ఏంటి?.. టైటిల్ చదవగానే కాస్త తికమకగా ఉందా ?.. ఏం లేదండి… నటి అమృతా సింగ్ & నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దంపతుల గారాలపట్టి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) హిందీ చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి మనకు తెలిసిన విషయమే కదా . అయితే ఆమె కథానాయికగా అడుగుపెట్టిన తొలి ఇరవై రోజులలోనే ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోబోతుంది.
అయితే ఈ రికార్డు బాక్స్ ఆఫీస్ వసూళ్లు, అవార్డులు.. ఇటువంటి వాటిలో మాత్రం కాదు. ఇంకేం అంశంలో అంటారా !! సారా నటించిన – కేదార్ నాథ్ ఇప్పటికే విడుదల అవ్వగా.. సింబా చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది.
మామూలుగా ఎవరైనా కొత్త వ్యక్తి సినీ పరిశ్రమలో అడుగుపెట్టే సమయంలో అంగీకరించిన తొలి సినిమాలు.. చాలాకాలం తరువాత (అంటే వారు నటించిన కొన్ని చిత్రాల తరువాత) విడుదల అవుతుండడం అప్పుడప్పుడు చూస్తుంటాం . అయితే సారా విషయం వేరు. ఆమె తాను నటించిన తొలి చిత్రం విడుదల కాకముందే మరొక పెద్ద చిత్రంలో అవకాశం చేజిక్కించుకుని ఆ చిత్రాన్ని తన మొదటి చిత్రం విడుదలైన దాదాపు 20 రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
అయితే ఇది అనుకోని ప్లాన్ అని చెప్పుకోవచ్చు. కేదార్నాథ్ చిత్రం విడుదలలో జాప్యం కావడంతో ఇప్పుడు ఆమె నటించిన మరో చిత్రం సింబా కూడా మూడు వారాల వ్యవధిలోనే విడుదలవుతుంది . కేదార్నాథ్ చిత్రం 2013లో కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో సంభవించిన వరదల నేపథ్యంలో అల్లిన ఒక ప్రేమ కథ కాగా.. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. కాగా సింబా చిత్రాన్ని రోహిత్ శెట్టి తెరకెక్కించడం విశేషం. సింబా చిత్రం తెలుగులో ఎన్ఠీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ చిత్రానికి రీమేక్ కావడం గమనార్హం.
ఇవ్వన్నీ పక్కనపెడితే.. సారా అలీ ఖాన్ వెండితెరకు పరిచయమవుతూనే తనకి తెలియకుండా ఒక రికార్డు సృష్టించేందుకు సిద్ధపడడంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
తన నటనతో సంబంధం లేకుండానే తెరంగేట్రంలోనే ఇలా రికార్డు సృష్టిస్తుంటే .. ఇక నటి అయ్యాక ఆమె ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచిచూడాలి …