ఒక్క ఛాన్స్ దొరికితే చాలు తామేంటో నిరూపించుకోవాలని ఔత్సాహిక నటీమణులు ఎదురుచూస్తుంటారు. అయితే తమకున్న ప్రతిభను నిరూపించుకోవడానికి కాస్టింగ్ కౌచ్ అడ్డు వస్తోంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఇలాంటి పెద్దమనుషుల లైంగిక కోరికలను తీర్చితేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయని బెదిరించేవారు సైతం లేకపోలేదు.
దీన్నే కాస్టింగ్ కౌచ్ (casting couch) అని వ్యవహరిస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన రహస్యమే. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని కొందరు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటపెట్టారు. ఈ పరిస్థితుల్లో మల్లేశం (Mallesham) సినిమా దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండ (Raj Rachakonda) కాస్టింగ్ కౌచ్ విషయంలో వ్యవహరించిన తీరు అందరితో ప్రశంసలు అందుకునేలా చేసింది.
ఇంతకూ రాజ్ రాచకొండ ఏం చేశారు? తన సినిమా టీంలో కాస్టింగ్ కౌచ్ అనే పదానికి చోటు లేకుండా చేశారు. సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే.. యూనిట్ సభ్యులు, నటీనటుల్లో ఎవరైనా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటే.. వారిని ముందే తప్పుకోమని హెచ్చరించారట.
అంతేకాదు షూటింగ్ మధ్యలో ఎవరి మీదైనా లైంగిక ఆరోపణలు వస్తే.. ఆ క్షణంలోనే సినిమా నుంచి తప్పుకునేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంతేకాదు అలా మధ్యలో తప్పుకోవడం వల్ల కలిగే నష్టాన్ని వారే భరించాల్సి ఉంటుందనే విషయాన్ని వారికి ముందే తెలియజెప్పి.. దాని ప్రకారమే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అంటే తన యూనిట్‌ను పూర్తిగా కాస్టింగ్ కౌచ్ రహితంగా మార్చేశారు.
ఇది కూడా చదవండి: దొరసాని, మల్లేశం, ఫలక్‌నామా దాస్ తెలుగులో మొదలైన “ఆఫ్ – బీట్” సినిమాల ట్రెండ్..!
రాజ్ రాచకొండ తీసుకొన్న ఈ నిర్ణయం అభినందించదగినదే. మిగిలిన దర్శక, నిర్మాతలు ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తే సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ అనే మాటే ఉండదు. అంతేకాదు టాలెంట్ ఉన్న నటీనటులకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా అవకాశాలు అందుకొనే అవకాశం ఉంటుంది. మల్లేశం సినిమా దర్శకనిర్మాతగా రాజ్ రాచకొండ చేసిన ఈ పనిని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కొనియాడుతుండటం విశేషం. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొన్న ప్రియదర్శి మల్లేశంగా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసు యంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ పురస్కారం అందుకొన్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఖడ్గం సినిమాలో ‘ఒక్క ఛాన్స్’ కోసం హీరోయిన్ సంగీత ప్రొడ్యూసర్‌తో కలసి గడపడానికి ఒప్పుకొంటుంది. ఇటీవలే జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో సైతం ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టే దాన్ని సినిమాలో చూపించామని చెప్పుకొచ్చింది. ఏడాది క్రితం టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సైతం ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా నిరసన ప్రదర్శన చేసింది. ఆ తర్వాత మరికొంతమంది నటీమణులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వారికి మహిళా హక్కుల ఉద్యమకారులు సైతం తోడయ్యారు. ఇదే సమయంలో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ లేదని రకుల్ ప్రీత్ లాంటి కథానాయికలు సైతం బల్ల గుద్ది మరీ చెప్పారు. అయితే ఆమె చెప్పిన విషయాన్ని కొట్టి పడేసిన వారు సైతం లేకపోలేదు.
టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా కాస్టింగ్ కౌచ్ జరగని చిత్ర పరిశ్రమ ఏదీ లేదనే చెప్పుకోవాలి. రాధికా ఆప్టే, వరలక్ష్మి శరత్ కుమార్, కల్కి కొచ్లిన్, రణ్ వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, టిస్కా చోప్రా, పాయల్ రోహత్గీ, సమీరా రెడ్డి, సుర్వీన్ చావ్లా, ప్రీతి జైన్ వంటి ప్రముఖులు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని, ఆ వేధింపులకు తాము కూడా గురయ్యామని చెప్పారు.
ఇది కూడా చదవండి: #MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..
Feature Image: Instagram
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.