హోలీ (holi).. ఆనందాల కేళి.. చిన్నాపెద్దా, ఆడామగా అని ఏ మాత్రం బేధం లేకుండా అన్ని వయసుల వారు సరదాగా పాల్గొని ఆనందంగా గడిపే పండగ (Festival) ఇది. బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేయడానికి హోలీ లాంటి పండగలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే మనుషుల్లో అందరూ ఒకే రకంగా ఉండరు. కొందరికి కొన్ని ఇష్టమైతే మరికొందరికి అవి ఇబ్బందిగా అనిపిస్తాయి. హోలీలోనూ అంతే.. అందుకే హోలీ రోజు వీధుల్లో మనకు వివిధ రకాలైన వ్యక్తులు కనిపిస్తారు. అందులో ముఖ్యమైనవాళ్లను చూసేద్దాం రండి..
1. పోజుల వీరులు
వీరు హోలీ ఆడడంపై కంటే తాము ఆడిన హోలీ గురించి ఇతరులతో గొప్పగా చెప్పుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడంలోనే బిజీగా ఉంటారు. రకరకాల హ్యాష్‌ట్యాగ్‌లు జోడించి తాము ఎంతో ఆనందంగా వేడుక జరుపుకున్నామని అందరికీ చూపించడం వీరి పని.. ఇందుకోసం వీళ్లు హోలీ ఆడేది తక్కువైతే.. ఆ రంగులతో అందంగా ఫోటోలు దిగేందుకు ప్రయత్నించడం ఎక్కువ. ఈ పోజులన్నీ లైకుల కోసమే మరి..
2. రొమాంటిక్ కపుల్
చుట్టూ ఎంతమంది ఉన్నా.. వాళ్లెవరికీ రంగు పూసేందుకు వీరికి ఆసక్తి ఉండదు. కేవలం తామిద్దరమే ఉన్నామన్నట్లుగా రంగులు పూసుకోవడం, ఒకరిపై ఒకరు రంగునీళ్లను పిచికారీ చేసుకోవడం.. ఇలా హోలీ మజాని కేవలం తామిద్దరం కలిసి మాత్రమే ఆనందించాలని ఈ జంటలు భావిస్తుంటాయి. పక్కనున్న స్నేహితులను కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటారు ఈ జంటలు.
3. ద మిస్ పర్ఫెక్ట్
హోలీ అనగానే సాధారణంగా స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారిని తీసుకురావడం.. లేదా అంతా ఒకచోట చేరి హోలీ ఆడుకోవడం వంటివి సహజం. కానీ ఇందులోనూ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునేవాళ్లు చాలామందే. పండగకి ముందే ప్లాన్ చేసుకోవడం.. ఒక దగ్గర కలవడంతో పాటు రంగులు నేచురల్ కలర్స్ అవునా? కాదా?, నీళ్లు బాగున్నాయా? లేదా? అన్నీ చెక్ చేసుకొని మరీ రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత కూడా ఎలా పడితే అలా రంగులు పూసుకోవడం వారికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా ముఖం, జుట్టుపై రంగులు పడకుండా జాగ్రత్త పడుతుంటారీ పర్ఫెక్షనిస్టులు.
4. కలర్ క్వీన్
ఈ తరహా అమ్మాయిలు ప్రతిఒక్కరినీ రంగుల్లో ముంచెత్తేందుకు సిద్ధం అంటూ ఉంటారు. ఒకటీ రెండు కాదు.. అన్ని రకాల రంగులను తమ వెంట ఉంచుకొని ఇతరులకు పూసేందుకు సిద్ధమవుతారు. కేవలం రంగులేనా? పిచికారీ, బెలూన్లు.. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని అందరినీ రంగుల్లో ముంచెత్తుతూ తాము రంగుల్లో మునిగిపోతారు ఈ తరహా అమ్మాయిలు.
5. వాటర్ బేబీ
మనలో చాలామందికి హోలీలో ఉపయోగించే రంగులు అస్సలు పడవు. వీటి వల్ల చర్మం పాడవడం, ర్యాషెస్, బొబ్బలు ఎక్కడం వంటివి జరుగుతుంటాయి. అందుకే ఇలాంటివారు రంగులతో కాకుండా కేవలం నీటితో హోలీ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కాకపోయినా రంగునీళ్లతో హోలీ ఆడుతూ మజా చేయడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకే చాలామంది హోలీ వేళ రంగులతో ఆటలాడడం కాకుండా.. రెయిన్ డ్యాన్స్, వాటర్ హోలీ వంటివి ఆడేందుకు ప్రాధాన్యమిస్తారు.
6. వద్దు వద్దు ప్లీజ్
చాలామందికి మనసులో హోలీ ఆడాలనే ఉన్నా.. హోలీ అంటే కాస్త భయంగా ఉంటుంది. ఇలాంటివారు హోలీ ఆడకుండా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ స్నేహితులు వూరుకుంటారా? ఇంటికి వెళ్లి మరీ వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు అమ్మాయిలు హోలీ వేడుకలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు బయటకొస్తారు. కానీ రంగులు పూస్తామంటే మాత్రం వద్దు, వద్దు అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తమపై రంగు పడకుండా ఉండేందుకు ఇతరుల వెనుక దాక్కుంటూ తమని తాము కాపాడుకోవడం వీరికే చెల్లింది.
7. వీరి హోలీ వేరు..
హోలీ అంటే అందరికీ కేవలం రంగులు, నీళ్లు వంటివే గుర్తొస్తాయి. కానీ కొందరు ప్రత్యేకమైన తరహా వ్యక్తులు ఉంటారు. వారు హోలీలో రంగులు, నీళ్లు వంటివే కాదు.. గుడ్లు, టొమాటోలు కూడా కొడుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడంలో వీరికి చాలా ఆనందం కలుగుతుంది. ఇవే కాదు.. వదలడానికి చాలా కష్టంగా అనిపించే ఇంక్, ఫ్యాబ్రిక్ పెయింట్స్ వంటివి కూడా చల్లుతుంటారు. ఇది వారికి ఆనందంగా అనిపించినా ఎదుటివారికి చిరాగ్గా అనిపిస్తుంది.
కేవలం టొమాటోల వంటివైతే పర్లేదు కానీ గుడ్డు తలపై కొట్టడం వల్ల వేడుకలు జరిగినంత సేపు వాసనతో ఇబ్బంది పడాల్సిందే. ఆ వాసనతో పాటు గుడ్డును తల నుంచి తొలగించాలంటే ఎంతో కష్టం కూడా. ఇవే కాదు.. ఇంక్, పెయింట్ వంటి మరకలు పోవాలంటే చాలా కష్టం. అందుకే ఈ రంగులు జల్లే ముందు ఎదుటివారి స్థితి కూడా అర్థం చేసుకోవాలి.
చూశారుగా.. హోలీ వేడుకల్లో మనం ఎక్కువగా చూసే వివిధ రకాల వ్యక్తులు.. మరి, ఇది చదవగానే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? వెంటనే వారిని ట్యాగ్‌చేసి వారితో మీ అనుభూతులను పంచుకోండి.
ఇవి కూడా చదవండి.
ఈ వధువులు తమ భర్తలకు తాళి కట్టారు.. కానీ ఇది “జంబలకిడిపంబ” కాదు..!