“మీకు క్యాన్సర్ (Cancer) ఉంది” అన్న మాట ఎంత ధైర్యవంతులనైనా భయపెడుతుంది. అది ఏ స్టేజ్‌లో ఉన్నా సరే.. బతికే అవకాశం ఉన్నా.. లేకపోయినా… ఆ మాట వినగానే సగం ప్రాణం పోయినట్లుగానే అనిపిస్తుంది. అవును.. క్యాన్సర్ అంటే జీవితాన్నే కబళించే మహమ్మారి. అయితేనేం.. ధైర్యంగా దాన్ని ఎదిరించి పోరాడి.. గెలిచినవాళ్లు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఏం చెప్పినా.. వ్యాధి సోకిన వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. వ్యాధితో పోరాడేందుకు వారికి ధైర్యాన్ని ఇవ్వడంలో కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా భాగస్వామి (Partner) పాత్ర ఎంతో ముఖ్యమైనది. మరి, ఒకవేళ మీ భాగస్వామి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి గురైతే.. మీ బాధను దిగమింగుతూనే వారు.. ఆ వ్యాధిని.. దానికి మించిన బాధను ఎదుర్కొనేలా చేయడం ఎలా? తెలుసుకుందాం రండి..
మన కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధికి గురయ్యారంటే మనకూ ఎంతో భయం, బాధ మనసులో ఉంటాయి. అయితే మీకంటే ఆ సమస్యను ఎదుర్కొనే వారు ఇంకా ఎక్కువగా భయపడతారు. దానితో పాటు చికిత్స వల్ల శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అవన్నీ తట్టుకునేందుకు వారికి మీ సహకారం (support) ఎంతో అవసరం.
షాక్ నుంచి తేరుకోనివ్వండి
మీ భాగస్వామికి క్యాన్సర్ వచ్చిందని తెలియగానే వారికే కాదు.. మీకూ ఆకాశం తలపై పడ్డట్లుగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మీతో కలిసున్న వారు మీతో పాటు ఉండరని తెలిసి ఏడుపు తన్నుకురావడం సహజం. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నా సరే.. చాలామంది ఏమవుతుందోనని భయపడడం సహజమే! ఇలాంటప్పుడు వారిని మనసారా ఏడవనివ్వండి. మీ మనసులో ఉన్న బాధను దాచి ఏమీ కాదంటూ వారిని సమాధానపర్చేందుకు ప్రయత్నించవద్దు.
ముందు వారితో మీ బాధను పంచుకోండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టండి. అయితే చనిపోతారన్న భావన మాత్రం వారిలో రానివ్వద్దు. ఏ స్టేజ్‌లో ఉన్నా సరే.. ధైర్యంగా పోరాడాలన్న తపన వారిలో నింపే ప్రయత్నం చేయండి. వారిలో బతకాలన్న కాంక్షను నింపి.. ట్రీట్‌మెంట్‌కి వారిని సిద్ధం చేయాల్సిన బాద్యత మీదే..
పర్సనల్ డాక్టర్ అయిపోండి
క్యాన్సర్ వచ్చిందని తెలియగానే చాలామంది తమ ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ తీసుకోవడం తగ్గిస్తారు. కానీ ఇది సరికాదు.. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, మానసికంగా ఆనందంగా ఉంటూ.. ఇతర ఆరోగ్యపుటలవాట్లు పాటిస్తే అంత ఎక్కువగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకునే వీలుంటుది. అందుకే మీ భాగస్వామికి మీరు తోడై ఉండండి. వారు సమయానికి మందులు వేసుకునేలా.. ఎప్పటికప్పుడు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు వైద్యుల వద్దకు తీసుకెళ్తూ.. చక్కటి చికిత్స తీసుకునేలా చేస్తూనే.. శారీరకంగా వారు దృఢంగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యతే..
భవిష్యత్తు గురించి మాట్లాడండి
క్యాన్సర్ బారిన పడితే చాలు.. భవిష్యత్తుపై నమ్మకం, ఆశలు అన్నీ చచ్చిపోతాయి. చాలామందికి బతకాలనే ఆశ కూడా ఉండదు. ఇలాంటప్పుడు వారిలో ఆశలు పెంచి.. ఆరోగ్యంగా ఉండేందుకు వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అందుకే మీ భాగస్వామితో మీ భవిష్యత్తు గురించి చర్చించండి. మీకు ఇంకా పిల్లలు లేకపోతే మీ పిల్లల కోసం మీరు ప్లాన్ చేసుకున్న విషయం గురించి.. ఒకవేళ మీకు పిల్లలుంటే వారి భవిష్యత్తు గురించి మాట్లాడండి.
భవిష్యత్తులో మీరిద్దరూ కలిసి ఎక్కడెక్కడికి వెళ్లాలి.. ఏమేం చేయాలని మీరు అనుకున్నారో అవన్నీ మాట్లాడండి. ఇవి వారిలో బతకాలన్న కోరికను పెంచి.. క్యాన్సర్‌తోనూ పోరాడేలా చేస్తాయి. ఇవే కాదు.. మీరు చేరుకోవాలనుకునే లక్ష్యాల గురించి.. దానిలో వారి తోడ్పాటు ఎంతగా అవసరం ఉంటుందో.. ఎలా ఉండాలో వారితో చెప్పండి. వారు మీకు తోడుగా ఉండాలని మీరు ఎంతగా కోరుకుంటున్నారో వారికి వివరించడం వల్ల వారిలో జీవించాలన్న కోరికను మరోసారి కలిగించినవారవుతారు.
మీపై శ్రద్ధ తగ్గించొద్దు
భాగస్వామికి క్యాన్సర్ వచ్చిందనగానే మీపై ఒత్తిడి చాలా ఎక్కువవడం సహజం. అటు వారిని చికిత్సకు తీసుకువెళ్లడం, ఇంటి పనులు, మీ ఆఫీస్ పనులు అన్నీ దగ్గరుండి చక్కబెట్టుకోవడం, ఆర్థికంగా ఉన్న వనరులను చూసుకుంటూ ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసుకోవడం, అలాగే.. ట్రీట్‌మెంట్ వల్ల అటు మానసికంగా, ఇటు శారీరకంగా చాలా బలహీనంగా తయారైన వారిలో ధైర్యం నింపి.. వారు ఆరోగ్యంగా మారేందుకు తగిన ఆహారం, మందులు వారికి వేళకు అందించడం.. ఇలా మీరు చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి.
అయితే ఇవన్నీ చేస్తూ మీ గురించి మీరు పట్టించుకోకుండా ఉండద్దు. దీనివల్ల మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలుంటాయి. అదే జరిగితే మీ భాగస్వామిని చూసుకునేందుకు వేరే వారి సహాయం కోరాల్సిన పరిస్థితి ఎదురవ్వచ్చు. అందుకే మీ గురించి మీరు శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు వేళకు ఆహారం, తగినంత నిద్ర వంటివి ఉండేలా చూసుకోవాలి.
క్యాన్సర్ మహమ్మారిని గెలిచారు.. విజేతలై అందరికీ ఆదర్శంగా నిలిచారు..!
మీ భాగస్వామిలో మీరు తప్పక ఒప్పుకోవాల్సిన అంశాల గురించి ఆంగ్లంలో చదవండి.
లైంగిక ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలను ఆంగ్లంలో చదవండి.