కేవలం ప్రభాస్ కోసమే.. అందుకు ఒప్పుకున్నా : జాక్వెలిన్ ఫెర్నాండెజ్

కేవలం ప్రభాస్ కోసమే.. అందుకు ఒప్పుకున్నా : జాక్వెలిన్ ఫెర్నాండెజ్

సాహో.. (saaho) యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా ఈ నెల 30న విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్, జాక్వెలిన్ (Jacqueline) కలిసి డ్యాన్స్ చేసిన "బ్యాడ్ బాయ్" అనే పాటను.. ఇటీవలే జరిగిన చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఈ ప్రత్యేక గీతం నిలవనుందట. ఇంగ్లిష్, తెలుగు భాషలలో మిక్స్ చేసిన లిరిక్స్‌తో ఈ పాటను రూపొందించారు. శ్రీజో రాసిన ఈ పాటను బాద్షా, నీతి మోహన్ కలిసి పాడడం విశేషం.

బాద్షా ఈ పాటకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వినడానికి అచ్చం పాప్ సాంగ్‌లా ఉన్న ఈ పాటలో ప్రభాస్ చాలామంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. పాటతో పాటు మధ్యలో కార్లు, హెలికాఫ్టర్ వంటివి కనిపించడంతో పాటు.. ఫైట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పాటలో జాక్వెలిన్ తన అందమైన డ్యాన్స్ స్టెప్పులతో పాటు.. అద్భుతమైన డ్రస్సులతో అందాలు ఒలికించడం ఈ పాటకు ప్లస్సయిందని చాలామంది భావిస్తున్నారు. ఈ పాట ఇంతకుముందు విడుదల చేసిన రెండు పాటల కంటే ప్రత్యేకంగా ఉందని.. ప్రభాస్, జాక్వెలిన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని నెటిజన్లు అభిప్రాయపడుతుండడం విశేషం.

మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించడం గురించి.. జాక్వెలిన్ ఓ ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ని పొగడ్తల్లో ముంచెత్తిందీ శ్రీలంక భామ. జాక్వెలిన్ మాట్లాడుతూ.. "ప్రభాస్‌తో పనిచేయడం చాలా ఆనందంగా, ఫన్‌గా అనిపించింది. ఈ పాటలోనూ కొన్ని యాక్షన్ సీన్లు ఉన్నాయి. నాకూ ఫైట్లంటే ఇష్టం. కానీ నేను ఎలాంటి ఫైట్లు చేయలేదు. ఈ పాటలో కనిపించాలన్నప్పుడు.. నేను ప్రభాస్ సరసన నటిస్తున్నా అని ఒప్పుకున్నా. కానీ సెట్స్‌కి వెళ్లాలంటే కాస్త భయంగా అనిపించింది. తెలుగు పాటలో పదాలన్నీ సరిగ్గా గుర్తుంచుకొని అలాగే పాడాలి. నేను వాటిని నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో అనుకున్నా. కానీ మొదటి టేక్‌లోనే వాటిని చేయగలగడం నాకు ఎంతో సంతోషాన్ని అందించింది" అని తెలిపింది జాక్వెలిన్.

"ఈ సినిమాలో నటించడానికి ముందే నేను వేరే సినిమాకి డేట్స్ ఇచ్చేశాను. దాంతో ఎక్కువ సమయం కేటాయించడానికి.. డ్యాన్స్‌కి ముందు రిహార్సల్స్ చేసుకోవడానికి కూడా పెద్దగా సమయం లేదు. నేను యూరప్‌లో షూటింగ్‌లో ఉన్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. ప్రభాస్‌తో కలిసి నటించాలనుకున్నా. ఎలాగైనా తనతో ఓ చిత్రంలో చిన్న పాత్రలో అయినా కనిపించాలని అనుకొనేదాన్ని. అందుకే ఈ అవకాశం రాగానే ఒప్పుకున్నా. ఈ పాట షూటింగ్ ఆస్ట్రియాలో జరిగింది.

కేవలం రెండున్నర రోజుల్లోనే పూర్తయిపోయింది. అసలు సెట్స్‌లోకి అడుగుపెట్టేముందు.. నాకు దాని గురించి ఏమీ తెలీదు. అసలేం తెలుసుకోకుండా వెళ్లినా.. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఇది నాకు దక్షిణాదిలో మొదటి సినిమా. వాళ్ల పనితీరు, వేగం ఇవన్నీ నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. వాళ్లు ముందుగానే అన్నింటికీ సిద్ధమై ఉండడం వల్ల ఎక్కువ సమయం పట్టలేదు. సమయం కొద్దిగానే ఉన్నా ప్రభాస్ సెట్స్‌లో ముందుగా ప్రాక్టీస్ చేసి.. తన స్టెప్స్ పర్ఫెక్ట్ అనుకున్నాకే టేక్‌కి వెళ్లేవాడు" అంటూ ఈ సినిమాలో నటించడానికి కారణాలతో పాటు షూటింగ్ అనుభవాలను కూడా పంచుకుంది జాక్వెలిన్.

ఇప్పటివరకూ ప్రభాస్, శ్రద్ధల కాంబినేషన్‌లో సైకో సయ్యా.. ఏ చోట నువ్వున్నా అనే రెండు పాటలు విడుదలవగా.. ఇది మూడో పాట. విడుదలైన కొన్ని గంటల్లోనే హిందీ వెర్షన్‌కి దాదాపు 80 లక్షలకు పైగా.. తెలుగు వెర్షన్‌కి 35 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో.. ఈ పాట ప్రత్యేకతను చాటుకుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ "సాహో" చిత్రానికి యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.