అమ్మ కోసం ఎన్ని వేల సంతకాలో..! మాతృదినోత్స‌వ కానుకగా గిన్నిస్ రికార్డ్..!

అమ్మ కోసం ఎన్ని వేల సంతకాలో..! మాతృదినోత్స‌వ కానుకగా గిన్నిస్ రికార్డ్..!

‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’ అన్నారు దాశరథి. నిజమే.. అమ్మ గురించి వర్ణించడం చాలా కష్టం. బిడ్డపై అమ్మకున్నంత ప్రేమ ఇంకెవరికీ ఉండదేమో. బిడ్డ ఆకలి గురించి తల్లికి తెలిసినంతంగా మరెవరికీ తెలియదు. అంతకుమించి తన రక్తమాంసాలను ధారపోసి మనల్ని మనిషిగా మారుస్తుంది. అందుకే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా ఎవరూ తీర్చుకోలేరు. కానీ ఆమెను ప్రేమగా చూసుకోవచ్చు. ఆ ప్రేమను అందంగా వ్యక్తం చేయవచ్చు.


అమ్మకు ఆనందాన్ని కలిగించవచ్చు. అందుకే జోర్డాన్ వాసులు అమ్మ మీద తమకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి వినూత్నంగా ప్రయత్నించారు. గిన్నిస్ బుక్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఇంతకూ అమ్మపై తమకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి వారేం చేశారో తెలుసా? సంతకాలు సేకరించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పద్దెనిమిది వేల మంది సంతకాలు చేసి అమ్మకు మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియజేశారు. Guinness world record సృష్టించారు. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.


1-jordan-mothers-day-record


సాధారణంగా మనం మదర్స్ డే‌ను మే నెలలో వచ్చే రెండో ఆదివారం నాడు జరుపుకుంటాం. కానీ అరబ్ దేశాల్లో అలా కాదు. ఏటా మార్చి 21న మాతృదినోత్స‌వాన్ని జరుపుకొంటారు. ఆ రోజు అరబ్ దేశాల్లోని తల్లులందరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. పూలు, బొకేలు, గ్రీటింగ్ కార్డులు అందించి వారి ప్రేమకు, తల్లిగా చేసిన త్యాగాలకు బిడ్డగా తామెంత విలువనిస్తున్నామో తెలియజేస్తారు.


జోర్డాన్ కూడా అరబ్ దేశమే కాబట్టి ఆ దేశంలోనూ మదర్స్ డేను మార్చి 21న జరుపుకొన్నారు. అరబ్ దేశాల్లో మాతృదినోత్స‌వాన్ని జాతీయ సెలవు దినంగా పరిగణిస్తారు. జోర్డాన్ లోనూ అంతే. ఈ ఏడాది జోర్డాన్ వాసులు తమ మాతృమూర్తులకు వైవిధ్యమైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సైతం నెలకొల్పారు.


5-jordan-mothers-day-record


Image: Facebook


సాధారణంగా మదర్స్ డే రోజు అమ్మకు ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతాం. కానీ జోర్డాన్ వాసులు అంతకుమించిన కానుకను అమ్మకు ఇచ్చారు. వేలాదిగా జనం తరలి వచ్చి స్టిక్కీనోట్స్ అతికించి ఉన్న పోస్టర్స్ పై అమ్మపై తమకున్న ప్రేమను తెలియజేస్తూ సంతకాలు చేశారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, యువత, పెద్దలు ఇలా వయసుతో సంబంధం లేకండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.


ఇలా 18 వేలకు పైగా స్టిక్కీ నోట్స్ పై తమ సంతకాలు చేశారు. ఇలా తమ తల్లులకు కానుకను అందించడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డ్ సైతం నమోదు చేశారు. అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్కువ మంది సంతకం చేసిన పోస్టర్ ఇదేనని గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం హమడ రెస్టారెంట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది.


 2-jordan-mothers-day-record


ప్రపంచమంతా మే నెలలో మదర్స్ డే(Mother's day) జరుపుకొంటే.. అరబ్ దేశాల్లో మార్చి 21న ఎందుకు జరుపుకొంటున్నారు? ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు? ఈజిప్ట్‌లో మాతృదినోత్స‌వాన్ని మొదటిసారిగా 1943లో జరుపుకొన్నారు. ముస్తఫా అమిన్ అనే జర్నలిస్ట్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తల్లికి మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషిని తెలుసుకొన్న ఓ వితంతువు.. ఆయన్ను సంప్రదించింది.


మాటల్లో తన బిడ్డను డాక్టర్ చేసిన విషయం, దాని కోసం ఎంత కష్టపడిందీ తెలుసుకొన్నారు అమిన్. దీంతో మార్చి 21న మాతృదినోత్స‌వంగా జరుపుకోవడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రయత్నం ఫలించి 1956 మార్చి 21న ఈజిప్ట్‌లో అధికారికంగా మదర్స్ డే ఉత్సవాలు జరిగాయి. ఆ తర్వాత మిగిలిన అరబ్ దేశాలు సైతం ఈ సంప్రదాయాన్ని పాటించడం మొదలుపెట్టాయి. జోర్డాన్ కూడా అరబ్ దేశాల్లో భాగం కాబట్టి మార్చి 21న మదర్స్ డే జరుపుకొంటుంది.


Featured Image: Shutterstock


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.