బిగ్ బాస్ పై వచ్చిన.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో నిజమెంత?

బిగ్ బాస్ పై వచ్చిన.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో నిజమెంత?

బిగ్ బాస్ (Bigg Boss) మూడో సీజన్ జులై 21 నుంచి ప్రారంభమవుతోంది. పైగా ఈ సారి హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరించనున్నారు. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు ప్రవేశిస్తారనే విషయంలోనూ.. అంతా చాలా ఉత్సుకతతతో ఎదురు చూస్తున్నారు. అతి కొద్ది రోజుల్లోనే మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకులపై వస్తున్న క్యాస్టింగ్ కౌచ్ (casting couch) ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. యాంకర్ శ్వేతా రెడ్డి, సినీ నటి గాయత్రి గుప్త ఈ ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా షో మొదలైన తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బిగ్ బాస్ హౌస్, మూడో సీజన్ ప్రారంభం కాకుండానే కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 3 మొదలవుతుందని వార్తలు రాగానే.. ఫలానా వారు ఈ సీజన్ హౌస్ మేట్స్‌గా ఉండబోతున్నారని కొన్ని జాబితాలు వచ్చాయి. వాటిలో నటి గాయత్రి గుప్త పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఈమె "ఫిదా" సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా తెలుగు వారికి పరిచయమైంది. రెండ్రోజుల క్రితం టీవీ 5 న్యూస్ ఛానల్లో జరిగిన ప్రత్యక్ష ప్రసారంలో బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు తనకు కాల్ చేశారని తెలిపింది. అయితే వారు మాట్లాడిన విధానం నచ్చకే హౌస్ మేట్‌గా ఉండటానికి అంగీకరించలేదని చెప్పింది.

‘నాకు ఫోన్ చేసిన వ్యక్తి సెక్స్‌కి దూరంగా 100 రోజుల పాటు ఉండగలవా అని అడిగారు. ఇది విని నేను కాస్త షాక్ తిన్నాను. ఎందుకంటే వారు అలా మాట్లాడతారని అనుకోలేదు. గతంలో బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్‌గా ఉన్నవారు సైతం ఈ విషయం గురించి నాకు వివరించారు. అందుకే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుకోవడం లేద’ని వివరించింది.

Facebook

మరో వైపు యూట్యూబ్ యాంకర్ శ్వేతారెడ్డి క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రోగ్రాం నిర్వాహకులు తనకు ఫోన్ చేసి బిగ్ బాస్‌ను ఏ విధంగా ఇంప్రెస్ చేస్తారని అడిగారట. షో హిట్ అవడానికి మీరెలాంటి పనులు చేస్తారని అడిగారట. మీ ఉద్దేశమేంటని గట్టిగా నిలదీస్తే... అసలు విషయం చల్లగా చెప్పారని అంటోంది శ్వేతా రెడ్డి. కమిట్‌మెంట్ అడుగుతున్నారా? అని నిలదీస్తే నిమ్మకుండిపోయారని ప్రెస్ మీట్లో వివరించింది శ్వేతారెడ్డి. ఈ విషయంలో శ్యామ్, రఘు అనే ఇద్దరు షో నిర్వాహకులపై ఆమె ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు సైతం పెట్టారు. తనతో కొన్ని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని, వాటి నకళ్లను సైతం తనకు ఇవ్వలేదని ఆరోపించారు.

Youtube

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ మేట్‌గా ఎంపికైన తర్వాత ఈ విషయం చాలా సీక్రెట్‌గా ఉంచాలి. బంధువులు, సన్నిహితులకు సైతం ఈ విషయం తెలియనివ్వకూడదు. ఈ నిబంధన అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందే చెబుతారు. హౌస్ మేట్స్‌గా ఎవరుండబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెంచడానికే ఇలా చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది బిగ్ బాస్ హౌస్ మేట్‌గా ఉండటానికి ఒప్పుకున్నానని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకం చేశానని శ్వేతా రెడ్డి చెప్పడంతో పాటు.. తనను బిగ్ బాస్ నిర్వాహకులు కమిట్‌మెంట్ అడిగారని చెప్పడం షాకింగ్ విషయంగానే పరిగణించాలి. పైగా బిగ్ బాస్ కార్యక్రమంపై కొందరు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే గాయత్రి గుప్త, శ్వేతా రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉందని ప్రశ్నించే వారు సైతం లేకపోలేదు. ఎందుకంటే వారి దగ్గర దానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు లేవు.

కొన్ని పేపర్ల మీద సంతకం చేశానని చెబుతోన్న శ్వేతారెడ్డి దగ్గర సైతం ఆ పేపర్లకు సంబంధించిన ఫొటో కాపీలు కూడా లేకపోవడం ఆమె చేస్తున్న ఆరోపణలను ప్రశ్నార్థకం చేస్తోంది. దీంతో సామాన్యుల్లో సైతం కొన్ని అనుమానాలు వ్యక్తం  అవుతున్నాయి. పైగా పబ్లిక్ అటెన్షన్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు వాఖ్యానిస్తున్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో బిగ్ బాస్ తనపై పడిన మరకను చెరిపేసుకుంటాడా? లేదా గాయత్రి గుప్త, శ్వేతా రెడ్డి తాము చేసిన ఆరోపణలు నిజమని నిరూపించుకుంటారా? ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది