సాహో (saaho).. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా రేపు (ఆగస్టు 30) విడుదల కానుంది. ఇప్పటికే అమెరికాలో విడుదలైన సినిమాకి మంచి టాక్ కూడా వస్తోంది. ఈ సినిమా కోసం దేశమంతా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న.. మన బాహుబలి ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నాడు. అందులో భాగంగా ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎంతో బద్ధకస్తుడనని, అందరితో కలవడం కూడా తనకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
“నాలో ఉన్న మూడు సమస్యలు నాకు తెలుసు. నేను చాలా బద్ధకస్తుడిని. నాకు సిగ్గు కూడా చాలా ఎక్కువ. అందుకే కొత్తవాళ్లను కలవలేను. నా ముందు పెద్ద గుంపు ఉంటే.. నాకు భయంగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వాటి గురించి ఆలోచిస్తే అసలు నేను ఈ రంగంలోకి ఎందుకు వచ్చాను.. నేను చేసింది కరక్టేనా? తప్పా? అని ఆలోచించేవాడిని. నా అదృష్టం అనుకుంటా. బాహుబలి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించిన తర్వాత.. ఇక సినిమాలు తప్ప నాకేదీ సూటవ్వదు అని నిర్ణయించుకున్నా.
నేను సిగ్గుపడకూడదని చాలాసార్లు అనుకుంటాను. ఎందుకంటే అలా సిగ్గుపడడం కొన్నిసార్లు నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. కొత్తవాళ్లను కలవాలంటే దానికి ముందు కాసేపు ఆలోచిస్తాను. అనుకోకుండా ఓ పెద్ద గుంపును చూస్తే.. నాకు తెలియకుండానే నాకు సిగ్గు, భయం కలుగుతాయి. దాన్ని మార్చుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇకపై కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను అంటూ.. తనకున్న భయాల గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్”
ఇవే కాదు.. తనతో నటించిన కథానాయికల గురించి కూడా ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అనుష్కతో తన బంధం గురించి మాట్లాడుతూ.. “అనుష్క చాలా అందంగా, పొడవుగా ఉంటుంది. తను లేడీ సూపర్ స్టార్. తను నేను కలిసి బాహుబలి కంటే ముందే బిల్లా, మిర్చి సినిమాల్లో నటించాం. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ అపోహలు తొలగిపోవాలంటే కనీసం తననైనా తొందరగా పెళ్లి చేసుకోమని చెబుతాను. తనలో నాకు నచ్చని విషయం ఒక్కటే.. ఆమె ఎవరి ఫోన్ కాల్స్‌కి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వదు. కనీసం నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయదు” అంటూ అనుష్క గురించి చెప్పాడు ప్రభాస్.
తనతో నటించిన మరో ఇద్దరు కథానాయికలు కాజల్, నయనతారల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రభాస్. కాజల్ గురించి మాట్లాడుతూ.. “కాజల్ నేను రెండు సినిమాల్లో కలిసి నటించాం. అవే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్. తను చాలా ఎనర్జిటిక్. తన ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో తన డ్రస్సింగ్ సెన్స్ నాకు అంతగా నచ్చేది కాదు. తనకు డ్రస్సింగ్ సెన్స్ తక్కువ అనిపించేది. కానీ ఆమె ఇప్పుడు చాలా మారింది. ముఖ్యంగా డ్రస్సింగ్ సెన్స్ విషయంలో చాలా మార్పు కనిపిస్తోంది” అంటూ చెప్పాడు. ఇక నయనతార గురించి చెబుతూ “నయన్ నేను కలిసి యోగి సినిమాలో పనిచేశాం. తన నటనంటే నాకెంతో ఇష్టం. తను తెరపై కనిపిస్తే చాలు.. తనదంటూ ఓ ముద్ర కనిపించేలా చేస్తుంది” అంటూ పొగడడం విశేషం.
వీరి గురించి మాత్రమే కాదు… తన సాహో కథానాయిక శ్రద్ధా కపూర్ గురించి కూడా మాట్లాడాడు ప్రభాస్. “నేను ఇంతకుముందు ఎప్పుడూ బాలీవుడ్ కథానాయికలతో పనిచేయలేదు. అయితే ఈ పాత్రకు తను సరైన ఎంపిక అని తనని చూసిన తర్వాతే తెలుసుకున్నా. తన పాత్ర కేవలం పాటలకు ముందు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. తన పాత్ర సినిమాలో చాలా ముఖ్యమైనది. సినిమాలో అతి ముఖ్యమైన కొన్ని పాత్రల్లో తనది ఒకటి. తను ఈ సినిమా కోసం ఫైట్లు కూడా చేసింది.
ఇలాంటి స్ట్రాంగ్ పాత్ర కోసం తన లాంటి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి దొరకడం అదృష్టం. తను సెట్స్‌లో అందరితో కలుపుగోలుగా ఉండేది. నేను నటించిన హీరోయిన్లలో చాలామంది దక్షిణాదిలో తమ కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లోనూ నటించారు. కానీ శ్రద్ధా బాలీవుడ్లోనే అడుగుపెట్టింది. అంత పెద్ద స్టార్ అయినా తనలో ఏమాత్రం గర్వం లేదు. అన్ని పనులను చాలా అంకితభావంతో చేసేది” అంటూ తన కోస్టార్ గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్.
సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో.. దాదాపు 350 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా కనిపించనున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ వంటి నటులు కూడా ఉన్నారు. జాక్వెలిన్ ఓ ప్రత్యేక గీతంలో తళుక్కుమంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.