ఈ వధువు వరకట్నంగా.. ఏమిచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

ఈ వధువు వరకట్నంగా.. ఏమిచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే.. కొన్ని సంప్రదాయాల్లో ఇప్పటికీ మార్పు రావడం లేదు. అలాంటి వాటిలో వరకట్నం (Dowry) కూడా ఒకటి. అయితే వరకట్నం కోసం భార్యలను, కోడళ్లను వేధిస్తున్నారని చెబుతున్న నేటి రోజుల్లో.. పెళ్లికి ముందే కట్నం తప్పనిసరని చెప్పే ఈ రోజుల్లో.. ఇప్పుడు విననున్న వార్త కాస్త కొత్తనే చెప్పుకోవాలి.  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ వివాహం.. ఈ సంప్రదాయాలను దాటి చైతన్యానికి మంచి ఉదాహరణగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..


bride2


పశ్చిమ బెంగాల్‌కి చెందిన సూయాంకాంత బారిక్ సోనార్‌పుర్‌కి చెందిన.. ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మగ్బేరియా మ్యూజిక్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోన్న ప్రియాంకా బేజ్‌తో అతని వివాహం ఖాయమైంది. అయితే పెళ్లి చూపుల సమయంలోనే తాను, తన కుటుంబం కట్నానికి వ్యతిరేకం అని ఆయన తెలిపారు. వరుడి (Bride Groom) నిర్ణయానికి తొలుత వధువు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత.. బాగా ఆలోచించి అతడికి ఓ అద్భుతమైన బహుమతి అందించేందుకు వధువు (Bride) కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.


వరుడు సూయాంకాంత బారిక్ పెళ్లి మండపానికి చేరుకునే సరికి ..  వధువు కుటుంబం అతని కోసం ఓ చిత్రమైన బహుమతితో స్వాగతం పలికింది. తాము దగ్గరుండి ఎంపిక చేసిన..  వెయ్యి పుస్తకాలను ప్యాక్ చేసి వరుడికి అందించింది ఆ కుటుంబం.  తనకు కాబోయే అత్తమామలు అందించిన ఈ బహుమతి చూసి వరుడు ఎంతో ఆనందపడిపోయాడట. కట్నం వద్దని చెప్పిన అల్లుడి ఆలోచనా తీరు నచ్చిన అత్తమామలు.. తనకి ఓ ప్రత్యేకమైన బహుమతి అందించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. వరుడికి సాహిత్యమంటే ఎనలేని ఇష్టమని తెలిసి.. అతడి కోసం లక్ష రూపాయల విలువ గల వెయ్యి పుస్తకాలను కొని బహుమతిగా అందించడంతో.. ఆ వార్త  ఆ ప్రాంతంలో దావానలంలా పాకింది. మీడియా దృష్టినీ ఆకర్షించింది. 


bride555


దీని గురించి వరుడు మాట్లాడుతూ.. "నేను ఎలాంటి కట్నం తీసుకోనని అత్తమామలకు ముందుగానే చెప్పేశాను. కానీ నేను పెళ్లి మండపంలోకి అడుగుపెట్టిన తర్వాత, అక్కడ ఉన్న పుస్తకాల కట్టలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. కట్నం వద్దన్నాను కానీ.. వారు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ బహుమతిని మాత్రం నేను కాదనలేకపోయాను" అంటూ టెలిగ్రాఫ్ పత్రికతో తన ఫీలింగ్స్ పంచుకున్నాడు వరుడు.


వధువు కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. "నాకు పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వ్యక్తే నాకు భర్తగా దొరకడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు.. నా అభిప్రాయాలకు తగినట్లే కట్నం అడగని వ్యక్తే నాకు భర్తగా వస్తున్నందుకు మరింత సంతోషంగా అనిపిస్తోంది. నాకు వరకట్నం అంటే ఇష్టం ఉండదని నా కుటుంబానికి తెలుసు. కానీ దాన్ని అర్థం చేసుకునే భర్త కూడా దొరకడం నా అదృష్టం అనుకోవాలి. నాకే కాదు.. మా నాన్నకు కూడా పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన మాకు ఈ బహుమతిని అందించారు" అంటూ వెల్లడించింది.


bride3


ఈ పుస్తకాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్ చంద్ర ఛటర్జీలు రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని హ్యారీ పోటర్ కథల పుస్తకాలు, ఇతర రచనలు కూడా ఉన్నాయట. వీటిని కొనేందుకు సంగీతం టీచరైన ప్రియాంక తండ్రి అశిత్ బేజ్, హై స్కూల్ టీచరైన ప్రియాంక మామయ్య మహాదెబ్ మన్నాలు కలకత్తా వరకూ వెళ్లారట. అక్కడి కాలేజీ స్ట్రీట్ షాప్స్‌లోనే కాదు..  ఉద్బోధన్ కార్యాలయం, రామ‌కృష్ణ‌ మఠం, రామ‌కృష్ణ‌ మిషన్ వంటివన్నీ తిరిగి మరీ పుస్తకాలను ఎంపిక చేశారట.


లక్ష రూపాయల విలువ చేసే ఈ పుస్తకాలలో చాలా వరకూ.. కలకత్తా నుంచే వరుడి ఇంటికి పార్సిల్ చేశారట. మరికొన్నింటిని మాత్రం పెళ్లి సందర్భంగా బహుమతిగా అందించేందుకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో పెళ్లి కూతురు మేనమామ నహాదెబ్ మాట్లాడుతూ "పెళ్లికి వచ్చే వాళ్లను వధూవరుల కోసం ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని చెప్పాను. నేను వారికి పుస్తకాలు, పూలు వంటివి తీసుకురమ్మని చెప్పి ఉంటే బాగుండు" అని చెప్పడం విశేషం.


అయితే కట్నం వద్దనడంతో పాటు తనకు వచ్చిన బహుమతులను కూడా.. మంచి పనికే ఉపయోగించేందుకు సిద్ధమయ్యాడు వరుడు సూయాంకాంత. ఈ పుస్తకాలన్నింటినీ తన ఇంట్లో చిన్న లైబ్రెరీ ఏర్పాటు చేసి, అందరికీ అందుబాటులో ఉంచుతానని ప్రకటించాడు. ఇలాంటి కుటుంబాలు ప్రతి చోటా ఉంటే బాగుంటుంది కదా..


ఇవి కూడా చదవండి.


పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!


ప్రపంచమంతా తిరిగినా టెర్రస్ పైనే పెళ్లి చేసుకుంది.. ఎందుకంటే..?


తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్