హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పండగే.. హైటెక్ సిటీ మెట్రో లైన్ వచ్చేసింది..!

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పండగే..  హైటెక్ సిటీ మెట్రో లైన్ వచ్చేసింది..!

అర్చ‌నకు ప్రతీరోజూ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆఫీస్. అందుకనే ఆమె ఆఫీసుకు టైముకి చేరుకోవ‌డానికి ఉదయం 5 గంట‌ల‌కే నిద్ర లేచి.. త‌న కుటుంబ అవ‌స‌రాల‌న్నీ చ‌క్క‌బెట్టుకుంటుంది. ఆ తర్వాత ఉద‌యం 7.30 కల్లా హైటెక్ సిటీకి వెళ్లే బస్సు కోసం... దిల్‌షుక్‌నగర్ బస్ స్టాపుకి వస్తుంది. ఎందుకంటే ఆఫీస్ స‌మయానికి క‌నీసం 2 గంట‌ల ముందు బ‌యల్దేర‌క‌పోతే .. గమ్యానికి 10 గంట‌ల‌ లోపు చేరుకోవ‌డం క‌ష్ట‌మే!


ఇక ప్ర‌దీప్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప‌రిస్థితి కూడా ఇంతే. కాక‌పోతే అత‌ని భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే కావ‌డంతో ఇద్ద‌రూ క‌లిసే బైక్ పై ఆఫీసుకు బ‌య‌ల్దేర‌తారు. కానీ దారిలో ట్రాఫిక్ ఇక్క‌ట్లు త‌ట్టుకుని గ‌మ్య‌స్థానానికి చేరుకునే స‌రికి ఇద్ద‌రినీ అల‌స‌ట ఆవ‌హించేస్తుంది. అందుకే ఆఫీసు స‌మ‌యం కంటే.. రెండు గంట‌ల ముందే బ‌య‌ల్దేరిపోతారు వీరిద్ద‌రూ! లేదంటే ఆ అల‌స‌ట ప్ర‌భావం ప‌నిపై ప‌డి మేనేజ‌ర్ చేతిలో తిట్లు తినాల్సిందే..!


వీళ్లు మాత్ర‌మే కాదు.. ఇలాంటి ఉద్యోగులు వంద‌ల నుంచి వేల సంఖ్య వ‌ర‌కు ఉంటారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఎక్కువ స‌మ‌యం ప్ర‌యాణంలోనే గ‌డిపేసే ఇలాంటి ఉద్యోగుల‌ను ఎప్ప‌ట్నుంచో ఊరిస్తోన్న ఒక శుభ‌వార్త తాజాగా వెలువ‌డింది. ఇంత‌కీ అదేంటంటే.. అమీర్ పేట్- హైటెక్ సిటీ మెట్రో రైల్ లైన్ రేపు ఉద‌యాన్నే ప్రారంభం కానుంది.


 


అమీర్ పేట్ - హైటెక్ సిటీ (Ameerpet -hitech City) మెట్రో రైల్ (Metro Rail)ని రేపు ఉద‌యం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు. అయితే ఈ మార్గంలో ప్ర‌యాణికులను మాత్రం.. సాయంత్రం 4 గంట‌ల నుంచే అనుమ‌తిస్తారు. ఈ మార్గంలో అమీర్ పేట్, హైటెక్ సిటీని క‌లుపుకుని ప‌ది స్టాప్స్ ఉన్నాయి. కానీ వాటిలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్ద‌మ్మ గుడి, మాదాపూర్ స్టేష‌న్స్‌ను మాత్రం రేపు ప్రారంభించ‌డం లేదు. ఈ మార్గంలో చాలా మ‌లుపులు ఉండ‌డంతో వేగ నియంత్ర‌ణ నిమిత్తం సీఎంఆర్ఎస్ (CMRS) విధించడమే అందుకు కారణం.


ఇప్ప‌టికే ఎల్బీ న‌గ‌ర్, నాగోల్.. వంటి సుదూర ప్రాంతాల‌ను లింక్ చేస్తూ మెట్రో న‌డుస్తుండ‌గా.. తాజాగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వ‌రంగా భావించే ఈ మార్గం కూడా ప్రారంభం కానుండ‌డంతో ప్ర‌జ‌లు సంతోషిస్తున్నారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు హైటెక్ సిటీలోనే ఉన్నాయి. కనుక అక్క‌డ‌కు చేరుకోవాలంటే రోజూ ట్రాఫిక్ ఇక్క‌ట్లు ఎదుర్కోవ‌డం తప్పనిసరి పరిస్థతిగా మారింది. మెట్రో వ‌స్తే ఈ చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా కాస్త స‌మ‌యం కూడా ఆదా అవుతుంద‌ని భావించే ఉద్యోగులు ఎంద‌రో..! అందుకే వారంద‌రికీ ఇదొక వ‌రం అని చెప్ప‌వ‌చ్చు.


 


అయితే మిగ‌తా మెట్రో లైన్స్‌తో పోలిస్తే ఈ మార్గానికి ఒక ప్ర‌త్యేక‌త ఉందండోయ్. అదేంటంటే.. ఈ మార్గ మ‌ధ్యంలో ఒకానొక స్టేష‌న్ అయిన మ‌ధురా న‌గ‌ర్‌ని పూర్తిగా స్త్రీల‌కు అంకితమిచ్చారు. అలాగే దీనికి త‌రుణి అని పేరు కూడా పెట్టారు. ఈ స్టేష‌న్ ప‌రిస‌రాల్లో మొత్తం స్త్రీలు, పిల్ల‌ల‌కు సంబంధించిన వ‌స్తువులు, ఉత్ప‌త్తులు ల‌భించేలా దుకాణాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.


ఇప్పటికే మెట్రో రైల్ రెండు లైన్స్ ప్రారంభించగా, అందులో మొదటిది - మియాపూర్ నుండి నాగోల్ వరకు 30 కి .మీ ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. కాగా రెండవ విడతలో అమీర్‌పేట్ నుండి ఎల్బీ‌నగర్ వరకు 16 కి.మీ. అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమీర్ పేట్ నుండి హైటెక్ సిటీ వరకు ప్రారంభమయ్యే మెట్రో లైన్.. మరో 10 కి.మీ. మేర ప్రజల అవసరం తీర్చనుంది.


 


రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం నేప‌థ్యంలో ట్రాఫిక్‌లో ఇరుక్కొని గమ్య‌స్థానాల‌కు చేరుకోవాలంటే.. మనకు ఎంతో ఓపిక‌, స‌హ‌నం అవ‌స‌రం అవుతోంది. అదీకాకుండా కాలుష్యం కోర‌ల్లో చిక్కుకొని అనారోగ్యం బారిన ప‌డుతూ ప్రజలు ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతున్నారు. అందుకే ఈ ఇక్క‌ట్ల నుండి ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌ప‌డేస్తూ, స‌మ‌యం ఆదా అయ్యేలా 2017లో మెట్రో స‌ర్వీస్‌ల‌ను ప్రారంభించారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి కూడా విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. మెట్రో ద్వారా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు కేవ‌లం స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌డం మాత్ర‌మే కాదు.. అంత‌కుమించి ఎంతో విలువైన త‌మ ఆరోగ్యాల‌ను సైతం సంర‌క్షించుకుంటున్నారు.


మొత్తానికి.. మెట్రో మ‌న భాగ్య‌న‌గ‌రం మెడ‌లో ఒక మ‌ణిహారంగా మారి.. న‌గ‌రానికి కొత్త శోభ‌ను అందిస్తోంద‌ని చెప్ప‌చ్చు. మ‌రి, మీరేమంటారు??


ఇవి కూడా చ‌ద‌వండి


బాబోయ్.. పెళ్లి శుభలేఖలను ఎంపిక చేయాలంటే.. చాలా కష్టమే సుమండీ..!


క్రికెట్ లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!


'మా' ఎలక్షన్స్‌లో మహిళల సత్తా.. కీలక పదవుల్లో జీవిత రాజశేఖర్, హేమ..!