ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

సంత, మార్కెట్ (market), బజారు.. పేరేదైనా కానివ్వండి.. జనంతో కిటకిటలాడుతూ సందడి సందడిగా కనిపిస్తుంది. కూరగాయలు, పండ్లతో పాటు.. తమకు అవసరమైన వాటిని సంతలో కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు వినియోగ‌దారులు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఎన్ని ఉన్నా.. అవన్నీ వారంలో ఒక రోజు జరిగే ఈ మార్కెట్ ముందు దిగదుడుపే. 


మనకు కావాల్సిన వస్తువులను మనకు అందించడమే కాదు.. రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తుల్ని మనకు పరిచయం చేస్తుందీ మార్కెట్. మనం నిశితంగా గమనిస్తే.. మార్కెట్లో మనకు చిత్రవిచిత్రమైన స్వభావాలున్న వ్యక్తులు(people) కనిపిస్తారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకొందాం.


1. కొనేది తక్కువ బేరాలాడేది ఎక్కువ


1-people-we-met-in-market


మనం ఏ వస్తువు కొన్నా బేరమాడటం మనకున్న అలవాటు. బేరమాడటం రీజనబుల్‌గా ఉంటే తప్పులేదు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో అందరికీ భిన్నంగా ఉంటారు. దుకాణదారుడు వందరూపాయలు చెబితే.. వీళ్లు ఐదు రూపాయలకు అడుగుతారు. అక్కడ మొదలైన వారి బేరం ఎంతకూ ఓ కొలిక్కి రాదు. చివరికి వారి బాధ పడలేక వారు అడిగినంత ధరకే ..ఇచ్చి పంపించేసేవాళ్లు సైతం ఉంటారు.


2. వీరిది మరీ మొహమాటం


మార్కెట్లో ఇలాంటి వారిని చూస్తే మన మనసు జాలితో నిండిపోతుంది. వారి మొహమాటాన్ని, మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని మోసం చేయాలని చూస్తుంటారు. కూరగాయల నాణ్యత దగ్గర నుంచి వాటి ధరల వరకు వీరు చాలా మోసపోతుంటారు. కొన్నిసార్లు తాము మోసపోతున్నామని గుర్తించినప్పటికీ.. మాట్లాడకుండా.. దుకాణదారుడు ఇచ్చింది తీసుకొని.. అడిగినంత ఇచ్చి వెళ్లిపోతుంటారు. వాళ్లని చూసి జాలిపడటం మినహా మనం చేయగలిగిందేమీ లేదు.


3. సెలక్షన్ కమిటీ మెంబర్స్


2-people-we-met-in-market


కూరగాయల దుకాణం ముందు ఇలాంటి వారున్నారంటే.. ఎంతకీ కూరగాయలు కొనడం పూర్తవదు. చెప్పాలంటే.. వాళ్లకి కావాల్సినవి వారు ఏరుకోరు. ఎదుటి వాళ్లను ఏరుకోనివ్వరు. వంకాయల రాశిని అటు నుంచి ఇటు తిరగబెట్టేస్తారు కానీ.. వాళ్లకు నచ్చినవి పావుకేజీకి మించి ఉండవు. పైగా మధ్యమధ్యలో ‘అబ్బో ఇవి అసలు క్వాలిటీ బాగా లేవు’, ‘అన్నీ పుచ్చులే’ లాంటి డైలాగులొకటి. వీళ్లు చేసే మరో పాడు పని ఏంటంటే.. తమకు నచ్చిన కూరగాయలు ఎంచుకోవడానికి మొత్తం కూరగాయలన్నింటికీ తమ గోరు గుచ్చి చూస్తుంటారు. క్వాలిటీ కోసం ఆరాటపడే వీళ్లే కూరగాయల నాణ్యతను తగ్గించేస్తుంటారు. వీరి కూడా ఒకసారి మార్కెట్ కెళితే.. మరోసారి వారి వెంట వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు(అనుభవం మీద చెబుతున్నాను. అర్థం చేసుకోండి)


4. చప్పుడు కాకుండా నొక్కేసేవాళ్లు


మార్కెట్లో అందరూ కూరగాయలు కొనే పనిలో ఉంటే.. వీరు మాత్రం వీలైనంత నొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ నొక్కడంలోనూ కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు. ఓ పక్క కాయగూరలు ఏరుకొంటున్నట్టు ఏరుకొంటూనే.. మరోవైపు.. ఎవరూ గమనించకుండా తమ సంచిలో వేసేస్తూ ఉంటారు. వీళ్లు పావుకేజీ కొంటే.. అరకేజీ నొక్కేస్తుంటారు. ఇలాంటి వారిని మీరూ గమనించే ఉంటారు కదా..!


5. ఇవేనా.. ఇంకేమీ లేవా?


3-people-we-met-in-market


కొంతమంది ముందు వంద రకాలు పేర్చినా.. నూటొకటో రకం గురించి అడుగుతుంటారు. అక్కడ లేనిది చూసి అడుగుతారో.. లేకపోతే వారికి కావాల్సింది అక్కడ లేదో మనకు అర్థం కాదు. వీళ్లు ఏ దుకాణం దగ్గరకి వెళ్లినా సరే.. ఫలానాది లేదా? అని కచ్చితంగా అడుగుతారు. కావాలంటే.. ఈ సారి మీరు సంతకి వెళ్లినప్పుడు గమనించండి. ఇలాంటి వారు మీకు కనీసం ఒక్కరైనా ఎదురవుతారు.


6. కొసరు కొత్తిమీర ఇవ్వొచ్చుగా..!


కొందరికి తమకు కావాల్సినవన్నీ కొనుక్కొన్నప్పటికీ కొసరు కోసం ఎదురుచూస్తుంటారు. అదిచ్చేంతవరకు.. కూరగాయల వ్యాపారిని వేధించుకు తింటారు. ఇన్ని కొన్నాం కదా.. కొసరు కొత్తిమీరో.. కరివేపాకో ఇవ్వచ్చు కదా అని అడుగుతుంటారు. కొంతమంది వ్యాపారులైతే.. అడగకుండానే ఇచ్చేస్తుంటారు.


7. సిగ్గుల మొగ్గలు


వీరు సంతకు వెళతారు. కానీ ఏది కొనాలన్నా సిగ్గుపడిపోతుంటారు. అందరూ కొనడంలో బిజీగా ఉంటే.. వీరు మాత్రం ఎవ్వరూ లేని దుకాణం కోసం వెతుక్కోవడంలో నిమగ్నమై ఉంటారు. వీరు కూరగాయలు కొంటున్నప్పుడు ఇంకెవరైనా వీరి పక్కకు వస్తే... ఇంకేం కొనాలో కూడా మరిచిపోతుంటారు. ఇలాంటి వారిని చూస్తే అసలు నవ్వు ఆపుకోలేమంటే నమ్మండి!


మీరు కూడా ఇలా చిత్రంగా ప్రవర్తించేవారిని గమనించారా? అయితే వారి గురించి మాతో పంచుకోండి. వాటిని మేం అందరికీ తెలియజేస్తాం.


Images: Shutterstock


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో కథనాలు అందిస్తోంది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాఠకులకు చేరువ అవుతోంది.