గతేడాది జరిగిన పెళ్లిళ్లలో రెండు వివాహాలు అందరి చూపునూ తమ వైపు తిప్పకున్నాయి. ప్రియాంకా చోప్రా (Priyanka chopra), దీపికా పదుకొణె (Deepika Padukone).. ఇద్దరూ తమ మనసుకు నచ్చిన వ్యక్తులతో ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దీప్‌వీర్ పెళ్లి గురించి తెలిసి నేను కూడా ఎంతో ఆనందించాను. అయితే పీసీ తనకు నచ్చినవాడితో కొత్త జీవితం ప్రారంభించబోతోందని తెలిసి అంతకంటే ఎక్కువ ఆనందాశ్చర్యాలకు గురయ్యాను.
తను నా ఫేవరెట్ కథానాయిక. ఇండస్ట్రీలో తను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి.. తన సినిమాలు చూస్తూనే నేను పెరిగాను. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి తను ఎన్ని కష్టాలు పడిందో.. హాలీవుడ్‌లో అడుగుపెట్టి ఎలా మంచి పేరు తెచ్చుకుంటుందో అన్నీ చూసి ఎంతో సంతోషించాను. అయితే చక్కటి నటనతో పాటు ఇన్నేళ్లు గడిచినా ప్రియాంకలో మారనిది మరొకటుంది. అది తన చక్కటి ఫిజిక్. మరి, మన దేశీ గర్ల్ నాజూకైన శరీరం కోసం ఏం చేస్తుందో మీకూ తెలుసుకోవాలనుందా?
ప్రియాంక(Priyanka) ఫిట్ నెస్
(Fitness) రొటీన్
ప్రియాంక వర్కవుట్ రొటీన్
ప్రియాంక డైట్ ప్లాన్
ప్రియాంక మెరిసే చర్మానికి చిట్కాలు
ప్రియాంక మేకప్ ఎలా ఉంటుందంటే..
ప్రియాంక ఫిట్ నెస్ రొటీన్
దిల్ దడక్‌నే దో సినిమా కోసం ప్రియాంక ఏడు కేజీలు తగ్గిందని మీకు తెలుసా..? అవును. తన కెరీర్ కోసం శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రియాంక ఎప్పుడూ వెనకాడదు. జిమ్‌కి వెళ్లడం అంటే తనకు ఇష్టం ఉండదు అని ఆమె ఎప్పుడూ చెబుతుంటుంది. ఈ-ఆన్‌లైన్ అనే వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో తానెప్పుడూ పెద్దగా వర్కవుట్ చేయను అని కూడా వెల్లడించింది పీసీ. మంచి మెటబాలిజంతో పాటు జన్యుపరంగా వచ్చిన శరీరాన్ని అలాగే ఉంచుకోవడానికి కాస్త ప్రయత్నిస్తానని మాత్రం చెబుతుంది ప్రియాంక. అంతేకాదు.. నాకు తినడం అంటే ఇష్టం. జిమ్ అంటే ఇష్టం ఉండదు. నేను ఏమీ చేయకపోయినా ఇలాగే స్లిమ్‌గా ఉన్నంతవరకూ నేను ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం ఏముంది? అంటుందామె. అయితే తన ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి మాత్రం వారానికి నాలుగు రోజులు ఓ గంట పాటు వ్యాయామం చేస్తుందట.
ప్రియాంక వర్కవుట్ రొటీన్
– ప్రియాంక రోజూ కనీసం పావుగంట పాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తుంది.
– ఆ తర్వాత పుషప్స్, రివర్స్ లాంజెస్ చేస్తూ తన వ్యాయామాన్ని కొనసాగిస్తుంది.
– ప్రియాంకకి వెయిట్ ట్రైనింగ్ అంటే పెద్దగా ఇష్టముండదట. దానికి బదులుగా యోగా చేస్తుందీ బ్యూటీ.. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మారుస్తుంది.
– పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగించుకునేందుకు అరగంట పాటు ప్లాంక్ వేస్తుందట ఈ సుందరి. దాంతో పాటు బైసెప్ కర్ల్స్ కూడా తన ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగమే.
– ఇలా వర్కవుట్ ఏదీ చేయడానికి సమయం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ఇంట్లోనే స్పిన్నింగ్ చేయడంతో పాటు వీలైన చోట రన్నింగ్ చేస్తూ ఫిట్‌నెస్ రొటీన్‌ని కొనసాగిస్తుందట.
యోగా తప్పనిసరి
వర్కవుట్ చేయని రోజు పీసీ యోగా చేయడానికి ఆసక్తి చూపిస్తుందట. ఇది ప్రపంచంలోనే తనకు ఇష్టమైన విషయమని తానే చెబుతుంది. యోగా తన మానసిక ప్రశాంతతను పెంచడంతో పాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. సమయం కుదిరినప్పుడల్లా అర్థ మత్స్యేంద్రాసనం, వృక్షాసనం, వీరభద్రాసనంతో పాటు ప్రాణాయామం చేయడానికి తను ఇష్టపడుతుందట. రోజూ ఉదయాన్నే ఆరు గంటలకు లేచే ప్రియాంక లేవగానే యోగా చేస్తుందట.
ప్రియాంక డైట్ ప్లాన్
తాను ఆహార ప్రియురాలినని ప్రియాంక ఎప్పుడూ చెబుతుంటుంది. అంతెందుకు.. ఆమెకు ఆహారం మీదున్న ప్రేమను చూసి అభిషేక్ బచ్చన్ ఆమెకు పిగ్గీ చాప్స్ అని ముద్దుపేరు కూడా పెట్టాడంటే తను ఎలా తింటుందో మనం వూహించవచ్చు. తన మెటబాలిజం చాలా వేగంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడూ నచ్చిన జంక్‌ఫుడ్ తిన్నా.. ఆ క్యాలరీలు తొందరగానే కరిగిపోతాయి. నూనె వస్తువులకు పూర్తిగా దూరంగా ఉండే పీసీ రెడ్ వెల్వెట్ కేక్, హాట్ చాక్లెట్ ఫడ్జ్, జిలేబీలు వంటివి తినడానికి ఇష్టపడుతుంది.
ప్రియాంకకి వంట అస్సలు రాదు. కానీ తన ఇంటికి వచ్చిన వారికి చక్కటి ఆదరసత్కారాలు చేసి.. అతిథులందరూ తిన్నారా.. లేదా.. అని చూసి మరీ తిరిగి పంపుతుందామె. తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకోని పీసీ ఎదుటివారికి కూడా అలాంటివి చేయొద్దని సలహా ఇస్తుంది. లైఫ్‌స్టైల్‌ని కంట్రోల్ చేసుకుంటే చాలు.. మనం అనుకున్నది సాధించవచ్చని చెబుతుంది. ఎన్నో లక్ష్యాలతో ముందుకు సాగే పీసీ స్ట్రాంగ్ మైండ్ ఉంటే చాలు.. జీవితంలో అనుకున్నవన్నీ చేసేయవచ్చని చెబుతుంది. అందరిలా తనకి కూడా రోజూ స్వీట్ తినాలనిపిస్తుందట. కానీ ఆ కోరికను అదుపులో ఉంచుకోకపోతే తానూ నెమ్మదిగా, శక్తి లేకుండా సాగుతానని.. తన కోరికలను కంట్రోల్ చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల తన శరీరం తాను చేయాలనుకున్న పనులకి సహకరిస్తుందని ఆమె చెబుతుంది. అయితే అప్పుడప్పుడూ మనసు మాట విని తనకు నచ్చిన ఆహారం కూడా తీసుకోవాలని.. లేకపోతే కొన్నాళ్లకు జీవితం బోర్ కొడుతుందని చెబుతుంది పీసీ.
తన రోజువారీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే..
బ్రేక్‌ఫాస్ట్
రోజూ ఉదయాన్నే రెండు గుడ్లు లేదా ఓట్‌మీల్‌తో రోజును ప్రారంభిస్తుంది ప్రియాంక. దీంతో పాటు ఓ పెద్ద గ్లాస్ నిండా చల్లని స్కిమ్‌డ్ మిల్క్ కూడా తాగుతుంది.
లంచ్
వంట రాకపోయినా ఇంట్లో వండిన ఆహారం అంటే తనకెంతో ఇష్టం. తన లంచ్‌లో రెండు రొట్టెలు, పప్పు, కూర, సలాడ్, పండ్లు తీసుకుంటుంది.
స్నాక్స్
సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా టర్కీ సలాడ్, స్ప్రౌట్ సలాడ్ తీసుకుంటుంది.
డిన్నర్
డిన్నర్‌లో ఆహారం చాలా తక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంది ప్రియాంక. గ్రిల్ చికెన్ లేదా గ్రిల్ ఫిష్‌తో పాటు నూనె లేకుండా వేయించిన కూరగాయలు కూడా తీసుకుంటుంది.
అప్పుడప్పుడూ జంక్‌ఫుడ్
నోరూరించే ఫుడ్ అంటే ఎంతగానో ఇష్టపడే ప్రియాంక వారానికోసారి నచ్చిన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇందులో భాగంగా పిజ్జా, బర్గర్, బఫెల్లో వింగ్స్, డోనట్స్ తీసుకుంటుందట.
ప్రియాంక మెరిసే చర్మానికి చిట్కాలు
రోజుకు సాధారణ వ్యక్తులు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ఈ అందాలరాశి మాత్రం పది గ్లాసుల నీళ్లు తాగుతుందట. నీళ్లతో పాటు కొబ్బరినీళ్లు కూడా తాగుతుంది. అయితే కోలాల నుంచి తను దూరంగా ఉంటుంది. అవి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయని అందరికీ చెబుతుంది పీసీ.
ఇంటి చిట్కాలు కూడా..
వంటింట్లో ప్రియాంకకి ఇష్టమైన వస్తువేంటంటే పెరుగు అనే సమాధానమిస్తుందామె. దీన్ని చర్మానికే కాదు.. జుట్టుకి కూడా ఉపయోగిస్తుంది. పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకొని మైల్డ్ షాంపూ, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తుంది ప్రియాంక. మాయిశ్చరైజింగ్ విషయంలో మాత్రం ప్రియాంక ఏమాత్రం అశ్రద్ధ చూపదు. వీలున్నప్పుడల్లా ఎస్2కే హైడ్రేషన్ మాస్క్ వేసుకొని ఇరవై నిమిషాల పాటు ముఖంపై ఉంచుకుంటుంది. ఇది తన చర్మాన్ని తాజాగా, మెరుస్తూ ఉండేలా మార్చడంతో పాటు మృదువుగా కూడా మారుస్తుంది.
ప్రియాంక మేకప్ ఎలా ఉంటుందంటే..
పీసీకి అన్నింటికంటే ఇష్టం లేనిది ఏదైనా ఉందంటే.. ఇది పగిలిన పెదాలే. తన పెదాలు ఎప్పుడూ మృదువుగా ఉండేలా చూసుకుంటుంది ప్రియాంక. దీనికోసం ఫ్రెష్ క్రీమ్‌తో పాటు వీలైనంత ఎక్కువ లిప్‌బామ్‌ని పెదాలకు రాస్తూ ఉంటుంది. ఇక మేకప్ వేసుకున్నా లేకపోయినా లిప్ స్టిక్ పెట్టుకోవడానికి ఇష్టపడుతుందీ బ్యూటీ.. ఇందులోనూ ఎక్కువగా బ్రౌన్, పింక్ షేడ్స్ ఉపయోగిస్తుంది. తన చర్మపు రంగుతో ఇవి చక్కగా మ్యాచయ్యి తన ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.
అంతేకాదు.. మాయిశ్చరైజర్ రాయకుండా తన మేకప్‌ని ప్రారంభించదు ప్రియాంక. దాన్ని అప్లై చేసిన తర్వాతే మేకప్ ఏదైనా ప్రారంభిస్తుంది. తను ఉపయోగించే ఉత్పత్తులను కూడా పెద్దగా మార్చడానికి తను ఇష్టపడదు. తనకు ఇష్టమైన మేకప్ – మాక్ స్టూడియోఫిక్స్ ఫౌండేషన్ (రూ.2700), బాబీ బ్రౌన్ కన్సీలర్ (రూ.3,350), వీటితో పాటు మంచి ఐలైనర్ కూడా వేసుకోవడం తనకు చాలా ఇష్టమట. తన ముఖంలో నచ్చే భాగం కళ్లని చెప్పే పీసీ ఐ మేకప్ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తుందట.
ప్రియాంక బ్రైడల్ మేకప్
ప్రియాంక బ్రైడల్ లుక్ గురించి దేశమంతా చర్చించుకుంది. ఎప్పుడూ కనిపించే విధంగా కాకుండా పెళ్లికి తను చాలా ప్రత్యేకంగా సిద్ధమైంది. ప్రముఖ బ్యుటీషియన్ యుమీ మోరీ తనకు ఆ రోజు మేకప్ చేశారట. ఆరోజు తను కేవలం మార్క్ జాకబ్స్ మేకప్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించిందట. ఇవి తన చర్మపు రంగు మరింత మెరిసేలా చేస్తూ ఎయిర్‌బ్రష్ ఫినిషింగ్‌ని అందించాయి. సాధారణంగా బ్రౌన్, పింక్ రంగులు మాత్రమే ఉపయోగించే పీసీ పెళ్లిలో మాత్రం మెరూన్ (బ్రిక్ రెడ్) రంగును ఉపయోగించింది. ఇక దిల్లీలో జరిగిన తన రిసెప్షన్ రోజు ఉదయ్ షిరాలీ తనకు మేకప్ చేశారట. గత తొమ్మిదేళ్లుగా భారత్‌లో ఉన్నప్పుడు పీసీకి మేకప్ చేస్తున్నారాయన. తన ఇష్టాయిష్టాలను గుర్తుంచుకొని.. పీసీకి ఎలాంటి మేకప్ వేస్తే ఆరోజు ప్రత్యేకంగా కనిపిస్తుందో తెలిసిన మేకప్ మ్యాన్ కాబట్టి తన లుక్‌ని అద్భుతంగా కనిపించేలా చేశాడు. ఆ రోజు చాక్లెట్ బ్రౌన్ లిప్‌స్టిక్ ఎంపిక చేసుకున్న పీసీ మేకప్ తక్కువగా, తాజాగా కనిపించేలా చూసుకుంది. ఈ లుక్ ఆమెకు అద్భుతంగా సెట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాలా?
మనసు నుంచి రావాల్సిందే..
మనలో చాలామంది తాము అందంగా లేమని ఇంకా అందంగా కనిపించాలని రకరకాల ట్రీట్‌మెంట్‌లు ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రియాంక మాత్రం తాను ఎలా ఉన్నా అందంగానే ఉన్నానని ఫీలవుతుంది. అమ్మాయిలు తాము అందంగా ఉన్నామని మనసులో భావిస్తే ఆ ఆత్మవిశ్వాసం, ఆనందం ముఖంలో కనిపించి అందంగా కనిపిస్తారట. ఇలా మానసిక ఆనందం, చర్మ ఆరోగ్యం రెండింటికీ సంబంధం ఉంటుందని పీసీ చెబుతుంది.
ఇవి కూడా చదవండి..
బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?
సమంత మేకప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మనమూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!