కీర్తి సురేష్ "మహానటి" చిత్రం.. నిత్యా మీనన్ "ఐరన్ లేడీ"కి ఆదర్శమా?

కీర్తి సురేష్ "మహానటి" చిత్రం.. నిత్యా మీనన్ "ఐరన్ లేడీ"కి ఆదర్శమా?

 


బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , మాలీవుడ్ .. ఇలా ఏ చిత్ర పరిశ్రమని తీసుకున్నా సరే మనకి ఈమధ్య కాలంలో కనిపిస్తున్న కామన్ ట్రెండ్ - బయోపిక్స్. అందులో భాగంగానే ఈ ఏడాది మేలో విడుదలైన 'మహానటి ' చిత్రం ప్రముఖ మహానటి సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కించడం జరిగింది.


'మహానటి ' చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్ర పోషించగా.. ఆమె అచ్ఛం అలనాటి మహానటి సావిత్రిలాగే అభినయించి అందరి మన్ననలు పొందింది . సినీ విమర్శకులు సైతం ఆమె నటనకి ఫిదా అయ్యారు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే ఆమెని తెర పైన చూస్తుంటే.. మహానటి సావిత్రినే చూస్తున్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు .


ఇక తాజాగా మరొక ప్రముఖ నటి నిత్యా మీనన్ ఒక అత్యంత ఆసక్తి రేపుతున్న బయోపిక్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం జరిగింది.


ఇంతకీ ఆ బయోపిక్ ఎవరి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారంటే - అది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవిగా అక్కడి ప్రజల నుండి పిలిపించుకున్న జయలలితది కావడం విశేషం. జయలలిత మరణించి నేటికి సరిగ్గా రెండేళ్ళు అవుతున్న సందర్బంగా.. ఆమె జీవితకథ ఆధారంగా రూపొందిస్తున్న 'The Iron Lady ' చిత్రం మొదటి లుక్ విడుదల చేశారు నిర్మాతలు.


ఈ చిత్రాన్ని పేపర్ టేల్ పిక్చర్స్ వారు నిర్మిస్తుండగా ప్రియదర్శిని అనే మహిళ దర్శకురాలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు . ఇక ఈ చిత్రానికి India's Margaret Thatcher అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అలాగే ఈ చిత్ర పోస్టర్ విడుదల చేస్తూ.. ఇదొక విప్లవ నాయకురాలి కథ అని కూడా ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.


ఇప్పటికే ఎన్ఠీఆర్ బయోపిక్ దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తుంటే.. జయలలిత బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకి రానుండడం అనేది నిజంగా ప్రేక్షకులకి ఒక ఆసక్తిని కలిగించే అంశమనే చెప్పాలి .


ఇక ఇప్పటికే పలు అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించిన నిత్యా మీనన్.. ఒక నిజజీవిత పాత్రలో ఎలా నటించనుందో అని వేచి చూస్తున్నారు ఆమె అభిమానులు.