నిన్న మొన్నటి వరకు మహిళలు తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకొనేవారు కాదు. అలా చెబితే తమనే తప్పు పడతారనే ఉద్దేశంతో తమ బాధను పంటిబిగువున అనుభవిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లైంగిక వేధింపుల గురించి మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి ‘మీటూ’ అంటూ తమను వేధించినవారి బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారికి బాసటగా నిలుస్తున్నారు. ఈ మీటూ గతేడాది బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కొందరు సినీతారలు తమ గళాన్ని విప్పారు.
నటుడు నానాపటేకర్, దర్శకులు సాజిద్‌ఖాన్, వికాస్ బల్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్, ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ వంటి ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వీరే కాదు.. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారెందరో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ సమయంలో మీటూ ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించినవారిలో కృతి సనన్ కూడా ఒకరు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆమె మీటూ గురించి చర్చిస్తూనే ఉన్నారు
తాజాగా కృతి సనన్ మీటూ గురించి మరోసారి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వృత్తిపరమైన జీవితంలో తాను ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కోనప్పటికీ.. వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయం మాత్రం తనలో ఉండేదని ఆమె అన్నారు. హౌస్ ఫుల్ 4 లో నటిస్తోన్న కృతి ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత తనకు.. ఈ లైంగిక వేధింపుల విషయంలో ఎలాంటి భయం లేదంటోందామె. ‘మీటూ వల్ల అమ్మాయిలను వేధించేవారిలో భయం పెరిగింది. ఆ భయం వారిలో ఉండాల్సిందే’ అని కూడా ఆమె తెలిపింది.
గతంలో సైతం కృతి సనన్ మీటూ ఉద్యమం గురించి మాట్లాడారు. ‘మీటూ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన నిజాలు మనల్ని డిస్టర్బ్ చేశాయి. షాక్‌కి గురి చేశాయి. కోపం కలిగించాయి. రోజూ అలాంటి కథనాలు వినాల్సి రావడం మహిళగా నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా బయటకు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి’ అంటూ గతంలో ఈ ఉద్యమం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కృతి.
మరో సందర్భంలో సైతం మీటూ గురించి మాట్లాడుతూ- ‘మహిళలను వేధించేవారు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొంటారు. ఎందుకంటే వాళ్లేదైనా తప్పు చేస్తే.. దాన్నుంచి జీవితకాలం ఎదురు చూసినా బయటపడే అవకాశం ఉండదు. న్యాయపరంగా సైతం అలాంటి మార్పులు వస్తే బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. అంతేకాదు మీటూ ఉద్యమాన్ని సమర్థంగా నడిపించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కూడా ఆమె తెలిపింది. అంతేకాదు.. పేరు చెప్పని వ్యక్తులు చేసే అభియోగాలను గుడ్డిగా నమ్మొద్దని సైతం చెబుతున్నారు కృతి సనన్.
— Kriti Sanon (@kritisanon) 14 October 2018
కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని అందరి ముందు ఉంచింది కృతి సనన్. పేరు చెప్పడానికి ఇష్టపడని అమ్మాయిలు ఎవరి మీదైనా లైంగిక వేధింపుల గురించి ఆరోపణలు చేస్తే వాటిని గుడ్డిగా నమ్మడం సమంజసమేనా? అలాంటి వారి ఆరోపణలకు విలువ ఇవ్వడం సరైనదేనా? బాధితురాలు ఎవరో తెలియకుండా ఆ కథనాలకు విపరీతమైన ప్రచారం చేయడం మంచిదేనా? ఇలాంటి కథల వల్ల కొంతమంది అమాయకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీటూ ఉద్యమం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు కృతి సనన్.
తెలుగులో వన్ నేనొక్కడినే, బాలీవుడ్‌లో దిల్ వాలేతో నటిగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ భామ.. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి కొంత భాగాన్ని సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించారు. కానీ అతనిపై ఆరోపణలు రావడంతో నిర్మాత సాజిద్ నదియావాలాని తప్పించి మరొకరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఫర్హాద్ షామ్ జీ దర్వకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
#Me Too ఉద్యమం మనసులను కదిలించే యదార్థ సంఘటనలు ఇవి