విడుదలకు ముందే.. "సరిలేరు నీకెవ్వరు" అనిపించుకుంటోన్న మహేష్ బాబు ..!

విడుదలకు ముందే..  "సరిలేరు నీకెవ్వరు" అనిపించుకుంటోన్న మహేష్ బాబు ..!

సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా ఇది. గతంలో భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో కమర్షియల్ హిట్స్ ఇవ్వడమే  కాకుండా.. చక్కటి సందేశాన్ని కూడా అందిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు మహేష్. ఇక ఈ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనుండడంతో..  ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో కొంత భాగాన్ని కశ్మీర్ ప్రాంతంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది.

తాజాగా సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు ముందుగానే.. అభిమానులు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' కటౌట్‌ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సంఘటన ఈ హీరోకున్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పకనే చెబుతోంది. అలాగే ఈ కటౌట్ కూడా టాలీవుడ్‌లోనే అత్యంత ఎత్తైన కటౌట్‌గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. 81 అడుగుల ఎత్తైన ఈ కటౌట్‌ని (Cutout) ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో ఏర్పాటు చేశారు. మహేష్ బాబుకి నైజాంలో (ముఖ్యంగా హైదరాబాద్‌లో) చాలా ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో హౌజ్ ఫుల్ కలెక్షన్లు సాధించాయి. అందుకే ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదల సంబరాలనూ.. సుదర్శన్ థియేటర్ దగ్గరే ప్రారంభించారు ఫ్యాన్స్.

దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ట్వీట్ కూడా చేయడం చూస్తుంటే.. నైజాం కోటలో మహేష్ మరోసారి పాగా వేయడానికి సిద్ధమయ్యాడని చెప్పకనే చెప్పచ్చు. గతంలో బాహుబలి విడుదల సమయంలో ప్రభాస్‌కి 70 అడుగుల కటౌట్, సైరా సినిమా విడుదల సమయంలో చిరంజీవికి 80 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ లెక్కన చూసుకుంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్‌ని.. టాలీవుడ్‌లోనే ఎత్తైన కటౌట్‌గా పేర్కొనవచ్చు.

ఇక దక్షిణాది సినీ పరిశ్రమ విషయానికి వస్తే..  'ఎన్ జీ కే' సినిమా విడుదల సమయంలో ఏర్పాటు చేసిన సూర్య కటౌట్‌ను.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కటౌట్‌గా చెప్పుకోవచ్చు. ఈ కటౌట్‌ని 215 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. దీని తర్వాత 'సర్కార్' విడుదల సమయంలో.. కేరళలోని కొల్లమ్‌లో విజయ్ కటౌట్‌ని 175 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. దీనిని రెండవ అతి పెద్ద కటౌట్‌గా చెప్పుకోవచ్చు.

ఇక  'సరిలేరు నీకెవ్వరు' సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా  టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించనున్నాడు. 'దూకుడు' సినిమా తర్వాత చాలా రోజులకు.. మరోసారి అజయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు మహేష్. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. వీరితో పాటు చాలా సంవత్సరాల తర్వాత.. విజయ శాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుండడం గమనార్హం. ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తిని పెంచే విషయమిది.

ఈ సినిమా టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించింది. అంతేకాదు.. యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్ వీడియోగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ టీజర్‌లో భాగంగా 'మీరెవరో మాకు తెలియదు. కానీ మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత..' అంటూ మిలిటరీ వాళ్లు చేసే త్యాగాన్ని గురించి వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు.. 'భయపడేవాడే బేరాలాడతాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా..' అనే డైలాగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు ముగ్గురూ కలిసి.. తమ బ్యానర్స్ అయిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మంధన కథానాయిక. 2020 సంక్రాంతి సందర్భంగా.. జనవరి 12 తేదిన ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' (జనవరి 11), రజనీకాంత్ 'దర్బార్' సినిమాలతో ఇది పోటీ పడనుంది. ఈ సినిమా తర్వాత కొన్ని నెలల పాటు విరామం తీసుకొని.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. బహుభాషా చిత్రంలో నటించనున్నాడట మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.