సాధారణంగా ఆడవాళ్లు (Women) ఎంత సక్సెస్‌ఫుల్ అయినా సరే.. వారి భర్త ఒక సక్సెస్‌ఫుల్ వ్యక్తి అయితే తన గుర్తింపు మొత్తం భర్త నుంచే లభిస్తుంది. కానీ భర్త నుంచి వచ్చే గుర్తింపును గౌరవిస్తూనే.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఉపాసన. హీరో రామ్ చరణ్ భార్యగానే కాదు.. ఉపాసన కామినేని కొణిదెల (Upasana kamineni konidela) అనగానే అందరూ గుర్తించేలా ఎన్నో ప్రత్యేకతలను సంపాదించుకున్నారు.
అటు అపోలో హాస్పిటల్స్ వారి అపోలో లైఫ్‌కి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. ఈ విమెన్స్ డే రోజు మనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని మనకు స్ఫూర్తిని అందిస్తున్నారు.
అపోలో హాస్పిటల్ ఛైర్మన్ అయిన ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసన. కొడుకులు లేకపోవడంతో కూతుళ్లతో కలిసి తన వ్యాపారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారాయన. ఆయన కుమార్తె శోభా కామినేని ముద్దుల కూతురే ఉపాసన. లండన్‌లోని రీజెంట్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకున్న ఉపాసన ఆపై అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో చేరారు.
ప్రస్తుతం ఆమె అపోలో గ్రూప్‌లోని చాలా సంస్థలకు డైరెక్టర్.. అసోసియేట్ డైరెక్టర్‌గా కొనసాగడంతో పాటు అపోలో లైఫ్‌కి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అపోలో హాస్పిటల్స్ ప్రారంభించిన అపోలో ఫౌండేషన్‌కి కూడా వైస్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతూ ఆ సంస్థ బాధ్యతలు కూడా తానే కొనసాగిస్తున్నారు.
ఇదంతా ఆమె చేసే పనిలో చిన్న భాగం మాత్రమే. స్వతహాగా జంతువులంటే ఎంతో ఇష్టపడే ఉపాసన.. తన ఫార్మ్ హౌజ్‌లో కేవలం కుక్కలను మాత్రమే కాదు.. గుర్రాలు, ఒక ఒంటె, ఇతర జంతువులను కూడా పెంచుతున్నారట! బ్లూ క్రాస్‌లో సభ్యురాలైన ఉపాసన జంతువులను కాపాడాలని అందరికీ చెబుతారు.
మన దేశంలో తక్కువైపోతున్న పులులను రక్షించేందుకు అపోలో ఫౌండేషన్ తరఫున సేవ్ టైగర్ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్నారు ఉపాసన. దీంతో పాటు తన స్నేహితులు, ఇతరులకు పెంపుడు జంతువులను బహుమతిగా ఇస్తూ ఉంటారట. గతేడాది మహేష్ బాబు కూతురు సితారకు ఓ అందమైన పక్షిని ఉపాసన బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే.
ఒకప్పుడు కాస్త లావుగా ఉండే ఉపాసన.. ఇతరులకు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండమని చెప్పడానికి ముందు దాన్ని తను మొదలుపెట్టాలనుకొని.. కొన్ని నెలల సమయంలోనే దాదాపు పదిహేను కేజీలు తగ్గారు. తగినంత బరువు, చక్కటి ఆరోగ్యం ఉంటే ఆరోగ్య సమస్యలు సగం తగ్గుతాయని చెబుతారామె. తన తాతగారైన ప్రతాప్ సి. రెడ్డి చెప్పినట్లు ప్రజలకు హాస్పిటల్ అవసరమే లేకుండా చేయడమే తన లక్ష్యం అంటారు ఉపాసన.
అందుకే అపోలో లైఫ్ ద్వారా ఆరోగ్యంగా ఉండడమెలాగో వివరిస్తూ హాస్పిటల్ అవసరం లేకుండానే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. తన వ్యక్తిగత, వృత్తిగత పనులతో ఎంత బిజీగా ఉన్నా… ఎప్పటికప్పుడు డైట్, బరువు తగ్గడం, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం, డీటాక్స్ ఫుడ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేసుకోవడం తెలియనివారికి తనే స్వయంగా వంట చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గాన్ని చెబుతుంటారు ఉపాసన.
దీని గురించి ఆమె చెబుతూ.. నేను చిన్నతనం నుంచి చబ్బిసిటీ (కాస్త బరువు ఎక్కువగా ఉండడం) తో బాధపడ్డాను. బరువు ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలేంటో నాకు తెలుసు. అందుకే బరువు తగ్గాలనుకున్నా. రెండేళ్ల పాటు డైటింగ్, వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గాను. ఆ రెండేళ్లు ఉదయం పెద్ద గ్లాస్ స్మూతీ, మధ్యాహ్నం యాపిల్స్, సాయంత్రం డిన్నర్‌గా థాయ్ కర్రీ తింటూ గడిపాను. నాకు నచ్చిన బరువుకు చేరుకున్నా.
ఆ తర్వాతే భారత్‌లో ఇలాంటి ఇబ్బందిపడుతున్నవారు చాలామందే ఉన్నారని నాకు అర్థమైంది. దీనివల్లే డయాబెటిస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వారందరికోసం నాకు వీలైన రీతిలో సాయం చేయడానికి ఇలా అపోలో లైఫ్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూనే నా డైట్‌కి సంబంధించిన విషయాలను కూడా అందరితో పంచుకుంటాను అంటారు ఉపాసన.
అపోలో లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో.. మన దేశంలోని ఎన్నో సంస్థల్లో మధ్యాహ్నం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆ తర్వాత ప్రొడక్టివిటీ తగ్గిపోయిందని తేలిందట. అందుకే దీపక్ చోప్రాతో కలిసి జియో (jiyo) అనే వెల్‌నెస్ యాప్‌ని ప్రారంభించడంతో పాటు .. వివిధ కార్పొరేట్ సంస్థలతో కలిసి వాటి ప్రాంగణాల్లో వెల్‌నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాదు.. పల్లెల్లో పోషకాహారం అందించే దిశగా ముందుకెళ్తున్న ఉపాసన అపోలో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీల ద్వారా కేవలం ప్రభుత్వం ఇచ్చే పోషకాహారమే కాదు.. అపోలో ఫౌండేషన్ అందించే పోషకాహారాన్ని కూడా పంచే ఏర్పాటు చేస్తున్నారు. తన తాత గ్రామమైన అరగొండ నుంచి దీన్ని ప్రారంభించారు.
ఇదే కాదు.. చిన్నతనంలో ఓసారి హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు జరిగిన సంఘటన వల్ల.. ఆలస్యం కావడంతో ఓ పాపను కాపాడలేకపోయిన పద్ధతుల కారణంగా బాధపడిన ఆమె.. అపోలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా సెంట్ ఎ ఛైల్డ్ ఫౌండేషన్‌ని కూడా కొనసాగిస్తున్నారు. దీని ద్వారా గ్రామాల్లో శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నారు ఉపాసన..
ఇవే కాదు.. అటు బిజినెస్‌లో అద్భుతంగా రాణిస్తూనే.. ఇటు రామ్‌చరణ్‌కి చక్కటి భార్యగా.. కొణిదెల వారి కోడలిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్నప్పుడు ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లాడారు. చరణ్‌కి ఇలాంటి భార్యా? అని అప్పుడు అన్న అభిమానులతోనే ఇప్పుడు ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తున్నారు ఉపాసన.
తన బిజినెస్‌లో భాగంగా ఎప్పుడూ బిజీగా గడిపే ఉపాసన.. రామ్ చరణ్ డైట్‌కి సంబంధించి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారట! వీరిద్దరూ కలిసి డైట్ పాటించడం, వ్యాయామం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం… ఇలా ఏదైనా కలిసే చేస్తారట. ఇక కొణిదెల వారి కోడలిగా ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే ఏర్పాట్లలో సాయం చేసే ఉపాసన.. అభిమానుల కోసం కూడా తన వంతు కృషి చేస్తుంటారు. మొత్తంగా చెప్పాలంటే అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ అన్నింట్లోనూ పర్ఫెక్ట్ అయిన సూపర్ విమెన్ ఉపాసన అని చెప్పచ్చేమో..!
ఇవి కూడా చదవండి.
#StrengthOfAWoman చరిత్రపుటల్లో నిలిచిపోయిన.. మన మేటి మహిళా డాక్టర్లు ..!
#StrengthOfAWoman ఈ విమెన్ బయోపిక్స్ .. చాలా చాలా స్పెషల్ ..!
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..