్ స్టేషనుకి ఓ విషయమై కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. తన కూతురుకి ఎన్ని సార్లు  ఫోన్ చేసినా ఆమె బదులివ్వడం లేదని.. ఆమె ఆచూకీ కనిపెట్టమని కోరుతుంది. అప్పుడు కానిస్టేబుల్ బదులిస్తూ... "తెల్లారే వరకు చూసి ఉండొచ్చు కదా? కూతురు ఇంటికిరాకపోయే సరికి వెంటనే పోలీసు స్టేషన్‌కి వచ్చేశారు! చుట్టుపక్కల అందరిని అడిగారా?"  అంటాడు.

దానికి ఆ తల్లి సమాధానమిస్తూ - "సార్.. చివరగా ఫోన్‌లో మాట్లాడినప్పుడు తను తాగేసి ఉంది" అని అంటుంది.


అప్పుడే మనకి స్క్రీన్ పైన - "Freedom is what you do with what's been done to you"- Jean-Paul Sartre అనే కోటేషన్ కనిపిస్తుంది. ఆ కొటేషన్‌ను దర్శకుడు మనకి చూపించి.. ఈ సినిమా  కథని చెప్పకనే చెప్తాడు.

ఇక ఆ తరువాత పోలీసులు సదరు యువతి ఆచూకీ కోసం ఒక నిర్మానుష్యమైన బిల్డింగ్‌కి రావడం... అక్కడే పూర్తి నగ్నంగా ఉన్న అమల పాల్‌కి ఒక్కసారిగా మెలకువ రావడం మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆమె తన శరీరాన్ని చేతులు, కాళ్ళతో చుట్టేసుకుంటుంది. అసలు తను ఆ స్థితిలో ఆ బిల్డింగ్‌లో ఎందుకు ఉంది? తాగిన మైకంలో ఉన్న ఆమెను ఎవరైనా నిర్భంధించారా ? ఇలాంటి అనేక ప్రశ్నలను ఈ టీజర్ ద్వారా రేకెత్తిస్తూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు రత్న కుమార్.

Aadai Poster

ఈ సినిమాకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలున్నాయి. గతంలో విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో అమల పాల్ తన శరీరాన్ని టాయిలెట్ పేపర్‌తో కప్పుకుని కనిపిస్తుంది. చేతిలో ఒక రాడ్‌తో.. అలాగే తీవ్ర గాయాలతో కూడిన ఒక వయోలంట్ గెటప్‌లో ఆమెను మనం చూడచ్చు. ఈ పోస్టర్ చూసేవారికి ఎవరికైనా.. ఈ సినిమా థ్రిల్లర్ అని ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ టీజర్ చూసాక మాత్రం, దాదాపు ఏ ఒక్క హీరోయిన్ కూడా చేయని ఒక బోల్డ్ పాత్రని.. అలాగే ఒక న్యూడ్ పాత్రని చాలా ధైర్యంగా అమలాపాల్ చేసిందని ఇట్టే చెప్పేయవచ్చు. 

ఈ చిత్ర కథాంశం గురించిన అనేక వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రముఖంగా వినిపించే వార్త ఏంటంటే - "తాగిన మైకంలో ఉన్న అమల పాల్‌ని ముగ్గురు మైనర్లు అత్యాచారం చేస్తారు. ఆ తరువాత ఆ ముగ్గురిని తనే చంపేస్తుంది". ఇదీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నా కథ. అయితే ఈ కథ ఎంతవరకు నిజమో.. చిత్రం విడుదల అయితే కానీ చెప్పలేం. గతంలో హిందీలో తాప్సీ నటించిన పింక్, నయనతార తమిళంలో నటించిన వాసుకి చిత్రాలు ఇదే కోవకు వస్తాయి. 

Aadai Movie

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో   "ఆమె" పేరుతో విడుదల చేయనుండగా.. ప్రముఖ నిర్మాత-దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ దీని హక్కులను తీసుకున్నారు. ఈ 'ఆడాయి' చిత్రం టీజర్‌ని  బాలీవుడ్ నిర్మాత, దర్శకుడైన కరణ్ జోహార్ విడుదల చేయడంతో... ఈ చిత్రం హిందీలో కూడా విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 

మొత్తానికి టీజర్‌ని బట్టి మంచి బలమైన కథాంశాన్నే ప్రేక్షకులకి అందిస్తున్నారని అర్ధమవ్వగా... భాషా భేదం లేకుండా ఈ చిత్రాన్ని ఆదరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో ఈ చిత్రం తమిళం, తెలుగుతో పాటుగా మలయాళ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ  చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు దర్శక-నిర్మాతలు యత్నిస్తున్నారు. 

అయితే.. ఈ చిత్రంలో ఇంతటి బోల్డ్ పాత్రని చేయడానికి ఒప్పుకుని.. ఆ పాత్రకి న్యాయం చేసే విధంగా అభినయించిన అమల పాల్‌కి నిజంగా మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.