మైసమ్మ.. పోచమ్మల బోనం చేయంగ.. బోనాల జాతరలో ఆడిపాడంగ..!

మైసమ్మ.. పోచమ్మల బోనం చేయంగ.. బోనాల జాతరలో ఆడిపాడంగ..!

అమ్మా బైలెల్లినాదో.. తల్లి బైలెల్లినాదో.. అంటూ ఆ అమ్మలగన్న అమ్మను పూజిస్తూ చేసే పండగ బోనాలు (bonalu). కేవలం ఒకచోట, ఒక వూరు కాదు.. తెలంగాణ యావత్తూ ఈ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ నెల 4న గోల్కొండ కోట ఎల్లమ్మ జగదాంబికా ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఏటా ఆషాఢ మాసం మొదటి గురువారం ప్రారంభమయ్యే ఈ వేడుకలు శ్రావణ మాసం పూర్తయ్యేవరకూ సాగుతూనే ఉంటాయి. ఈ ఆదివారం గోల్కొండ బోనాల తర్వాత 21, 22 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళీ ఆలయంలో ఎంతో ఘనంగా ఈ వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా తెలంగాణకే ప్రత్యేకమైన ఈ బోనాల పండగ గురించి తెలుసుకుందాం.

బోనం అనే పదానికి భోజనం అని అర్థం. జానపదంలో దాన్ని బోనంగా వ్యవహరిస్తారు. వర్షాకాలంలో వర్షాలు చక్కగా పడాలని కోరుకుంటూ.. పడిన వర్షాలకు అమ్మలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అన్నాన్ని నివేదన చేయడమే ఈ పండగ." నీకు దక్కిన దాన్ని నీకే నివేదన చేస్తున్నాం. మమ్మల్ని చల్లగా చూడు తల్లీ" అంటూ అమ్మలను కోరుకోవడమే ఈ పండగ.

బోనాల ఉత్సవాలు (Instagram)

సాధారణంగా బోనాల తయారీకి కొత్త కుండలనే వాడతారు. అమ్మవారికి చిత్రాన్నం (పసుపు అన్నం) అంటే ఇష్టమని వేదాల్లోనూ ఉంది. అందుకే ఆ అమ్మవారికి పసుపు అన్నం వండి కొత్త కుండలో పెడతారు. ఈ అన్నాన్ని పసుపు, పాలు, బెల్లంతో కలిపి వండుతారు. ఆ కుండకి పసుపు, కుంకుమలను అద్ది పూజ చేసి ఘటం పైన ప్రమిద వెలిగించి అమ్మకు అర్పిస్తారు. ఈ కుండలను వేప రెమ్మలతో అలంకరిస్తారు. బోనంతో పాటు అమ్మవారికి సాక కూడా పోస్తారు.

సాక అనేది శాఖం, శాఖ అనే పదాలకు వికృతి. దీనికి అర్థం కొమ్మ అని కూడా కొందరు చెబుతుంటారు. వేపకొమ్మలను పసుపు నీళ్లలో వేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ నీళ్లు జల్లి బోనం, సాక సమర్పిస్తే అమ్మవారు తమను చల్లగా చూస్తారని అందరూ భావిస్తారు. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా లేకపోలేదు. వర్షాకాలంలో వానలు పడి వ్యాధులు ప్రబలుతాయి. ఎక్కడ చూసినా సూక్ష్మ క్రిములు పెరుగుతాయి. అలా పెరిగిన వ్యాధులు ప్రబలకుండా ఇంటితో పాటు ఊరంతా కూడా పసుపు నీళ్లు, వేపాకులను చల్లి శుద్ధి చేస్తారు.

వేపాకు, పసుపులోని యాంటీబయోటిక్ గుణాల వల్ల సూక్ష్మ క్రిములు చనిపోతాయని వారి నమ్మకం. అందుకే వర్షాకాలం మొదలవ్వగానే జరిగే ఈ బోనాల ఉత్సవం శాస్త్రీయంగా కూడా ముఖ్యమైనదని చెప్పవచ్చు. బోనాల్లో ముఖ్యమైన వేడుక ఘటం. అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశం ఇది. దీన్ని కూడా పసుపు పూసిన ఓ వ్యక్తి మోస్తాడు. ఇది పూర్తయ్యాకే అందరూ బోనాలు సమర్పించాలి.

బోనాలు (Instagram)

అసలు తెలంగాణలో బోనాలు ప్రారంభం కావడానికి వెనుక ఓ పెద్ద కథ ఉందని చెబుతారు. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రాణాంతక మలేరియా వ్యాధి ప్రబలింది. వేలాది మంది దానికి గురై మరణించారు. ప్రకృతి తమపై ఆగ్రహించిందని భావించిన కొందరు పెద్దలు ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకునేందుకు.. ఇలా గ్రామ దేవతలకు జాతరలు నిర్వహించాలని భావించారట. అప్పటి నుంచి బోనాల జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు.

ఆషాఢ మాసంలో మొదట గోల్కొండలో ప్రారంభమయ్యే ఈ బోనాలు.. ఆ తర్వాత పాతబస్తీలోని మహాకాళి ఆలయం, లాల్ దర్వాజ మహాకాళి ఆలయం, సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహాకాళి ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. వీటితో పాటు హైదరాబాద్ ప్రాంతంలోని చిన్నా, పెద్దా దేవాలయాల్లోనూ పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. కేవలం బోనం అర్పించడం మాత్రమే కాదు.. బోనాల ఉత్సవాల్లో మరెన్నో ఘట్టాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పోతరాజులు, శివసత్తులు, తొట్టెలు, ఫలహారం బండ్లు, రంగం..

పోతురాజు (Instagram)

పోతురాజు అమ్మవారి తమ్ముడు. తన ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లను కాపలా కాసేందుకు పోతరాజులు విచ్చేసి నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఒళ్లంతా పసుపు రాసుకొని, కళ్లకు కాటుక, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, లంగోటి, కాళ్లకు గజ్జెలు కట్టుకొని వాయిద్యాల శబ్దానికి తాడుతో కొట్టుకుంటూ నృత్యం చేస్తుంటాడు. గుడికి చేరగానే పోతరాజులు గావు పడతారు.

అంటే సొరకాయ, గుమ్మడికాయను కొరికి అమ్మవారికి దిష్టి తీసి ఒక్క దెబ్బతో పగిలేలా కింద కొడతారు. ఒకప్పుడు కోళ్లు, మేకల మెడలను ఇలా కొరికే వారట. కానీ జీవహింసను నిషేధించాక వాటి బదులు సొరకాయ లేదా గుమ్మడి కాయతో గావు పడుతున్నారు. అమ్మవారికి బోనాలు తీసుకెళ్లే మహిళల్లోనే కొందరికి అమ్మవారు ఆవహిస్తుందంటారు. వారిని శివసత్తులు (శివశక్తులు)గా చెబుతారు. వారు ముఖం నిండా పసుపు పూసుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని వేప కొమ్మలతో పూనకాలు ఊగుతారు.

అమ్మవారికి తొట్టెలు (Instagram)

బోనాలు సమర్పించడంతో పాటు.. చాలామంది అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పిస్తారు. పొడవాటి కర్రలకు రంగు కాగితాలు క్రమపద్ధతిలో అలంకరించి అమర్చిన నిర్మాణం ఇది. వీటిని అమ్మవారికి కానుకగా గుడి దగ్గర చెట్టుకు వేలాడదీస్తారు.

అమ్మవారి ఊరేగింపు (Instagram)

మరికొందరు అమ్మవారికి సమర్పించాలనుకున్న ఫలహారాలన్నింటినీ.. బండ్లలో ఉంచి.. వాటిని అలంకరించి ఈ బండ్లను రెండు లేదా నాలుగు బలమైన మేకపోతులకు కట్టి లాగిస్తారు. అమ్మవారికి ఇష్టమైన ఆ పదార్థాలన్నింటినీ నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగిలింది ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. బండికి కట్టిన మేకపోతులను కూడా అమ్మవారి గుడి దగ్గరే బలి ఇచ్చి ఆ మాంసాహార విందుతో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆరగిస్తారు. 

బోనాల ఉత్సవాల్లో ఆఖరుగా జరిగే వేడుక రంగం. ఇందులో అమ్మవారు ఓ అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా ప్రజలకు వచ్చే ఏడాదిలో జరగబోయే మంచి చెడులను వివరిస్తుంది. దీన్నే రంగం అంటారు. ఈ మహిళ గుడి ముందు పచ్చి కుండపై నిలబడి పూనకంతో వూగిపోతూ భవిష్యత్తు చెబుతూ.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. ఆషాఢం మొత్తం వివిధ ఆలయాల్లో పూజలు జరిగిన తర్వాత ఆఖరి బోనం కూడా గోల్కొండ జగదాంబికకే అర్పించడంతో బోనాల పండగ పూర్తవుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Featured Image : Instagram

ఇవి కూడా చదవండి. 

హోలీ వ‌చ్చిందంటే.. వీధుల్లో ఈ త‌ర‌హా వ్య‌క్తులు క‌నిపించాల్సిందే..!ఉగాది వేళ.. ఈ వంట‌కాలు నోరూరించ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి..!ఈద్ శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు ఎంతో ఆనందిస్తారు..!