మన రాజమండ్రి అమ్మాయి.. ఐసీసీ చరిత్రలోనే తొలి మహిళా రిఫరీ..!

మన రాజమండ్రి అమ్మాయి.. ఐసీసీ చరిత్రలోనే తొలి మహిళా రిఫరీ..!

మనం కోరుకొన్న అవకాశం మనకు రాలేదంటే.. ఇంకో పెద్ద అవకాశం మన కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈ లోపు నిరాశా నిస్పృహ‌ల‌కు లోనైతే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోతే.. విజయం మన సొంతమవుతుంది. ఈ విషయం 51 ఏళ్ల జీఎస్ లక్ష్మిని (GS Lakshmi) చూసి మనమందరం నేర్చుకోవాల్సిందే. బౌలర్‌గా అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని నిరూపించుకొనే అవకాశం ఆమెకు రాలేదు. అలాగని ఆమె కుంగిపోలేదు. క్రికెట్‌తో తనకున్న అనుబంధాన్ని వదులుకోలేదు.


క్రికెటర్‌గా తనకు సరైన అవకాశం రాకపోయినా.. రిఫరీగా (referee) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంది. జోనల్ మ్యాచుల నుంచి అంతర్జాతీయ మ్యాచులకు రిఫరీగా వ్యవహరించే స్థాయికి ఎదిగింది. ఐసీసీ (ICC) గుర్తింపు సాధించింది. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఐసీసీ మ్యాచ్ రిఫరీల్లో చోటు దక్కించుకొన్న తొలి మహిళగా ఆమె ఘనత సాధించింది. ఫైగా ఆమె ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మహిళ కావడం మరో విశేషం. ఆమే గండికోట సర్వలక్ష్మి.. క్లుప్తంగా జీఎస్ లక్ష్మి. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..


జీఎస్ లక్ష్మి  పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోనే. పెరిగింది మాత్రం జంషెడ్ పూర్లో. అక్కడ ఆమె తండ్రి శేషగిరి శర్మ టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్‌లో సూపర్‌వైజరు‌గా పనిచేసేవారు. చిన్నప్పుడు ఆమె అబ్బాయిలతో కలసి సరదాగా క్రికెట్ ఆడేవారు. కానీ ఆ క్రికెటే తనను ముందుకు నడిపిస్తుందని అనుకోలేదు. పదోతరగతిలో మార్కులు తక్కువ వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఆమెకు కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు.


కాలేజీలో సీటు రావడం, పూర్తి స్థాయి క్రికెటర్‌గా జీవితం మొదలుకావడం రెండూ మంచి విషయాలే. కానీ అప్పటికి లక్ష్మి తండ్రికున్న సంపాదనతో ముగ్గురు పిల్లల్ని చదివించడం, వారిని పోషించడం తలకు మించిన భారంగానే ఉండేది. ఇక క్రికెట్ ఆడాలంటే మామూలు విషయం కాదు కదా. ఆ సమయంలో జీఎస్ లక్ష్మి అన్నయ్య, తమ్ముడు తనకు అండగా నిలిచారు. వారు చేయగలిగినంతలో ఆమెకు అవసరమైన సహకారాన్ని అందించారు. 1980, 90ల్లో క్రికెట్ ఆడే అమ్మాయిలు చాలా తక్కువ. అందులోనూ బౌలర్లు మరీ తక్కువ.


అందుకే చాలా సులభంగా బీహార్ స్టేట్ జట్టులో లక్ష్మికి చోటు దక్కింది. బీహార్ జూనియర్ జట్టు, సీనియర్ జట్టు, ఈస్ట్ జోన్ జట్టులో ఆమె బౌలర్‌గా ఆడారు. క్రికెటర్‌గా రాణిస్తున్నప్పటికీ క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయనే విషయం ఆమెకు చాలా రోజులకు గానీ తెలీలేదట. ఆ విషయం తెలిసిన వెంటనే ఆమె క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్నారు. దీంతో ఆమెకు దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం వచ్చింది. రైల్వే జట్టు తరఫున కొన్ని మ్యాచులు సైతం ఆడారు. ఇంటర్ రైల్వేస్ టోర్నీల్లో దక్షిణ మధ్య రైల్వే జట్టుకు తొలి ట్రోఫీ తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.


రైల్వే జట్టులో రాణించినప్పటికీ సీనియర్లు ఎక్కువగా ఉండటంతో ఆడే అవకాశం పెద్దగా వచ్చేది కాదు. ఇది ఆమెను చాలా బాధించేది. ఎక్కువ శాతం మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమై ఉండేది. అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని ఉపయోగించుకొన్నప్పటికీ పెద్ద ప్రయోజనం కనిపించేది కాదు. ఆ తర్వాత పెళ్లి కావడం, కొన్నాళ్లకు ఆమెకు పాప పుట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో క్రికెట్‌కు కొంతకాలం దూరమవ్వాల్సి వచ్చింది.


పునరాగమనం తర్వాతైనా మంచి అవకాశాలు దక్కుతాయనుకొంటే అదీ జరగలేదు. దీంతో రైల్వే జట్టు నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడటం ప్రారంభించారు. జోనల్ మ్యాచుల్లో రాణించి జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. అయినా ఆమె పరిస్థితుల్లో మార్పు ఏమీ రాలేదు. అక్కడ కూడా రిజర్వ్ బెంచికే పరిమితమవ్వాల్సి వచ్చింది.


ఇలాంటి సమయంలోనే బీసీసీఐ  తీసుకొన్న కీలక నిర్ణయం లక్ష్మి జీవితాన్ని మలుపు తిప్పింది. 2008లో ఐదుగురు మహిళల్ని రిఫరీలుగా తీసుకొన్నారు. వారిలో లక్ష్మి కూడా ఒకరు. ఈ రిఫరీలు మహిళల జోనల్ మ్యాచ్‌లకు మాత్రమే రిఫరీగా పనిచేస్తారు. 2014లో మరోసారి బీసీసీఐ కీలకమైన నిర్ణయం తీసుకొంది. పురుషుల మ్యాచుల కోసం రిఫరీలుగా 8 మంది మహిళలను ఎంపిక చేసింది. వారిలో జీఎస్ లక్ష్మి చోటు దక్కించుకొన్నారు.


అప్పటి నుంచి మహిళల, పురుషుల దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ రిఫరీగా కొనసాగుతున్నారు. మన దేశంలో జరిగిన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో మూడు వన్డేలు, మూడు టీ-ట్వంటీ మ్యాచులకు సైతం రిఫరీగా పనిచేశారు. కానీ అప్పటికి ఆమెకు ఐసీసీ గుర్తింపు లేదు.


1-icc-referee-ipl


తాజాగా ఆమెకు రిఫరీగా ఐసీసీ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు సాధించిన తొలి మహిళగా ఆమె ఖ్యాతి గడించింది. 51 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఇకపై మహిళల మ్యాచులతో పాటు పురుషుల మ్యాచ్‌లకు సైతం ఆమె రిఫరీగా పనిచేయనున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో జైపూర్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తొలిసారి ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఐసీసీ మ్యాచ్ రిఫరీ హోదాలో పనిచేశారు.


రిఫరీగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ‘ఆడవాళ్లకు రిఫరీ గురించేం తెలుసు? వాళ్లేం చేస్తారు?’ అనేవారట. ఆ తర్వాత తన పనితీరును చూసి వారి అభిప్రాయంలో మార్పు వచ్చిందని అంటారు లక్ష్మి. ‘ఏ పని చేయడానికైనా నువ్వు ఆడా మగా అనే విషయం ముఖ్యం కాదు.. నీకప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నావన్నదే ముఖ్యమ’ని అంటారు. ప్రస్తుతం ఆమె దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేస్తున్నారు.


51 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ప్యానెల్లో రిఫరీగా చోటు దక్కించుకొన్న లక్ష్మిని చూస్తే మనకు తగిన అవకాశం రాలేదని కుంగిపోకుండా వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొంటూ ముందుకు వెళితే విజయం, గుర్తింపూ రెండూ లభిస్తాయని అనిపిస్తుంది కదా.


Images: ICC, BCCI


ఇవి కూడా చదవండి:


చదరంగంలో నేటి తరానికి స్ఫూర్తి.. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక..!


మహిళా శక్తి గురించి బాక్సర్ నిఖత్ జరీన్ ఏమంటుందో తెలుసా?


బాక్సింగ్‌లోనే కాదు.. పాట పాడడంలో కూడా మేరీ కోమ్ నెం 1..!