తెలంగాణ ప్రభుత్వానికి.. తాగుబోతుల వెరైటీ విన్నపం (వింటే.. షాకవుతారు)

తెలంగాణ ప్రభుత్వానికి.. తాగుబోతుల వెరైటీ విన్నపం (వింటే.. షాకవుతారు)

ప్రతిరోజు ప్రపంచంలోని ఏదో ఒక మూల ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలా కాస్త వింతగా అనిపించే ఒక సంఘటన ఈరోజు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కూడా జరిగింది.


ఆ రాష్ట్రంలో జరుగుతున్న జిల్లా పరిషత్, మండల్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం అందుకు వేదికైంది. చిత్రమేంటంటే.. ఇదే సంఘటనతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కూడా ముడి పెట్టారు. 


వివరాల్లోకి వెళితే -  జిల్లా పరిషత్ ఎన్నికల లెక్కింపులో భాగంగా.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపల్లికి చెందిన జిల్లా పరిషత్ బ్యాలెట్ బాక్స్‌ని లెక్కింపు కొరకు అధికారులు తెరవడం జరిగింది.


అలా తెరిచిన బ్యాలెట్ బాక్స్‌లో (Ballot Box)..  బ్యాలెట్ పేపర్ల‌తో పాటుగా ఒక లేఖ  కూడా దొరికింది. బ్యాలెట్ పేపర్లు  ఉండాల్సిన బాక్స్‌లో బ్యాలెట్ పేపర్లతో సహా ఈ లేఖ ఉందేంటి? అని షాక్‌కి గురైన .. అధికారులు తర్వాత ఆ లేఖని  కూలంకషంగా చదివారు. ఆ తర్వాత షాక్‌కు గురయ్యారు. 


ఆ లేఖ సారాంశం ఇలా ఉంది - "మేము నివసిస్తున్న జగిత్యాల జిల్లాలో  కింగ్ ఫిషర్ కంపెనికి చెందిన బీర్లు దొరకడం లేదు. దాని వల్ల సదరు బీరు ప్రేమికులు పక్క జిల్లా అయిన కరీంనగర్‌కి వెళ్ళి మరీ బీర్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 


కనుక మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచండి ... ఈ సమస్య పరిష్కారానికి ఒక సూచన కూడా చేస్తున్నాం. అదేమనగా - కింగ్ ఫిషర్ బీర్ల లభ్యత కోసం మేము జగిత్యాల జిల్లా‌ని కరీంనగర్ జిల్లాలో కలిపేయాల్సిందిగా కోరుతున్నాం" అని మందుబాబులు ఆ లేఖలో కోరడంతో షాక్ అవ్వడం అధికారుల వంతైంది. 


ఈ లేఖను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞాపనగా మందుబాబులు ప్రకటించడంతో.. అధికారులు విస్తుపోయారు. ఇక ఈ లేఖ మొత్తానికి కొసమెరుపేంటంటే - దానిని 'జగిత్యాల జిల్లా వాసుల' పేరిట రాయడం జరిగింది. అందుకనే ఈ లేఖ చదివిన అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది.


ఇక అసలు ఈ లేఖ బ్యాలెట్ బాక్స్‌లోకి ఎలా వచ్చి ఉండొచ్చు? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఓటర్లలో ఎవరైనా.. పోలింగ్ బూత్‌లోకి ఈ లేఖని రహస్యంగా తీసుకొని వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అలా తీసుకొచ్చిన లేఖను బ్యాలెట్ బాక్స్‌లో తమ ఓటుతో పాటుగా వేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.


కాగా ఈ లేఖని ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అధికారులు సీజ్ చేసి, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన జిల్లా కలెక్టర్‌కి  పంపినట్లు సమాచారం. ఈ సంఘటనపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.


ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని... తద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఆకతాయి కార్యకలాపాలకు ఎవ్వరు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది ప్రస్తుత అధికారిక పార్టీని అభాసుపాలు చేయడానికే చేసిన పనిగా  అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి


రంజాన్ అంటే హలీం ఒక్కటే కాదు.. ఈ వంటకాలు కూడా ప్రత్యేకమే..!


హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..


హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!