సినిమా ఏదైనా సరే.. కథానాయకుడి పాత్ర ఎంత ముఖ్యమో అతనికి జోడీగా కథానాయిక పాత్ర కూడా అంతే ముఖ్యమని చెప్పచ్చు. అందుకే కధపరంగా అవసరం ఉన్నా లేకున్నా.. హీరోకి హీరోయిన్ని జోడీగా ఎంపిక చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు లోకల్ టాలెంట్స్ అంటే.. మన తెలుగమ్మాయిలకు అవకాశాలిస్తే.. ఇంకొందరు మాత్రం తమ కథకు తగ్గట్టుగా ఉన్నారనో లేక సినిమాకు మంచి మార్కెట్ లభిస్తుందనో బాలీవుడ్ (Foreign actresses) కథానాయికలను కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
వీరంతా ఒక ఎత్తైతే; కథానాయిక లేదా కథ పరంగా ముఖ్యమైన పాత్రల కోసం విదేశాలకు చెందిన ముద్దుగుమ్మలను సైతం వెండితెరపై మెరిపిస్తుంటారు. అయితే ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. ఇంతకు ముందే తెలుగు సినిమాల్లో ఈ ట్రెండ్ ఉంది. ముఖ్యంగా 1998లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన పరదేశీ చిత్రమే ఇందుకు ఉదాహరణ.
ఆ తర్వాత కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూనే వచ్చింది. అయితే ఈ మధ్య విడుదలైన చిత్రాల్లో విదేశీ భామలను ఎక్కువగా ప్రత్యేక గీతాలకే పరిమితం చేసేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం కథానాయికలుగా కూడా తమ సత్తా చాటుతున్నారు. మరి, విదేశాల నుంచి వచ్చి తెలుగు తెరపై సందడి చేసిన, చేస్తున్న కొందరు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందామా..
అమీ జాక్సన్
విదేశాల నుంచి వచ్చినప్పటికీ కథానాయికగా తన సత్తా చాటడంలో సఫలమైన అతి తక్కువమంది కథానాయికల జాబితాలో ఈ అమ్మడి పేరు ముందు వరుసలో ఉంటుంది. తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ రూపొందించిన మదరాసిపట్టణం అనే చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ చిన్నది ఎవడు?, నవమన్మథుడు.. వంటి చిత్రాల్లో నటించి చక్కని గుర్తింపు సంపాదించుకుంది. రోబో 2.0లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం కూడా కొట్టేసిందంటేనే ఈ అమ్మడి నటప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈమె వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా?? యూకేలోని లివర్ పూల్‌లో జన్మించిన ఈమె.. బ్రిటీష్ సిటిజన్.
నోరా ఫతేహీ
ఇట్టాగే రెచ్చిపోదాం.. అంటూ టెంపర్‌లో ప్రత్యేక గీతంలో నర్తించిన అందాల భామ గుర్తుందా?? ఆమే నోరా ఫతేహీ. ఒక కెనడియన్ మోడల్. తెలుగులో బాహుబలి, కిక్ 2.. వంటి చిత్రాల్లో ఆడిపాడి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ కేవలం డ్యాన్సర్ మాత్రమే కాదు.. చక్కని నటి కూడా. అయితే తెలుగులో ఇప్పటివరకు కథానాయికగా లేదా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించకపోయినప్పటికీ హిందీలో మాత్రం ఈ అమ్మడిని వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి.
గాబ్రియెల్ బెర్ట్నాటే
ఈ పేరు చెబితే ఎవరూ అంతగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. “డిస్టర్బ్ చేత్తన్నాడే దొంగ పిల్లగాడు..” అనే పాట పాడితే మాత్రం ఆమె రూపం ఠక్కున కళ్ల ముందు మెదులుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?? ఒక బ్రెజిలియన్ మోడల్. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన “దేవుడు చేసిన మనుషులు” చిత్రంలో ప్రత్యేక గీతంతో అలరించిన ఈ భామ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీలో కూడా ఒక చిత్రంలో నటించింది.
సారా జేన్ డయాస్
అదేనండీ.. “పంజా” సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆడిపాడిన చిన్నది. ఆమె ఒమన్‌లో జన్మించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించినప్పటికీ హిందీలో మాత్రం.. అడపాదడపా సినిమాల్లో బాగానే రాణించింది.
క్రిస్టినా అఖీవా..
యమ్లా పాగ్లా దీవానా2 చిత్రంతో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చిన్నది క్రిస్టినా అఖీవా. తెలుగులో యువ కథానాయకుడు ఆది సరసన గాలిపటం సినిమాలోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. అయితే ఈ చిత్రం అంతగా విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించింది లేదు.
వీరే కాదు.. “తీన్ మార్” చిత్రంలో నటించిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, డానా మార్క్స్, సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన “వెల్ కమ్ ఒబామా”లో లూసీ పాత్రలో నటించిన రాచెల్, ఎస్వీ కృష్ణా రెడ్డి రూపొందించిన “యమలీల 2” లో కథానాయికగా పరిచయమైన నిఖిత డయా నికోలస్, రాంగోపాల్ వర్మ “డిపార్ట్ మెంట్”లో నటించి.. ఆ తర్వాత తెలుగులో “దళం” సినిమా ద్వారా పరిచయమైన నటాలియా కౌర్, “బాహుబలి”లో ప్రత్యేక గీతంలో నర్తించిన బ్రిటిష్ మోడల్ స్కార్లట్ విల్సన్.. తదితరులు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నవారే!
తాజాగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో కూడా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ని, జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Featured Image: Instagram
ఇవి కూడా చదవండి
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??
అమీర్ ఖాన్ “దంగల్” సినిమా.. హాలీవుడ్లో విల్ స్మిత్ చిత్రానికి ప్రేరణ..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో.. మరో కొత్త చిత్రం..!